నిర్లక్ష్యంగా నడిపినా శిక్ష లేదా? | Salman verdict: The witness who stood by his statement till his death | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా నడిపినా శిక్ష లేదా?

Published Fri, Dec 25 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

నిర్లక్ష్యంగా నడిపినా శిక్ష లేదా?

నిర్లక్ష్యంగా నడిపినా శిక్ష లేదా?

విశ్లేషణ:
సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడకపోతే పోయింది. నిజం చెప్పిన బాడీగార్డు జైలుకు వెళ్లడం విషాదం. సల్మాన్ మీద ఎఫ్‌ఐఆర్ వేసినందుకు, ఇతర సాక్షుల వలే అమ్ముడుపోనందుకు రవీంద్ర పాటిల్ చివరివరకు నానా కష్టాలు పడ్డాడు.
 
 సెప్టెంబర్ 28, 2002, ముంబై నగరం బాంద్రా ప్రాంతం. అంతకుముందు హీరో సల్మాన్‌ఖాన్ ఒక హోటల్‌లో తాగుతుంటే బయట ఆయన బాడీగార్డు రవీంద్ర పాటిల్ ఎదురుచూస్తున్నాడు. తరువాత ఖాన్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని టొయోటా లాండ్ క్రూజర్ కారును ఫుట్‌పాత్ మీదకు దూసుకుపోయి అక్కడ పడుకున్న ఐదుగురి మీంచి తీసుకువెళ్లి పక్కనే ఉన్న లాండ్రీని ఢీకొన్నాడు. ఒకడు మరణించాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఆ సంఘటనకు దిగ్భ్రాంతి చెందిన హీరో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాడీగార్డు వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

 తెరదేవుడు, కష్టాల్లో ఉన్న వారిని కాపాడే హీరో సల్మాన్‌ఖాన్. తన ప్రాణాలకు తెగించి విధి నిర్వహిస్తూ ప్రాణాలు కాపాడే బాడీగార్డ్ కూడా. బాడీగార్డ్ హీరో నిజం చెబుతున్నాడా? అతని నిజమైన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ చెప్పిన సాక్ష్యం నిజమా? సినీ బాడీ గార్డు నిజంగా ప్రాణాలు తీసేంత నిర్లక్ష్యంగా తాగి కారును పేదల మీంచి తీసుకుపోయాడంటే నమ్మడం ఎలా? దయార్ధ్ర హృదయుడిగా సహజనటన ప్రదర్శించే ప్రతిభావంతుడు నిజంగా నిర్దయుడంటే నమ్మడం ఎంత కష్టం? అందుకే అతని బాడీగార్డు సాక్ష్యాన్ని హైకోర్టు నమ్మలేదు. నట బాడీగార్డును నమ్మింది. కింది కోర్టు నమ్మడం తప్పనీ తేల్చింది. కారులో ఉన్న మరో సాక్షి కమాల్ ఖాన్‌ను పిలిపించి నిజం చెప్పించలేక పోవడం ప్రాసిక్యూషన్ వారి తప్పు అని హైకోర్టు విమర్శించింది.

 కారులో ఉన్న పాటిల్ సాక్ష్యం నమ్మశక్యం కాదు. కమాల్ ఖాన్ సాక్ష్యం లేదు. మిగిలిన సాక్షులందరూ మాట మార్చారు. అశోక్ సింగ్ అనే కొత్త వ్యక్తి ఆఖరి దశలో వచ్చి కారు నడిపింది తానేనని వివరించాడు. దాన్నీ కోర్టు నమ్మలేదు. కారు తొక్కితే ఒకరి ప్రాణం పోయిన మాట, నలుగురు గాయపడిన మాట నిజం.  కాని కారు ఎవరు నడిపారో కోర్టు ముందుకు రాలేదు.

 కారు నడిపేటప్పుడు సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని రవీంద్రపాటిల్ మొదట ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పుడు అందులో రాయలేదు. ఆ విషయం తరువాత చెప్పారు కనుక నమ్మం పొమ్మంది హైకోర్టు.

 కాని నియమాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ కీలకమైన సంక్షిప్త నేర ప్రకటన. అందులో నేరం సూచనప్రా యంగా ప్రస్తావిస్తే సరిపోతుంది. తరువాత ప్రకటనలు సాక్ష్యాల ద్వారా వివరాలు రుజువు చేసుకోవచ్చు. ఎఫ్‌ఐఆర్ ఆలస్యం లేకుండా దాఖలు చేసి అందులో ఉన్న అంశాలు తరువాత ఎవరూ ఖండించకుండా ఉంటే దాన్ని నేరం రుజువు చేయడానికి కీలకమైన ఆధారంగా భావించాలని నేర నిర్ధారణా ప్రక్రియ చట్టం నియమాలు వివరిస్తున్నాయి. కాని తాగి నడిపాడని తరువాత చేర్చ డం సరికాదని హైకోర్టు అంటున్నది. ఒకవేళ తాగాడని తేలకున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు శిక్ష వేయవచ్చు కదా?

 ఖాన్‌కు శిక్ష పడకపోతే పోయింది. నిజం చెప్పిన బాడీగార్డు జైలుకు వెళ్లడం విషాదం. సల్మాన్ మీద ఎఫ్‌ఐఆర్ వేసినందుకు, మాట మార్చాలని ఎందరు ఎంత గట్టిగా చెప్పినా మొండిగా విననందుకు, ఇతర సాక్షుల వలే అమ్ముడుపోనందుకు రవీంద్ర పాటిల్ నానా కష్టాలు పడ్డాడు. అతని పోలీసు సహచరులు, అధికారులే అతన్ని వేధించారు. ఉద్యోగం వదులుకునే స్థితి కల్పించారు. కుటుంబం కూడా వదిలేసింది. మిత్రులెవరూ వెంట లేరు. కోర్టుకు రాలేకపోయి నందుకు కోర్టు ధిక్కార నేరం కింద జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. చివరకు రవీంద్ర పాటిల్ క్షయ రోగంతో ఒంటరిగా మరణించడం భయానక విషాదాంతం.

 ఇంతచేసినా పాటిల్ సాక్ష్యాన్ని హైకోర్టు నమ్మడా నికి వీల్లేదని చెప్పింది. ఇతని సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని కింద కోర్టు శిక్ష వేసింది. సమ న్యాయపాలన వర్ధిల్లే మన వర్థమాన దేశాల్లో ఇవి వింతలు. న్యాయ చిత్ర విచిత్రాలు.

 సాక్ష్యాల సేకరణలో పరిశోధనలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు మండిపడింది. నమ్మకూడని సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష వేయడం తప్పని కోప్పడింది. సామాన్యులకు ఈ విషయాలు అర్థం కావు. ఒక కోర్టు సాక్ష్యాన్ని ఎందుకు నమ్ముతుందో తెలియదు. మరొక కోర్టు పూర్తిగా ఎందుకు కొట్టి పారేస్తుందో అంతకన్నా తెలియదు.

 ఒకవేళ సాక్ష్యం సరిపోకపోతే పరిశోధన కోసం కేసును పంపకపోవడం ఎందుకు? కింది కోర్టు నేర నిర్ధారణ సరిగ్గా జరపకపోతే కింది కోర్టుకు మళ్లీ విచారించమని పంపే వీలు ఉంది కదా? తాగిన సాక్ష్యం లేకపోతే, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరానికైనా శిక్షపడ కూడదా? తాగి కారు నడిపే హక్కు వీఐపీలకు తెర తారలకు ప్రత్యేకంగా ఏమైనా ఉందా? వారి లెసైన్సుల నయినా రద్దు చేశారా? తాగి నడిపే వారిని అదుపు చేయలేని అధికా రులెవరో గుర్తించారా? బాధ్యత నిర్వర్తించలేని ఆ అధికారులపైన చర్యలు తీసుకునే ఆలోచన ఏదైనా ఉందా లేదా?
 తెరవేలుపైన సల్మాన్ ఖాన్ గారి నెత్తురు నమూ నాలను సేకరించి పోలీసు స్టేషన్‌లో రెండు రోజులు ఎందుకు పెట్టుకున్నారు? వెంటనే ప్రయోగశాలకు ఎందుకు పంపలేదు? మొత్తం రాష్ట్రానికి ఒకే ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటే నేరాలన్నీ ఏ విధంగా రుజువు అవుతాయి? అప్పుడు తాగి నడిపిన తారలు నిర్దోషు లుగా విడుదల కావడమే న్యాయమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది.
http://img.sakshi.net/images/cms/2015-05/51431028399_295x200.jpg
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, మాడభూషి శ్రీధర్
 professorsridhar@gmail.com

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement