శరద్ పవార్ నీడలో
ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
గత దశాబ్ద కాలంగా బీజేపీ పవార్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఎలాంటి చర్చలు మొదలు కాకముందే బీజేపీ, శివసేనలు రెండూ పవార్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే, కాంగ్రెస్ సరసనే ఉండొచ్చని చెప్పేశాయి. పవార్ ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తన సొంత పార్టీ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుండటం సహజమే. ఆయన మోడీని కలిసి ఉండాల్సిందేమో.
కథనానికి, దానికి కారణానికి మధ్య చీకటి నీడలు తరచుగా పరుచుకుని ఉంటాయి. శరద్ పవార్, నరేంద్ర మోడీని కలుసుకున్నారంటూ ఒక మరాఠీ వార్తా పత్రికలో వచ్చిన కథనం సరైనది కాదు. కానీ సహేతుకమైనదేనని అనిపిస్తుంది. పరిస్థితుల సంబంధమైన ఆదారాలు ఒప్పించగలిగేవిగా ఉండటంతో ఆ పత్రిక ఆ కథనానికి ఆధారాలను కనుగొనడం కోసం తీవ్రంగా అన్వేషించలేదు. అలా అని ఆ కథనాన్ని ప్రచురించాలని ఆ పత్రిక నిర్ణయం తీసుకోవ డం సముచితం కాజాలదు. కాకపోతే సరైన ఆధారాలు లేకుండానే ఆ కథనాన్ని ఎందుకు ప్రచురిం చాల్సి వచ్చిందో వివరిస్తుంది.
పవార్ ఆ కథనాన్ని అస్వాభావికమైన రీతిలో తీవ్రంగా ఖండించారు. ఆయన వైపు నుంచి వినవస్తున్న కథనాన్నే మనం అంగీకరించాల్సి ఉంటుంది. అలా అని పవార్ ఎన్నడూ బీజేపీ నేతలను జనాంతికంగా కలుసుకోలేదని కాదు. కలుసుకున్నారు, కలుసుకునే పూర్తి హక్కు ఆయనకుంది. రాజకీయవేత్తల మధ్య సంభాషణ జరగడానికి వారి మధ్య ఏకాభిప్రాయం అక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన సరళత్వం అదే. టెలివిజన్ కెమెరా ఎప్పుడూ చూస్తూనే ఉండే యుగంలో పవార్, మోడీల వంటి అత్యున్నత స్థాయి నేతలు దృశ్యపరమైన ఆధారాల పరీక్ష నుంచి తప్పించుకోలేరు. ప్రతి పర్యటనలోనూ పాత్రికేయులు మోడీని వెన్నంటే ఉంటారు. ఎన్నికల సమయంలో రాజకీయవేత్తలకు ఎప్పటికీ పూర్తిగా సురక్షితమైనదిగానే ఉండే రక్షిత ప్రదేశం ఉండదు. ప్రతిదీ చిల్లుపడ్డ నీటి ట్యాంకర్‌లాగా కారిపోతూ ప్రజా విధులను నిర్వహిస్తుంటుంది.
ఆ మరాఠీ పత్రిక వర్తమానంలోని వాస్తవాలపై గాక గత చరిత్రపైనే ఆధారపడింది. కాబట్టే ఆ కథనాన్ని ప్రచురించింది. ఏది గెలవబోతున్న పక్షమనే విషయాన్ని పసిగట్టడంలో పవార్ ఎప్పుడూ సూక్ష్మగ్రాహే. సంతృప్తికరమైన తన సొంత వ్యక్తిగత భారమితిని క్షేత్ర స్థాయి వాతావరణ నివేదికలతో సరిచూసుకొని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రతిపక్షాల మధ్య ఆయన అటూ ఇటూ దుంకుతూ ఉంటారు. కోపతాపాలు లేదా ఇష్టాయిష్టాలు వంటి అంశాలు రాజకీయ నిర్ణయాలలో జోక్యం చేసుకోడాన్ని ఆయన అనుమతించరు. విమర్శకులు దీన్ని అనైతికత అంటుంటారు. అలాంటి తీర్పులన్నీ ఓడిపోయేవారి విశేష హక్కులంటూ పవార్ ఆ విమర్శలను దులిపేసుకుంటారు.
పవార్ గెలుస్తున్నంత కాలం పోయేది ఏదీ లేదు. ఎన్‌డీఏ హయాంలో ఆయన ఉండకూడని పక్షాన ఉన్నారు. అయినా ఎన్‌డీఏ నేత, ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో తన వ్యక్తిగత సంబంధాలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నారు. విలేకరులు బయట తిరిగి వివిధ కథనాలను, ధోరణులను తెలుసుకుంటారు. కాంగ్రెస్ ఈ ఏడాది ఇబ్బందుల్లో ఉందని వారికి తెలుసు. మహారాష్ట్రలో కూటములు ఇంకా పూర్తిగా కొలిక్కి రాక ముందే పవార్ ఉండకూడని పక్షంలో ఉండి తన ప్రతిష్టకు మచ్చ తెచ్చుకుంటారని నమ్మడానికి వాళ్లు విముఖంగా ఉంటారు. అయితే ఈలోగా పరిస్థితులపరమైన ఆధారాలు పోగుబడుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పవార్ అధికారిక ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు సాగించారు. మోడీని కోర్టులు నిర్దోషిగా తేల్చాయి కాబట్టి ఆయనపై ఉన్న గుజరాత్ అల్లర్ల కేసును మూసివేసినదిగానే పరిగణించాలని ప్రఫుల్ పటేల్ సూచించారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో పవార్‌కు సహచరుడు.
కూటముల విషయంలో అవకాశాలు తెరుచుకునే ఉన్నాయని పవార్ ఇతర అనుయాయులు చెప్పారు. అక్కడి నుంచి ఇ పవార్. మోడీని కలుసుకున్నారనే కథనానికి చేరడానికి మిగిలింది ఒకే ఒక్క గంతు. అది వాస్తవంగాక పోయినా కనీసం కవితాత్మక వాస్తవం అవుతుంది.
సంప్రదాయకమైన పాత్రలు తారుమారు కావడమే ఈ కథలోని మలుపు.
ఇంతవరకు మహారాష్ట్రకు సంబంధించి ఆటలోని నిబంధనలను అన్నిటినీ పవారే రాసేవారు. అయితే సీట్ల పంపిణీలో తను ఏం చెబితే అదే జరిగేటంత ఎక్కువగా తన పాత్రను అంచనా వేసేటంత వెర్రివాడు మాత్రం ఎప్పుడూ కాలేదు. కాంగ్రెస్‌తో సఖ్యతను కాపాడుకోవడం కోసం 2004 తర్వాత ఆయన ఢిల్లీలో తనకు హోదా తగ్గించడాన్ని ఆంగీకరించారు. కానీ పవార్ బలం లేనిదే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నటికీ అధికారంలోకి రాగలిగేది కాదని ఆయనకూ తెలుసు, కాంగ్రెస్‌కూ తెలుసు.
ఈ క్రమానికి మోడీ గండికొట్టారని పవార్ శిబిరంలోని పునరాలోచనను బట్టి తెలుస్తోంది. విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లోనూ, ముంబై నుంచి పుణే వరకు ఉన్న ప్రాంతంలోనూ మోడీ దుమారం చెలరేగే అవకాశం గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో మోడీ అనుకూల ఓటర్లను తనకు వ్యతిరేకం చేసుకోకూడదనైనా కనీసం పవార్ భావిస్తారు. అయితే వినవస్తున్న వార్తలను బట్టి ఆయన పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. బీజేపీ, శివసేనలు కూడా పునరాలోచనలో పడ్డాయి.
గత దశాబ్ద కాలంగా బీజేపీ పవార్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఎలాంటి చర్చలు మొదలు కాకముందే బీజేపీ, శివసేనలు రెండూ... పవార్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే, కాంగ్రెస్ సరసనే ఉండొచ్చని చెప్పేశాయి. కాషాయ భాగస్వాములు పెరిగిన తమ ఓట్ల శాతానికి కొన్ని కీలకమైన చేర్పులను చేయగలిగారు. అట్టడుగు స్థాయిలోని ఆ చిన్న చిన్న పార్టీలు మట్టిలో నాటుకున్న గడ్డి వాసనను వేళ్ల దగ్గరే అత్యుత్తమంగా గ్రహించగలుగుతాయి. తమంతట తాము అధికారంలోకి రాలేమని వాటికి తెలుసు. ముందుకు తీసుకుపోగల పెద్ద వాహనంలోకి ఎక్కి పయనించడం అవసరమని కామన్‌సైన్స్ సూచిస్తుంది. ఇందుకు సంబంధించి సంబంధించి వ్యక్తిగతమైనది ఏదీ లేదని దేశంలోని మరే ఇతర రాజకీయవేత్త కంటే ఎక్కువగా పవార్‌కు తెలుసు. ఇది రాజకీయం, అంతే
గాలిలోని గడ్డిపోచలు ముంచుకొస్తున్న తుపానును సూచిస్తాయి. మహారాష్ట్ర గత దశాబ్ద కాలంగా యూపీఏకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా ఉన్నందువల్ల ఈ తుపానుకు ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ తనకున్న ఎంపీలను గెలిపించుకోలేక పోతే... దేశంలోని అత్యధికభాగంలో వీస్తున్న పెనుతుపానుకు అది కూకటివేళ్లతో పెకలించుకుపోయే ప్రమాదం ఉంది. మోడీ గెలవలేని పశ్చిమబెంగాల్, ఒడిశాలలో సైతం కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉంది.
పవార్ ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తన సొంతపార్టీ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుండటం సహజమే. బహుశా ఆయన మోడీని కలిసి ఉండాల్సిందేమో.