
ఇక చాలు ఈ చీలికలు..!
ప్రగతి శక్తులు నేడొక రకం ‘ముక్కలు ముక్కల’ స్థితికి సంబరపడుతున్నాయి.
ప్రగతి శక్తులు నేడొక రకం ‘ముక్కలు ముక్కల’ స్థితికి సంబరపడుతున్నాయి. చీలిక తరువాత చీలికకు ఉవ్విళ్లూరుతున్నాయి. ‘ఫ్రాగ్మెంటేషన్’ని ‘సెలబ్రేట్’ చేసుకుంటున్నాయి. ప్రతి విభజన దాని కదే గొప్ప అన్నట్టు చిందులేస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలుసుకోడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. ప్రతి ప్రగతి శీలి తనలోకి తాను చూసుకుంటే చాలు. చీలికలు పేలికల క్రమంలో యెవరికి యెవరు ఉపయోగపడ్డారు, పడుతున్నారు? పండుగ భక్ష్యాలు వుట్టి మీద పెట్టి తలుపులు మూయడం మరిచిపోయిన ఇంట్లో కుక్కలు పిల్లులు దూరి నట్లు... విభజనోత్సాహం మన ఇళ్ల తలుపులను ప్రతీప శక్తులకు బార్లా తెరిచింది. ప్రజా పోరాటాల ఫలితాలు కుక్కలు, పిల్లుల పాలవుతున్నాయి. నయనతారా సెహగల్ లేదా అరుంధతీ రాయ్ యేవో కొన్ని బహుమతులు వెనక్కివ్వడం, అడవుల్లో కొన్ని తూటాలు పేల డం... వంటి చిన్న చిన్న ఘటనలు చరిత్రను మలుపు తిప్పలేవు. ప్రజలల్లోని అసంతృప్తిని నిరపాయకరంగా బయటికి పంపే సేఫ్టీ వాల్వులుగా పని చేస్తాయంతే.
ప్రగతి శక్తుల మధ్య ఐక్యతకై ఒక వుద్యమమే జరగాలి. ఏది సత్తు ఏది చిత్తు అనేది ఉద్యమ గీటు రాయి మీదనే నిగ్గు తేలాలి. లేకుంటే.. మేమింతే, మేమిలాగే ప్రజల్ని పిండుకుంటాం, మేమిలాగే సనాతన అధర్మాల్ని నవీన ధర్మంగా ప్రచారం చేసి జనం మెదళ్లకు సంకెళ్లు బిగిస్తాం... మీరేమీ చేయలేరని ప్రతీప శక్తులు వికటహాసం చేస్తూనే ఉంటాయి. పౌర సమాజంలో అస్తిత్వ వుద్యమాలు ముందుకు వచ్చినప్పుడు జనం ముక్కలు ముక్కలుగా (ఫ్రాగ్మెంటెడ్‌గా) వ్యవహరించడం సహజమే. సహ సమూహాల్ని విస్మరించి ఎవరి సంగతి వారు చూసుకోడం సహజమే. అది అలాగే నిర్నిబంధంగా కొనం సాగదు. ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా.. దాన్ని ఎవరు వాడుకుంటారనే దాన్ని బట్టి ఆపైన సమాజ చలనం వుంటుంది. సహజ పరిణామం (స్పాంటేనిటీ) అనే దాన్ని కూడా తోసి రాజనలేం. తోసి రాజనరాదు కూడా. పిసికి పండు చేయడం కన్న చెట్టు మీద పండాక కోసుకోడమే సరైనది. పండు అయిన దాన్ని కోసుకోడం లేదా పండు కావడానికి తగిన దినుసులు అందించడం... అది మానవ యత్నమే. ఆ పని ఎవరు చేస్తారు... ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా... అనే దాన్ని బట్టి సమాజ చలనం వుంటుంది.
ఈసారి ప్రగతి శక్తులు వెనుక బడ్డాయి. తమలో తాము కలహించుకుని మరింత ఫ్రాగ్మెంటేషన్‌కి లోనయ్యాయి. విడిపోవడమే ఉద్యమమైపోయింది. ఎందుకు విడిపోతున్నామో చూసుకోలేనంత మైమరుపు. విడిపోవద్దని, కలిసుందామనే వాళ్ల మాటను పెడచెవిని పెట్టాయి. ప్రగతి శక్తులు సంఘటనల తోక పట్టుకుని గోదారి యీదాలనుకుంటున్నాయి. సహజ గతిలో జరిగే పరిణామాలలో ప్రజానుకూలమైన వాటిని ఎంపిక చేసి, ఆ దిశగా సమాజాన్ని కదిలించాల్సిన పని చేయకపోవడం వల్ల ప్రతీప శక్తులది విజయమయ్యింది. జీవితం అన్న తరువాత మనుషులు... రకరకాలుగా కలిసి, విడివడి సమాజ గతిని ప్రభావితం చేస్తుంటారు. కదలికలు పైకి కని పించేంత సహజంగా జరగవు. సమాజం లోని నాయక శక్తులు వాటిలో కలుగజేసుకుంటూ వుంటాయి. ‘కలుగజేసుకోడం’ యివాళ యే దిశగా జరుగుతోంది? ప్రగతి శీలచలనానికి ఏయే శక్తులు కలవాలో వాళ్లు కలవడం లేదు. ఎవరెవరు కలవకూడదో వాళ్లు కలుస్తున్నారు.
యీ దృశ్యాన్ని మార్చలేమా? యిది ప్రగతివాదులందరి ఆత్మావలోకన సమయం. ‘నేను ఆత్మ విమర్శ చేసుకునేదేమీ లేదు’ అనుకునే వారి రెక్కలు వారి ఆత్మలకు అంటుకుని విడవు. వాళ్లెప్పటికీ ఎగరలేరు. జనం జెండాలు ఎగరేయనూ లేరు.
ముక్కలు ముక్కలైపోయాం. మనల్ని మనం కలిపి కుట్టుకుం దామా? కలిపి కుట్టుకోలేకపోతే మన ఆభిజాత్యాలే ఉంటాయి, మనం ఉండం! మునుపు మనల్ని ముక్కలు చేసుకున్నది మనమే కావొచ్చు. గతంలో మనల్ని ముక్కలు చేసిన సిద్ధాంతాలకు కర్తలం మనమే కావొచ్చు.
మన కత్తుల పదును నిరూపించడానికి మన కుత్తుకలు మనం కోసుకునే వైఖరిని విడనాడితే, ప్రజల కోసం చేయాల్సిన త్యాగాలలో మొట్టమొదటిది భేషజాల త్యాగమేనని గుర్తించగలి గితే.. విభజనలకు అతీతంగా ఆలోచించగలుగుతామేమో.
మడమ తిప్పని యోధులం అనిపించుకోడం గొప్ప ఏమీ కాదు. ఏమి తిప్పినా ఏమి తిప్పకపోయినా చివరికి ప్రజలు గెలవాలి. ఎవరూ గెలవని యుద్ధమంటూ ఏదీ వుండదు. ప్రగతి శక్తులకు ప్రతీప శక్తులకు మధ్య యుద్దం ఎన్నాళ్లు జరిగినా, ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ప్రజలే గెలవాలి. ప్రజలు గెలవడమంటే సమాజం ముందుకు పోవడమని అర్థం. కొన్ని ఒడిదుడుకులున్నా, సమాజం చలించేది ముందుకే. ప్రజల కోసం అవసరమైతే... ప్రగతి శక్తులు మడమ తిప్పడానికీ వెనుదీయవు. సొంత భేషజాలకు జన ప్రయోజనాల్ని బలి పెట్టవు.
ఎలాగైనా గెలవాల్సిన వాళ్లు ప్రజలు. వారికెందుకు లేనిపోని యుద్ధ ధర్మాలు? ప్రతీప శక్తులు ఏనాడూ పాటించని ధర్మాలు? ప్రగతి నిరోధానికి అత్యాలంకారిక భాషలో రాసిన కావ్యాలు? జనం తమ కావ్యాలు తాము రాసుకుంటారు. అడుగడుగు ఐక్యత గేయాలు పాడుకుంటారు. ఇది మనల్ని మనం కలిపి కుట్టుకోవలసిన సమయం. లేకుంటే చస్తాం. యెస్, ఛస్తాం.
ఉదాహరణకి యూపీలో దళిత శ్రేణులు బిఎస్పీతో మాత్రమే లేరు. భిన్న పక్షాల మధ్య చీలిపోయి ఉన్నారు. గత రెండు దశాబ్దాలలో సమాజంలో వచ్చిన ‘క్వాంటిటేటివ్’ మార్పులు దీనిక్కారణం. యివి ‘క్వాలిటేటివ్’ మార్పులు కావు గాని, రాజకీయ ఏకీకరణల మీద నిర్ణాయక ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు కావలసింది విభజన కాదు. ప్రగతి శక్తుల మధ్య ఐక్యత. అది సమస్య నుంచి సమస్య వరకు ఉండే ఐక్యతైనా ఫరవాలేదు.
దళితుల్లో పెట్టుబడిదారులు రావాలి, దళిత కవుల్లోంచి కృష్ణ శాస్త్రులు రావాలి అనుకున్నాం. అప్పుడు గాని సమాజంలో దళి తులు సాధించుకుంటున్న ప్రజాతంత్ర స్థానం పదిలం కాదని అనుకున్నాం. సమాజం యింకా అంత ముందుకు పోలేదు. పేద కులాలలో కాస్త బాగుపడిన వాళ్లు ప్రతీప శక్తులతో కలిసి పోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది సహజం. తప్పు పట్టి ప్రయోజనం లేదు. కొత్త నేపథ్యంలో ప్రగతి శక్తులు తమను తాము కలిపి కుట్టుకోడానికి దారులు వెదకాలి. ఉన్నదాన్ని లేదని భ్రమించడం కన్న.. ఉన్న స్థితిలోనే గెలుపు దారులకై అన్వేషణ ఉపయోగకరం.
హెచ్చార్కె
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : hrkkodidela@gmail.com