స్వీయ తప్పిదాలతో మూల్యం | Terms of of self-weeks | Sakshi
Sakshi News home page

స్వీయ తప్పిదాలతో మూల్యం

Published Wed, May 14 2014 11:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

స్వీయ తప్పిదాలతో మూల్యం - Sakshi

స్వీయ తప్పిదాలతో మూల్యం

2009 ఎన్నికల తర్వాత ఆత్మవిశ్వాసం హెచ్చి అనుసరించిన విధానాల పర్యవసానంగానే కాంగ్రెస్ ఓటమిపాలు కాబోతోంది. ఈ ఓటమికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బాధ్యత వహించక తప్పదు. మన్మోహన్‌ను తప్పించి ఆ స్థానంలో రాహుల్‌గాంధీని కూర్చోబెట్టేందుకు సోనియా వందిమాగధులు చేసిన ప్రయత్నాలు ఎవరికి తెలియవు?
 
 కేంద్రంలో పదేళ్లపాటు తిరుగులేని అధికారం చలాయించిన కాంగ్రెస్ నాయకుల మొహంలో ఓటమి కళ తాండవిస్తోంది. రాజకీయాల్లో ఓటమి ఎవరికైనా తప్పదు. శుక్రవారం ఈవీఎంలలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభమయ్యాక పార్టీల జాతకాలు బయటపడతాయి. ముంచుకొస్తున్న పార్టీ పరాజయానికి ఎవరు బాధ్యత వహిస్తారు. ‘విజయానికి తండ్రులు చాలా మంది ఉంటారు, అపజయం ఎప్పుడూ అనాథే’ అని గతంలో జాన్ కెనడీ అన్న మాటలు గుర్తుంచుకోవాలి. అంతా తానై పార్టీ ప్రచారబాధ్యతను భుజానకెత్తుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబమే ఓటమికి బాధ్యత వహించాలి. అయితే ఈ మాట ఏ కాంగ్రెస్ నాయకుడూ బాహాటంగా అనకపోవచ్చు. అది వేరే విషయం. ఎన్నికల్లో ఓటమికి అసలు కారణాన్ని అన్వేషించి దాన్ని స్వీకరించాలి. అలా కాకుండా తమ తప్పిదాలకు ఇతరులను బలిచేయడం కాంగ్రెస్‌లోనూ, ముఖ్యంగా గాంధీ కుటుంబంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. వారు క్రమంగా ఎన్నికల పరాజయాన్ని తెరమరుగయ్యేలా చేస్తారు.

 2009 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 206 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబంలో ఆత్మవిశ్వాసం హెచ్చింది. 110 కోట్లమంది జనాభా ఉండే దేశాన్ని పరిపాలించడం తమకు కష్టమేమీ కాదని ఆమె భావించడంతో తప్పులు మొదలయ్యాయి. హైస్కూలు వరకే చదువుకున్న సోనియాకు ఏ రంగంలోనూ చెప్పుకోదగ్గ ప్రవేశం లేదు. అయినప్పటికీ ఆమె నేతృత్వంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. శాశ్వతంగా అధికారంలో కొనసాగవచ్చని ఆమె భావించారు.

 ప్రజల్ని ఏమార్చే పన్నాగం

 ఎన్నికల్లో విజయం ఎలా సాధించాలో తమకు తెలుసునని గాంధీ కుటుంబం భావించడం మొదలుపెట్టింది. వాస్తవానికి గాంధీ కుటుంబం అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల దేశంలోని మధ్యతరగతి వర్గాల్లో, నిరుద్యోగ యువకుల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రతి సందర్భంలోనూ తమ పూర్వీకులు పడ్డ పలు బాధలను గాంధీ కుటుంబీకులు ఏకరువు పెట్టడం, అధికారాన్ని అనుభవించేందుకు దాన్నే రాజమార్గంగా ఎంచుకోవడం ఒక రివాజుగా మారింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని అధిగమించడానికి కాంగ్రెస్‌పార్టీ తెలివిగా బాగా సంపన్నులనూ, ప్రముఖులనూ, నటులనూ, క్రీడాకారులనూ ఎన్నికల్లోకి దింపింది. నందన్ నీలేకనీ, మాజీ క్రికెటర్లు మహమ్మద్ అజహరుద్దీన్, మహమ్మద్ కైఫ్, శశి థరూర్, నగ్మా, నవీన్ జిందాల్ వంటి వారికి టికెట్లు ఇచ్చింది. ఇలాంటివారు పోటీచేస్తే ద్రవ్యోల్బణం, అవినీతి కుంభకోణాలు ప్రచారంలోకి రావని, ప్రజలను పిచ్చివాళ్లను చేయవచ్చన్నది కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం.

 2009 ఎన్నికల్లో తమవల్లే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని సోనియా కుటుంబం భావించగా, తన కృషి కారణంగానే ప్రభుత్వం నిలబ డిందని ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు. యూపీఏకు పునరధికారం డాక్టర్ సింగ్ రెక్కల కష్టమేనన్న విషయాన్ని అంగీకరించడం సోనియాకు, రాహుల్‌కూ మనసొప్పలేదు. ఆ ఖ్యాతి మన్మోహన్‌కు ఇవ్వడం వారికి ఇష్టం లేకపోయింది. సింగ్‌ను తప్పించి రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టేందుకు సోనియా వందిమాగధులు వంతపాడడం మొదలెట్టారు. దీనిపై ప్రధాని బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా ఆయన దీన్ని పరాభవంగానే భావించారు. ఏదో ఒకరోజున రాహుల్ ప్రధాని అవుతారన్న భావన మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను మసకబర్చడమే కాకుండా ప్రధానికి పాలనపై ఆసక్తి లేదన్న అభిప్రాయం కలిగించింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి పాలన లేకుండా నిస్తేజంగా కొనసాగింది.

 ప్రజాకర్షక పథకాల ద్వారా ఎన్నికల్లో గెలవచ్చని భావించిన సోనియా వృథా పథకాలకు రూ. లక్షల కోట్లు కేటాయించాల్సిందిగా మన్మోహన్‌ను ఆదేశించారు. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసింది. 2009 నుంచి పెరుగుతున్న ధరలతో ప్రజలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌నూ అసహ్యించుకోవడం ప్రారంభించారు.

 సోనియా తప్పిదం

 నరేంద్ర మోడీ జాతీయస్థాయి నాయకుడుగా ఎదగగలిగారంటే అది సోనియా పుణ్యమే. గుజరాత్ మతకలహాలను దృష్టిలో పెట్టుకుని 2003 నుంచి నరేంద్ర మోడీని సోనియా ‘మృత్యు బేహారి’గా అభివర్ణించడం ప్రారంభించారు. ఈ అల్లర్లకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేందుకూ, విచారణ జరిపించేందుకూ ఆమె చేయని ప్రయత్నం లేదు. ఈ అధికార దుర్వినియోగం అంతా మోడీని హీరోను చేసింది. కాంగ్రెస్ నాయకులు మోడీని పట్టించుకోకుండా ఉంటే మోడీ ఇపుడు గుజరాత్‌కు ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండేవారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిత్యం వార్తల్లో ఉండేవారు కాదు. ఇది సోనియా చేసిన తప్పిదమే.

 సోనియా పెద్దగా చదువుకోకపోయినా చాలా తెలివైన నాయకురాలు. ఓటు బ్యాంకును సమకూర్చుకుంటే దాని పునాదిపై విజయాన్ని నిర్మించుకోవచ్చన్నది ఆమె వ్యూహం. ఏదైనా బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గంలో ఖాయంగా 25 శాతం ఓట్లు వేయించుకోగలిగితే 30 శాతం ఓట్లు తెచ్చుకుని గెలవచ్చన్నది ఆమె లెక్క. దేశంలోని ఓటర్లను మతం ప్రాతిపదికన చీలిక తీసుకురాగలిగితే కాంగ్రెస్‌కు గుత్తగా 20 శాతం మైనారిటీ ఓట్లు పడతాయి. అపుడు మిగతా పని సులభం అవుతుందన్నది సోనియా వ్యూహం. దీన్ని అమలుపరిచేందుకు ఆమె గుజరాత్ అల్లర్లను ఒక సాధనంగా వాడుకుని మోడీనీ, బీజేపీని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు రక్షణ కరువ అవుతుందనీ, కాంగ్రెస్ ఒక్కటే వారికి రక్షణ కల్పించగలదనీ భరోసా ఇవ్వసాగేరు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో రాహుల్ మాట్లాడుతూ, మోడీ అధికారంలోకి వస్తే 22 వేల మంది ముస్లింలు హత్యకు గురవుతారని అన్నట్టుగా వార్తలొచ్చాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు జారీ చేసింది.

 సాధారణంగా మైనారిటీలు వ్యూహాత్మకంగా ఓట్లు వేస్తారు. ఫలానా నియోజకవర్గంలో బీజేపీని ఓడించేందుకు బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఒక్కొక్కసారి ఇది మంచి ఫలితాలని ఇస్తుంది, అనేక సందర్భాల్లో వికటిస్తుంది కూడా. మైనారిటీలలో తానే చీలిక తీసుకువచ్చి ఆ తర్వాత బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతూ మతప్రాతిపదికన ఓటర్లను చీలుస్తోందంటూ ప్రత్యర్థిపై ఎదురు నింద వేస్తోంది. ఏదో జరుగుతుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. సోనియా తన  గొయ్యిని తానే తవ్వుకుంది. బీజేపీ మైనారిటీలకు హాని చేస్తుందంటూ సోనియా, రాహుల్ నిరంతరం చేస్తున్న ప్రచార ఫలితంగా దేశంలోని మెజారిటీ వర్గాల్లోని అనేక గ్రూపులు ఏకంకావడం ప్రారంభమయ్యాయి. మీడియా ప్రభావంతో మైనారిటీలంతా ఏకం అవుతున్నందున వారిని చూసి మిగిలిన వారు.... అంటే దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవర్గాలు కూడా సంఘటితం కావడం మొదలయ్యింది.

 కాంగ్రెస్ చేసిన హాని

 ఉచిత కానుకల ద్వారా, సంక్షేమ విధానాల ద్వారా దళితుల ఓట్లను దక్కించుకోవచ్చని బీఎస్‌పీ అధినేత మాయావతి, సోనియా భావించారు. కానీ గణనీయ సంఖ్యలో దళితులు మధ్యతరగతి వర్గం మాదిరిగానే మోడీకి ఓటు వేసినట్టు సర్వేలు చెపుతున్నాయి. ఓటర్లలో మతపరంగా చీలిక తీసుకురావడం, తమలో భయాందోళనలు రేకెత్తించడం తమను బాధిస్తోందని అనేక మంది మైనారిటీ వర్గానికి చెందిన పండితులు వాపోతున్నారు. కాంగ్రెస్ భారీస్థాయిలో చేస్తున్న ఈ ప్రచారానికి తాము నిస్సహాయులుగా ఉండిపోతున్నామని అంటున్నారు. మైనారిటీల మద్దతు లేకుండా ఇండియాలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చని ఈ ఎన్నికల్లో రుజువు కాబోతోంది. మైనారిటీలకు కాంగ్రెస్, సోనియా చేసిన హాని ఇది. మైనారిటీల ఓట్ల విలువను ఆమె తగ్గించారు. సోనియా అతి తెలివిని ప్రదర్శించి మతపరంగా ఓటర్లలో చీలికలు తీసుకువచ్చి తనకు తానే నష్టం చేసుకున్నారు. వాస్తవానికి ఆమె మోడీ రాజకీయ ఉన్నతికి ఎంతో చేయూతనిచ్చినట్టయ్యింది. సోనియా లేకపోతే మోడీ విజయం ముంగిట దాకా వచ్చేవారు కాదు!    

 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)  పెంటపాటి పుల్లారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement