డి.పాపారావు
రూపాయి విలువ తగ్గితే అది మన ఎగుమతులకు మంచిదేనని ఒక వాదన. నిజానికి 2004-08 కాలంలో రూపాయి విలువ స్థిరంగానూ, బలంగానూ ఉన్నప్పుడు మన దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. గత మూడేళ్లలో రూపాయి విలువ బాగా తగ్గింది. కానీ నేడు మన ఎగుమతులు కుదేలయ్యాయి.
గడచిన మూడు నాలుగేళ్ల కాలంలో మన రూపాయి విలువ గణనీయంగా పతన మైంది. మొదటగా 2011లో, తర్వాత 2013 మే నుంచి, ప్రస్తుతం 2014 డిసెంబర్ ఆరంభం నుంచీ రూపాయి విలువ మూడు దఫాల పతన దశలను చూసింది. మొదటగా 2011లో దేశీయ స్థూలజాతీయ ఉత్పత్తి పతనం, ద్రవ్యో ల్బణంతో పాటుగా పలు అంతర్జాతీయ కారణాల దృష్ట్యా నాడు రూపాయి విలువ పడిపోయింది. మన షేర్ మార్కెట్ సూచీలు పతనం అయ్యాయి. విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడమే దీనిక్కారణం. అంటే, ఈ మదుపుదారులు తమ పెట్టుబడులను అమ్మివేయడం ద్వారా మన మార్కెట్‌లో రూపాయలను పొందుతారు. కానీ వారు అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి తమ డబ్బును మదుపు చేసుకోవాలంటే దానిని డాలర్ల వంటి రూపంలోకి మార్చుకోవాలి. దీని కోసం వారు వాటాల అమ్మకంలో తమకు లభించిన రూపాయలను అమ్మి వేసి, డాలర్లను కొనుగోలు చేస్తారు. అంటే వారు రూపా యిని వదిలివేస్తున్నారు. డాలర్‌ను స్వీకరిస్తున్నారు. దీనర్థం రూపాయికి డిమాండ్ తగ్గడం, డాలర్‌కు డిమాం డ్ పెరగడం అని గమనించాలి. తద్వారా డిమాండ్ తగ్గిన (అమ్మకమవుతున్న) రూపాయి విలువ పడిపో యింది. డిమాండ్ పెరిగిన (కొనుగోలు అవుతున్న) డాలర్ విలువ పెరిగింది. అదీ కథ.
ఇక 2013 మే మాసం నుంచీ రూపాయి పతన కార ణం కాస్త భిన్నమైనది. అమెరికా ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థకు ఇస్తోన్న నెలవారీ 85 బిలియన్ డాలర్ల ఉద్దీప నను త్వరలో విరమించుకోనున్నామని, నాటి అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాంకే 2012 చివరలో ప్రకటించడం ఈ పతనానికి కారణమైంది. అమెరికా ఇస్తోన్న ఈ ఉద్దీపన పథకం తాలూకు డబ్బు నాటి వరకూ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతోన్న దేశాల షేర్ మార్కెట్‌లలోకి భారీగా ప్రవహించింది. ఫలితంగా ఆ దేశాల మార్కెట్ సూచీలు పెరిగాయి. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు భారీగా వివిధ దేశాల కరెన్సీలను కొనుగోలు చేశారు. అలాగే మన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వారు రూపాయలను కొనుగోలు చేశారు. అంటే, రూపాయికి డిమాండ్ ఏర్పడింది. దానితో అన్ని కరెన్సీల విలువ లతో పాటు రూపాయి విలువ కూడా పెరిగింది. కాగా, అమెరికా గనుక ఉద్దీపనను ఆపివేస్తే వివిధ షేర్ మార్కె ట్లలోకి డాలర్ల ప్రవాహం ఆగిపోతుంది. అలాగే డాలర్ల చలామణి కూడా తగ్గుముఖం పడుతుంది. అంటే డాలర్ల సరఫరా తగ్గి డాలర్ విలువ పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో బెర్నాంకే ప్రకటన అనంతరం, పెర గనున్న డాలర్ విలువపై ఆశతో ప్రపంచ మార్కెట్‌ల లోని మదుపుదారులు విపరీతంగా డాలర్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఈ స్థితిలోనే వారు అభి వృద్ధి చెందుతోన్న దేశాల కరెన్సీలను అమ్మివేసి డాల ర్లను కొనుగోలు చేయసాగారు. ఇదే పరిస్థితి మన రూపాయికే ఎదురైంది. దాంతో నాడు రూపాయి విలువ భారీగా పతనమైంది. ఒక స్థితిలో డాలరుకు 70 రూపా యల అంచుకు చేరుకుంది. కాగా, ఈ ఉద్దీపన పథక విర మణ 2014 అక్టోబర్ వరకు మెల్లమెల్లగా మాత్రమే జర గడంతో, వివిధ అభివృద్ధి చెందుతోన్న దేశాల కరెన్సీల విలువలతో పాటు మన రూపాయి విలువ కూడా తిరిగి పుంజుకుంది. పైగా దేశీయ రిజర్వు బ్యాంక్ చైర్మన్‌గా కొత్తగా పదవిని స్వీకరించిన, రఘురామ్ రాజన్ తీసు కున్న కొన్ని చర్యల వల్ల కూడా మన రూపాయి విలువ నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా 2014 పార్లమెంటరీ ఎన్నికల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంపై విశ్వాసంతో మన షేర్ మార్కెట్ సూచీలు భారీగా పెరి గాయి. దాంతో, రూపాయి విలువ గణనీయంగా పుంజు కుని ఒక డాలరుకు దరిదాపు 58-59 రూపాయలకు బలపడింది. ఈ పరిస్థితి గత 5 నెలల కాలం పాటు కొనసాగింది.
అయితే, మోదీ అధికారంలోకి వచ్చినప్పటికే నిజ ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులు లేకపోవడం, అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచీలు, దేశీయ డిమాండ్‌లు బల హీనపడటం వంటివీ, దానితో పాటుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వలన అక్కడ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏర్పడటం-వంటివన్నీ కలగలిసి రూపాయి విలువ మరలా ఒడిదుడుకులకు లోనవుతోం ది. 2015 జనవరి 12 నాటికి రూపాయి విలువ డాల రుతో పోలిస్తే రూ. 62.13లకు పతనం అయ్యింది. కాగా, రూపాయి ఇకముందు కూడా మరింత పతనం అయ్యే సూచనలే కనపడుతున్నాయి.
నేడు పతనమవుతోన్న రూపాయి విలువ దేశీ యంగా ప్రజల కొనుగోలుశక్తిని పరోక్షంగా దెబ్బ తీస్తుంది. మనం దిగుమతి చేసుకునే పలు సరుకుల ఖరీదు పెరిగి పోవడం దీనికి ఒక కారణం. కాబట్టి మన దేశ ప్రయోజనాల దృష్ట్యా రూపాయి విలువ బలంగా ఉండటం మనకు అవసరం. లేని పక్షంలో దేశ ప్రజల కడగళ్లు మరింత ఉధృతమవుతాయి.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్: 9866179615