పదే పదే అదే ధిక్కారం తథ్యం
కొత్త కోణం
సుశీల్ కుమార్‌పై దాడి ఘటనే కారణమైతే పోలీసు కేసు సరిపోతుంది. కానీ ఏఎస్‌ఏ, మెమెన్ ఉరిశిక్షను నిరసించడం ఏబీవీపీ, బీజేపీలకూ, కేంద్రానికీ జీర్ణం కాలేదు. కాబట్టే సస్పెన్షన్ వేటు వేశారు. మీతో విభేదించే వారి గొంతు నొక్కేయడం అనర్థదాయకం. హిందూ సమాజం అనుసరిస్తున్న ఇటువంటి విధానాల వల్లనే తరతరాలుగా దళితులు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు, మారుతున్నారు. ఈ అసహన వైఖరి దళితుల్లో హిందుత్వ పట్ల మరింత వ్యతిరేకతను పెంచుతుందే తప్ప, వారిని భయపెట్టలేదు.
అగ్రవర్ణాధిపత్య సంరక్షణకై ఏకలవ్యుని ప్రతిభను బలి కోరాడు ద్రోణాచార్యుడు. చిరునవ్వుతో బొటన వేలును కోసిచ్చిన ఏకలవ్యుడు ప్రాణాలతో మిగిలాడు. వర్ణవ్యవస్థనే సవాలు చేసినందుకు శంబూకుడి తల నేల రాలింది. రోహిత్ వేముల బొటన వేలిని కాదు, తారలను తాకాలనుకున్న అతని మేధస్సునూ, అతని కుల నిర్మూలన లక్ష్యాన్నీ, అగ్రవర్ణాధిపత్యానికి తలొగ్గని గుండెధైర్యాన్నీ, హెచ్‌సీయూలోని కుల అణచివేత, వివక్ష, వెలివేతలను వెలుగులోకి తేవాలనుకున్న అతని ధిక్కారాన్నీ తెగనరకాలను కుంది నేటి హిందుత్వ భావజాలం.
తారల్లోనే ఇక తన కాపురమన్న భావుకుని సుతిమెత్తని హృదయాన్ని మనస్సును ముక్కలు చేసింది. ప్రపంచ వ్యాప్త సమసమాజ స్వప్న సాకారాన్ని శ్వాసించిన మహా మేధస్సును కడ తేర్చింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలను, మొత్తంగా విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తూ జాతీయ రాజకీయాల కేంద్ర సమస్యగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ‘ఘర్షణ’ క్రమశిక్షణా చర్య కానేకాదు... వర్ణవ్యవస్థను పరిరక్షించి, హిందూ మతం ఒక్కటే ఉండా లనే ఏక్‌తా వాదానికీ, కులాల అంతరాలకు తావే లేని వ్యవస్థను కోరే అభ్యు దయ మేధావులకూ మధ్య సాగుతున్న సంఘర్షణ. అది విస్మరిస్తే హెచ్‌సీ యూలోని నేటి అవాంఛనీయ పరిణామాల మూలాలు అర్థం కానేకావు.
హెచ్‌సీయూ ‘వెలివాడ’
వెలివాడలు మనకు కొత్తేం కాదు. కాకపోతే సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో పేట్రేగుతున్న నాగరికమైన కుల వివక్ష, ‘అంటరానితనం’ కళ్లకు కట్టేందుకే హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన దళితుల ‘వెలివాడ’ వెలిసింది. ఇది కొత్త కాదు. జ్ఞాన సంపద, శక్తియుక్తులు, నైపుణ్యాలు అగ్రవర్ణాల కాళ్ళకింద పడి ఉండాల్సినవిగా చెప్పే కులాలకు, తెగలకు అందరాదనే మనస్తత్వాన్ని పురాణాలు, ఇతిహాసాల ద్వారా అందరి మెదళ్ళలోకి చొప్పించారు. ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాలు చిమ్ముతున్నది ఆ విషాన్నే. వనరుల మీద ఆధిపత్యం, జ్ఞానం మీద గుత్తాధిపత్వం కలిగి అధికారాన్ని చేతుల్లో ఉంచు కున్నవాళ్లు వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాల పాలకులు అమలుచేస్తున్న విద్వేషపూరిత విధానాలు నేటి దళిత, అణగారిన కులాల విద్యార్థులకు మింగుడు పడటంలేదు.
కమ్యూనిస్టు ఉద్యమాల చైతన్యంతో, గౌతమ బుద్ధుడు మొదలు, ఫూలే, అంబేద్కర్‌ల వంటి వారి స్ఫూర్తితో వారు మతోన్మాద రాజకీయాలను ప్రతిఘటించినప్పు డల్లా సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆ ధిక్కార స్వరాల్ని నులిమేయాలని కుల సమాజం, మతోన్మాద శక్తులు నిరంతరం ప్రయత్ని స్తూనే ఉంటాయి. హెచ్‌సీయూ ‘వివాదం’ సారం అదే.
వెన్నెల రాత్రుల్లో వెలివాడల వెతలను వినిపించే చందమామ కథలను వింటూ, నిశి రాత్రుల్లో నక్షత్రాల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కుంటూ గడిపినా... తెల్లారితే క్యాంపస్‌లో అడుగడుగునా వెంటాడే వివక్షను ధిక్కరిస్తూనే నిరంతర అధ్యయనం సాగించిన రోహిత్ అలసిన శరీరానికి మరణమే విశ్రాంతనుకున్నాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, యాజమాన్యం వేధింపులకూ, కుల రాజకీయాలకూ ఎందరో ప్రతిభాశాలురు బలైపోయారు. మార్కుల్లో కోతలు వేసి, గైడ్‌నే ఇవ్వకుండా వేధించి, రకరకాలుగా అవమానించిన ఘట నలు కోకొల్లలు. మాదారి వెంకటేశం అనే దళిత స్కాలర్‌కి గైడ్‌ని ఇవ్వకుండా వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది.
ప్రశ్నించినా, ప్రతిభను కనబరచినా శిక్షే
అత్యంత ప్రతిభను కనబరిచిన దళిత, ఆదివాసీ విద్యార్థులకు పనిగట్టుకుని మార్కులు తగ్గించడం అక్కడ సర్వసాధారణం. అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేస్తున్న ఆనంద్ మొదటి సెమిస్టర్‌లో 83 శాతం మార్కులు సాధించి గోల్డ్ మెడల్‌కు గట్టి పోటీదారుగా మారేసరికి, రెండో సెమిస్టర్‌లో అతని మార్కులను 52 శాతంకు కుదించడం హెచ్‌సీయూ మార్క్ కుల దురహం కారం. విజయ్‌కుమార్ అనే విద్యార్థిపై ఒక సోషియాలజీ ప్రొఫెసర్ సాగిం చిన వివక్ష మరీ దుర్మార్గం.
యూజీసీ నేషనల్ ఎలిజబిల్టీ టెస్ట్‌లో నాలుగు సార్లు క్వాలిఫై అయిన ఆ విద్యార్థిని సదరు ప్రొఫెసర్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ చేసి అతని భవితకే ముప్పు పెట్టారు. విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో అతను ఉత్తీర్ణుడైనట్టు ప్రకటించారు. ఆ ప్రొఫెసర్‌పై ఎటు వంటి చర్యలూ తీసుకోలేదు! విజయ్‌కుమార్ నేటికీ తన పీహెచ్‌డీ థీసిస్‌ను సమర్పించలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రతిఘటిస్తే శిక్ష తప్పదని యాజ మాన్యం ఇలా పదే పదే విద్యార్థులకు ‘పాఠం’ నేర్పాలని చూస్తూనే ఉంది.
అసమానతను, వివక్షను ప్రదర్శిస్తున్న కుల సమాజంపై ప్రతిఘటన స్వాతంత్య్రానంతరం పెరుగుతూ వచ్చినా... 1970 తర్వాత వచ్చిన సామా జిక మార్పులు, దళిత కులాల్లో వచ్చిన చైతన్యం వారిపై ఆధిపత్య కులాల దాడులకు పురికొల్పాయి. కీలవేణ్మని, బెల్చీలలో జరిగిన దళితుల గృహద హనాలు, ఊచకోత దాని పర్యవసానాలే. ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడు, చుండూరు ఘటనలూ అలాంటివే. కుల వ్యవస్థపై అంబేద్కర్ లేవనెత్తిన తిరుగుబాటు కోట్లాది మంది దళితులను మేల్కొల్పి, సంఘటితపరిచి, పోరాటాలకు నడిపింది. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక నక్సలైట్ ఉద్యమం కుల అణచివేతను సవాలు చేసింది. ఫలితంగానే ఈరోజు తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలు రాజకీయార్థిక రంగాల్లో కొంత మేరకైనా ముందడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఘటనలను అర్థం చేసుకోవాలి. హెచ్‌సీయూలో దీర్ఘకాలంగా కుల వివక్ష, ముఖ్యంగా దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతున్నది. దాన్ని ప్రశ్నించడంలో భాగంగానే 1994లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) ఏర్పాటైంది. 2002లో హాస్టల్ సమస్యలను చర్చిస్తుండగా నాటి చీఫ్ వార్డెన్, ప్రస్తుత వైస్-ఛాన్సలర్ అప్పారావు ఫిర్యాదు మేరకు పది మంది దళిత విద్యార్థులను రస్టికేట్ (బహిష్కరణ) చేశారు. పలు ఉద్యమాలు, కోర్టు తీర్పుల తదుపరి వారిని మళ్ళీ విశ్వవిద్యాలయంలో చేర్చుకున్నారు. దళిత విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ఏఎస్‌ఏ అంబేద్కర్ సిద్ధాంతాల ప్రచారాన్ని కూడా సాగిస్తోంది. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఏఎస్‌ఏకు హిందూ భావజాలాన్ని ప్రచారం చేసే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కి సహజంగానే వైరుధ్యం ఏర్పడింది.
కుల వివక్షకు మారు పేరు ఉపకులపతి
ముంబై బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడు మెమెన్ ఉరిశిక్షకు ఏఎస్‌ఏ నిరసన తెలిపింది. ఈ నిరసనకు వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో వారిని గూండాలని వ్యాఖ్యానించారు. ఏఎస్‌ఏ నాయకులు సుశీల్ కుమార్‌ని నిలదీయగా ఆయన క్షమాపణ పత్రాన్ని రాసిచ్చారు. ఆ తర్వాత ఆయనే తనపై ఏఎస్‌ఏ సభ్యులు దాడిచేశారని ఫిర్యాదు చేయడంతో అసలు కథ ప్రారంభమైంది. ఈ ఘటనను యూని వర్సిటీ క్రమశిక్షణ బోర్డ్‌కు అప్పగించారు. సుశీల్ కుమార్‌పై ఎటువంటి భౌతిక దాడులు జరగలేదని గ్రహించిన బోర్డు ఆయనకు హెచ్చరిక నోటీసు లను జారీ చేసింది. ఐదుగురు దళిత విద్యార్థులకు కూడా నోటీసులు ఇచ్చారు.
ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా, ఒక సెమిస్టర్‌కు ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో యాజమాన్యం సస్పెన్షన్‌ను ఎత్తివేసి, కొత్తకమిటీని వేసి పునర్విచారణ చేస్తామని ప్రకటిం చింది. తదనంతరం 2002లో పది మంది దళిత విద్యార్థుల రెస్టికేషన్‌కు బాధ్యుడైన నాటి చీఫ్ వార్డెన్ పొదలి అప్పారావును వైస్ ఛాన్సలర్‌గా తీసుకొచ్చారు. దత్తాత్రేయ లేఖాస్త్రాన్ని ప్రయోగించారు. హెచ్‌సీయూ జాతివ్యతిరేక శక్తుల, కులతత్వ తీవ్రవాదుల అడ్డాగా మారిందని, చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు.కొత్త వీసీ అప్పారావు హుటాహుటిన ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున నియామకమైన సబ్ కమిటీ పేరుతో విచారణ లేకుండానే ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
‘దాడి’ సాకు మాత్రమే
సుశీల్ కుమార్ మీద దాడి కేవలం ఒక సాకే. మెమెన్ ఉరిశిక్షను ఏఎస్‌ఏ నిరసించడం ఏబీవీపీ, బీజేపీలకూ, కేంద్రానికీ జీర్ణం కాలేదు. అందువల్లనే ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. సుశీల్ కుమార్ ఘటనే కారణమైతే పోలీసు కేసు సరిపోతుంది. కానీ తమ అభిప్రాయాలతో విభేదించే వారిని, ముఖ్యంగా మెమెన్ ఉరిశిక్షను నిరసించినవారిని వారు సహించలేక పోవడమే అసలు సమస్య. మీతో విభేదించే వారి గొంతు నొక్కేయడం సమాజం మను గడకే అనర్థదాయకం. హిందూ సమాజం అనుసరిస్తున్న ఇటువంటి విధా నాల వల్లనే తరతరాలుగా దళితులు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు, మారుతున్నారు. ఈ అసహన వైఖరి దళితుల్లో హిందుత్వ పట్ల వ్యతిరేకతను పెంచుతుందే తప్ప, వారిని భయపెట్టలేదు.
అంబేద్కర్‌ను ప్రశంసిస్తూనే... ఏఎస్‌ఏను నిన్న తమిళనాడులో, నేడు హైదరాబాద్‌లో అంతమొందించాల నుకోవడాన్ని కక్ష సాధింపుగానే భావించాలి. విశ్వవిద్యాలయాలలోని ఆధి పత్య కులాల ఉపాధ్యాయులు, విద్యార్థులలో ఉన్న రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత ఇందులో భాగమే. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం పోరాడి, సాధించి ఉండకపోతే... ఈ దేశం రెండు ముక్కలుగా, రెండు గ్రూపులుగా విడిపోయి అంతఃకలహాలతో అంతమైపోయేది. హిందూ మతం పునాదుల మీద నిర్మితమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు చరిత్ర పొడవునా కనిపిస్తాయి. మతోన్మాదాన్ని, కుల వివక్షను ఎదిరించిన రోహిత్ లాంటి ఆలోచనాపరులు ఎందరో మన నుంచి దూరం కావచ్చు. కానీ వారి ధిక్కార స్వరాలను వినిపించే గళాలు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి.
- మల్లెపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు lmallepalli@gmail.com)