నియంతలకు నీడ కరువు
బైలైన్
ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు
గత వారంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాల్సిన పదహారేళ్ల బాలిక మలాలా యూసఫ్‌జాయ్ ఏదో ఒక రోజున పాకిస్థాన్ ప్రధాని కావాలని కోరుకుంటోంది. నోబెల్‌తో పోలిస్తే ఆ రెండోదే ఆమెకు మంచి భవిత. అర్హులైన ప్రముఖులకు... వారు విస్మృతులైన తర్వాత మాత్రమే సాధారణంగా నోబెల్ బహుమతి లభిస్తుంది. అగ్రరాజ్యం కోటాకు ఏ మాత్రం తగ్గకుండా అంతర్జాతీయస్థాయి హింసాకాండకు కారకులైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత! నోబెల్‌తోపాటూ ఉండే జయజయ ధ్వానాలు, భారీ నగదు మొత్తమూ మలాలాకు చాలా ఉపయోగపడేవని అనడంలో సందేహం లేదు. ఇక బాగా అమ్ముడుపోయే పతాక శీర్షికల పట్ల ఆత్రుతతో ఉండే మీడియాకు మరింత ఉపయోగపడేవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఆమె రాజకీయాలను వ్యాపకంగా ఎంచుకోవడమే పాకిస్థాన్‌కు ఉపయోగకరం.
సాహస బాలిక మలాలా బస్సులో స్కూలుకు పోతుండగా పాక్‌ను విచ్ఛిన్నం చేస్తున్నవారు ఆమె తలలో తూటాను దించారు. అందుకు తగినట్టే ఆమె అంత మంచి భవితవ్యం కోసం ఎన్నో కలలను కనాల్సి ఉంది. పాక్ తీవ్రవాదుల డీఎన్‌ఏలో కేంద్ర స్థానంలో ఉన్నది అత్యంత అథమమైన లైంగిక అణచివేత. నిర్హేతుక దురభిమానం లేదా అజ్ఞానం నిండిన కాలానికి వారు దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇస్లాం పూర్వ సంచార తెగల అరేబియా ఎడారులను అలాగే వర్ణించేవారు. ఇస్లాం ఆడ శిశువుల హత్యల వంటి పలు దురాచారాలను నిషేధించి మహిళల హృదయాలను జయించింది. పాక్ తాలిబన్‌లు గతించిన ఆ ఆరవ శతాబ్దపు అవశేషాలు. వారు ఏ మతానికి అనుయాయులమని చెప్పుకుంటారో ఆ ఇస్లాం ప్రతిష్టకే భంగకరం.
అలా అని ఈ వాస్తవం అట్టడుగు వర్గాల్లో వారి ప్రాబల్యం విస్తరించడాన్ని క్షీణింప చేయలేదు. లేదా తాలిబన్‌తో ‘చర్చల ద్వారా పరిష్కారం’ కోరుతూ పాక్ ఉన్నత వర్గాలు గగ్గోలు చేయడాన్ని బలహీనపరచలేదు. తాలిబన్లతో బేరసారాలు సాగించడానికి అసలు ఏం ఉంటుంది? అనే సరళమైన ప్రశ్నను ఎప్పుడో గానీ అడగరు, సమాధానం అసలు ఎన్నడూ చెప్పనే చెప్పరు. ఎవరిని బడితే వారిని హత్య చేయడమే ప్రధాన ఎత్తుగడగా, బహుశా భావజాలపు కేంద్ర సూత్రంగా ఉండే ఒంటెత్తువాదులతో చర్చలకు అజెండా ఏమిటి?
నాజూకైన మాటల మాటున తాలిబన్లు, వారి ప్రాపకందార్లు తమ అధికార వాంఛను కప్పిపుచ్చుకోలేరు. పాక్ రాజకీయ వేత్తలు వారికి ఇవ్వజూపాల్సింది అదేగా? సింధ్ వాయవ్య ప్రాంతాల్లో అధికార భాగస్వామ్యం ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పుడే వారి ప్రభావం ప్రమాదకర స్థాయిలో చట్టాల్లోకి చొరబడిపోయింది. కొన్ని మసీదులు, ప్రదర్శనల నుంచి బహిరంగ ప్రదేశాల్లో మారుమోగే వారి ఉన్మత్త ప్రేలాపనలను ఎవరూ నిరోధించలేరు. పోనీ వారిని డబ్బుతో కొనడం సాధ్యమా? బహుశా అసంభవం. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా లభిస్తున్న నిధులు తగినన్ని వారికి ఉన్నాయి. ఉన్న అత్యంత సున్నితమైన సమస్య ఇది: పాక్ కోవర్టు ప్రయోజనాలకు అనుగుణంగా అఫ్ఘానిస్థాన్ లేదా భారత్ వంటి ప్రాంతాలపైకి మాత్రమే తమ తుపాకులను ఎక్కుపెట్టి, పెషావర్, క్వెట్టాల వంటి పాక్ నగరాలను సురక్షితంగా వదిలివేయడానికి వారు ఎన్నటికైనా అంగీకరిస్తారా?
ఇబ్బందికరమైన వాస్తవాలు అవి అసలు లేనే లేవన్నట్టు న టించడం ద్వారా అంతరించిపోవు.
మలాలా ఇప్పుడు బ్రిటిష్ స్కూల్లో చదువుకుంటోందంటే అది తాలిబన్ల కారణంగానే. ప్రజలు ఎన్నుకున్న పదవి ద్వారా ఆమె వారి కబంద హస్తాల పట్టును సవాలు చేయాలని ఆశిస్తోంది. తమ దేశ స్వస్థతకు వారు ఎంత ముప్పో ఆమె గ్రహించింది.
మలాలా కౌమారంలో ఉన్నది. కలలు కనడానికి ఆమెకు సకల హక్కులూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆమెకిది రెండో జన్మ కాబట్టి ఆ హక్కు మరింత ఎక్కువగా ఉంటుంది. ఊగుతూ, తూగుతూ గమ్యం లేకుండా సాగే జనరల్ ముష్రాఫ్ లాంటి డైబ్బయ్యేళ్ల ముసలోడి అభూత కాల్పనికతల కంటే ఆమె కలలు ఖచ్చితంగా మరింత అర్థవంతమైనవై ఉంటాయి. ముష్రాఫ్ అలసిపోయినమాట నిజమే, అయినా ఎన్నటికీ రాజకీయ విరమణ చేయరు. దేశ ‘రక్షకుని’ వేషం గట్టి అధికారం కోసం వెంపర్లాడటానికి బదులు ఆయన దుబాయ్ లేదా ఆమెరికా లేదా ఇంకెక్కడ మరిన్ని ఎక్కువ డాలర్లను రాబట్టుకోగలిగితే అక్కడికి తప్పించుకు పోగలరు, బహుశా తప్పించుకు పోవచ్చు కూడా. ఇతరత్రా పలు విధాలుగా వెనుకడుగు వేసినా పాక్ చాలా విధాలుగా ఆయనను దాటి ముందుకు వెళ్లిపోయింది. అది ఇక ఎంత మాత్రమూ పాత నియంతలకు పట్టం కట్టే దేశం కాదు.
పాక్‌ను నిజంగానే ‘రక్షించాల్సి’ ఉంటే, అది ఆయన కంటే చాలా చిన్నవారైన యువతీయువకులు పదవుల్లో ఉండే దేశం కావాల్సి ఉంటుంది. ఇటీవలి చరిత్ర భారాన్ని మోయాల్సిన అవసరం లేని కొత్త నాయకుల బృందం అందుకు కావాలి. మలాలా తిరిగి స్వస్థలానికి తిరిగి రాగలిగిన దేశం కావాలి. మలాలాకు ఇప్పుడు విద్య, భవిష్యత్తులతో పాటూ ప్రశంసాపూర్వకమైన బ్రిటన్ మీడియా ఆసక్తి కూడా ఉంది. ఆమె శ్రేయోభిలాషులకు మించి ఆ ఆసక్తే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందన్న అంచనాలను రేకెత్తింపజేసింది. మలాలాకు ఈ వయసులో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అయినాగానీ ఆమె బ్రిటన్‌లో గాక పాక్‌లో శాంతిని నెలకొల్పాలని కోరుకుంటోంది. బ్రాడ్‌ఫోర్డ్ లేదా బ్రిమింగ్‌హామ్ యువతి కావాలని గాక లాహోర్ లేదా పెషావర్ యువతి కావాలని కోరుకుంటోంది. అక్కడి వీధుల్లో రాజ్యమేలే స్త్రీ ద్వేషం, మతోన్మాదాలను సవాలు చేయాలని భావిస్తోంది.
ఆమె లక్ష్య సాఫల్యతను పొందే అవకాశాలు ఎలా ఉన్నాయి? నిజాయితీగా చెప్పాలంటే ఏమంత బాగా లేవు. ఉద్రిక్తతల అంచున నిలిచి ఉన్న దేశంలో నవాజ్ షరీఫ్ ప్రశాంతతను నెలకొల్పగలరని, మానసిక శాంతి భగ్నమైన వోటర్లు విశ్వసించారు. అందుకే సుస్థిర ప్రభుత్వానికి ప్రధానిని చేశారు. ఇంతవరకు అయితే నవాజ్ గమ్యం లేకుండా మెల్లగా పెళ్లి నడక సాగిస్తున్నారు. అయినా ఆయనకు ఇంకా సమయం ఉంది. షరీఫ్ విఫలమైతే మాత్రం మలాలా ఆమె తరం మరో ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా గానీ ఏమైనా చేయగలిగేది ఉన్నదా?
ఆ బాలిక దాదాపుగా ప్రాణాలను కోల్పోయినా, ఆశను మాత్రం ఎన్నడూ వీడలేదు. నిరాశావహమైన సలహాలు ఆమెకు అక్కర్లేదు. కలలు తప్పనిసరిగా నిజం కావాలని ఏమీ లేదు. ఎందరికి మాత్రం మరో జన్మ లభిస్తుందని?