
ఈ రక్త చరిత్ర ఇంకానా?
డేట్‌లైన్ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ బిహార్ కంటే అధ్వానంగా తయారైందని జపాన్ సంస్థకు చెందిన మాకీ ఏ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నట్టు? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మార్కం డేయ కట్జుకు ఏమవసరమని రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞాపనలు పంపారు? ఈ సమస్యలన్నీ కొద్దిరోజుల క్రితం ప్రధానిని కలిసినప్పుడు జగన్ వివరించే ఉంటారు. అయితే కేంద్రంలో తమ భాగస్వామి, రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్ల మోదీ సర్కార్ ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి.
రాష్ట్రాలలో పాలనా యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగంలోని 356వ అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించే వెసులుబాటు ఉంటుంది. ఇది చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్ప అంత తీవ్రమైన డిమాండ్ ఎవరూ చెయ్యరు. అటువంటిది మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చెయ్యాలని కోరారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి దారుణహత్య నేపథ్యంలో ప్రతిపక్ష నేత గవర్నర్‌ను కలిశారు. ఈ ఒక్క సంఘటన కారణంగానే ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారా? లేక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అంత అధ్వానంగా మారాయా?
విపక్షాన్ని తుద ముట్టిస్తారా?
ముఠా కక్షల కారణంగా నారాయణరెడ్డి హత్య జరిగిందని చెబుతూ జిల్లా పోలీసు యంత్రాంగం కేసును రాజకీయ నాయకుల మీద, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం మీద పడకుండా తప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. నారాయణరెడ్డిది రాజకీయ హత్యేననీ, సీబీఐ విచారణ జరిపించాలనీ జగన్‌మోహన్‌రెడ్డి కోరుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదలు, జిల్లా ఎస్పీ దాకా ఇది ముఠా కక్షల కారణంగా జరిగిందని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను ఎద్దేవా చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి స్వయంగా జగన్‌ది దింపుడు కళ్లం ఆశ అన్నారు.
ఆ హత్య ముఠా కక్షల ఫలితమే అయితే, అవతలి ముఠాలో ఎవరున్నారు? చివరలోనే అయినా ఉప ముఖ్యమంత్రి కొడుకు కేఈ శ్యాంబాబు పేరు నిందితుల జాబి తాలో ఎందుకు చేరింది? ఈ హత్య వెనుక ముఠా కక్షలు లేవు, రాజకీయ కారణాల వల్లనే చంపేశారు కాబట్టే జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారు. ఇది కొత్తేం కాదు. 2005లో తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. అప్పట్లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి.
ఒక రాజకీయ హత్య జరిగినప్పుడు, అందునా అధికారపక్షం హస్తం ఉందన్న ఆరోపణ వచ్చినప్పుడు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం కోసం సీబీఐ విచారణ కోరడం సహజం. నిజానికి పరిటాల రవి హత్య జరిగే నాటికి రాయలసీమలో ఫ్యాక్షన్ సమస్యను తుదముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఠా కక్షలకు తన తండ్రి రాజారెడ్డి బలైనా డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రతీకారాన్ని కోరలేదు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రమంతటా పాదయాత్ర చేసిన తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి పూర్తిగా మారిన మనిషి. ఆయనే పలు సందర్భాలలో కోపం నరం తెంపేసుకున్నానని చెప్పేవారు. ప్రభుత్వంలో ఉండి ఆయనే పరిటాల రవి హత్య మీద సీబీఐ విచారణకు ముందుకొచ్చారు.
ఇక ఇదే కర్నూలు జిల్లాలో ముఠా కక్షలను అంతం చెయ్యడానికి ముఖ్యమంత్రిగా వైఎస్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. మన తరువాతి తరమైనా ఈ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవించాలని చెబుతూ ఉండేవారాయన. కేవలం మాటల్లోనే కాకుండా రాజశేఖరరెడ్డి ముఠాకక్షలను అంతం చెయ్యడం కోసం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి వర్గాల మధ్య స్వయంగా సయోధ్య కుదిర్చిన విషయం ఒక ఉదాహరణ మాత్రమే.
మళ్లీ నారాయణరెడ్డి హత్య దగ్గరికే వస్తే 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ స్థానాలు గెల్చుకుంది. ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ గెల్చుకుంటే 14 శాసనసభ స్థానాల్లో 10 వైఎస్‌ఆర్‌సీపీ కైవసమయ్యాయి. ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తే ఎల్లకాలం తామే అధికారంలో ఉండవచ్చన్న ఆలోచన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుది. ప్రజాస్వామ్యంలో అటువంటి ఆశ ఉండటం ఒక మానసిక రుగ్మతకు సంకేతమంటారు రాజకీయ పండితులు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల కోసం చేసిన మంచిని చెప్పుకుని ఎన్నికలను ఎదుర్కోవాలి కానీ, దొడ్డిదారిన ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రయత్నం మనను ఎల్లకాలం అధికారంలో ఉంచదన్న సత్యాన్ని విస్మరించడమే ఆ మానసిక రుగ్మతకు మూలం.
ఆ కారణం చేతనే తెలుగుదేశం పార్టీ అధినేత స్వయంగా ప్రతిపక్షాన్ని చీల్చే ప్రయత్నంలో 21 మంది శాసనసభ్యులను ప్రలోభ పెట్టి, కేసులు పెట్టి రకరకాల విన్యాసాలు ప్రదర్శించి పార్టీ ఫిరాయింప చేశారు. అందులో ఆరుగురు శాసనసభ్యులు కర్నూలు జిల్లా వారు. డబ్బు, పదవులు, అక్రమ కేసుల్లో ఇరికించడం, బెదిరించడం–ఇట్లా అనేక కారణాలతో ఆరుగురు ఆ జిల్లాలో అధికార పక్షం పంచన చేరినా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మరో 15 మంది ఎంఎల్‌ఏలు వలస వెళ్లినా చంద్రబాబుకు సుఖం లేకుండా పోయింది. ముఠా సంస్కృతిని అంతం చెయ్యాలని డాక్టర్ రాజశేఖరరెడ్డి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే చంద్రబాబు కొత్త ముఠా సంస్కృతికి తెర లేపారు.
అందుకు ఉదాహరణ ప్రకాశంజిల్లా అద్దంకి ప్రాంతంలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఘర్షణ. మొన్నటికి మొన్న బలరాం అనుచరులు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రతి జిల్లాలోనూ కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి. నయా రాజకీయ ముఠా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి, పెంచి పోషించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.
భూమా మరణం వెనుక వేధింపులు
కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్‌పీవై రెడ్డికి పచ్చకండువా కప్పేశారు ముఖ్యమంత్రి. ఆ తరువాత మరో ఆరుగురిని పార్టీ ఫిరాయింప చేసి ఆగం చేశారు. ఆగం అని అనడానికి ఉదాహరణ భూమా నాగిరెడ్డి. వైఎస్‌ఆర్‌సీపీ టికెట్ మీద గెలిచిన నాగిరెడ్డి మీద అడ్డగోలు కేసులు పెట్టి, వేధించి, జైలుకు కూడా పంపి చివరికి అవన్నీ ఎత్తేస్తామనీ, మంత్రి పదవి కూడా ఇస్తామనీ పార్టీ ఫిరాయింప చేసి ఆ తరువాత కేసులూ ఎత్తెయ్య లేదు, మంత్రి పదవీ ఇవ్వలేదు. చివరికి ఆయన ఆగం ఆగమై మనోవ్యధతోనే అకాల మరణం చెందారు.
ఏళ్ల తరబడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన భూమా కుటుం బం ఇప్పుడెక్కడ? అయినా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మార్పు రాలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 2014 పునరావృతం అవడమే కాక మరింత ఎక్కువ నష్టం జరగబోతున్న విషయం తెలుగుదేశం అధినేతకు తెలుసు. అందునా మొన్న హత్యకు గురైన నారాయణరెడ్డి పోటీ చేసే పత్తికొండ ఆ జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ మంచి మెజారిటీతో గెలిచే మొదటి స్థానం అవుతుందనీ తెలుసు. నారాయణరెడ్డి ప్రతిపక్షంలో ఉండి, ప్రభుత్వపక్ష ఆగడాలను ప్రతిఘటిస్తూ వచ్చిన నాయకుడు, ముఖ్యంగా ఇసుక అక్రమ దందాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ప్రజల అభిమానం ఎంత చూరగొన్నాడో మొన్న ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజా సమూహమే నిదర్శనం. కేసుల పేరిట బెదిరించి, పదవులూ తాయిలాలూ చూపి ప్రలోభపెట్టి ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసి; వాటికి వేటికీ లొంగని వారిని భౌతికంగా అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో అధికారపక్షం పడిందన్న అభిప్రాయం నారాయణరెడ్డి హత్యోదంతం కలిగిస్తున్నది. ఈ కేసులో సీబీఐ విచారణ కోసం అధికార పక్షమే, ముఖ్యమంత్రే స్వయంగా ముందుకొచ్చి స్వచ్ఛం దంగా కేంద్రానికి సిఫార్సు చేస్తే కొంతన్నా విమర్శ తగ్గుతుంది.
పదిహేను మందిని చంపారు
ఇక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందనీ, రాష్ట్రపతి పాలన విధించాలనీ గవర్నర్‌కు చేసిన వినతి మాటకొస్తే ఈ మూడేళ్లలో విపక్షానికి చెందిన పదిహేను మంది హత్య, ప్రభుత్వం పట్టించుకోదు, అధికార పక్షానికి చెందిన వారి మీద కేసులు మాఫీ చెయ్యడం కోసం మాత్రం 132 జీఓలు జారీ అవుతాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్ర చందనం స్మగ్లర్ల పేరిట 25 మంది తమిళనాడు కూలీల ఎన్‌కౌంటర్, గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి ప్రచారం కోసం సినిమా షూటింగ్ చేసే క్రమంలో 27 మంది అమాయక భక్తులదుర్మరణం, ఇటీవలే ఇసుక దందా వివాదంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ప్రమాదం పేరిట 17మంది అనుమానాస్పద మృతి, పక్క రాష్ట్రం తెలంగాణలో ఎంఎల్‌ఏను కొనే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం నుంచి నారాయణరెడ్డి ఆయన అనుచరుడు సాంబశివుడి హత్య దాకా ప్రతిపక్షం రాష్ట్రపతి పాలన డిమాండ్‌కు మద్దతుగా ఎన్నో కారణాలు చూపుతున్నది.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత కాబట్టి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారనుకుందాం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్ కంటే కూడా అధ్వానంగా తయారయిందని జపాన్ సంస్థకు చెందిన మాకీ ఏ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నట్టు? సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మార్కండేయ కట్జుకు ఏమవసరమని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞాపనలు పంపారు? ఈ సమస్యలన్నీ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రిని కలిసినప్పుడు ప్రతిపక్ష నేత జగన్ వివరించే ఉంటారు. అయితే కేంద్రంలో తమ భాగస్వామి, రాష్ట్రంలో తాము భాగస్వామీ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల మోదీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. మరో రెండు మాసాల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఏం జరగబోతుందో ఎదురుచూడాల్సిందే. ఏదేమయినా నారాయణరెడ్డి హత్యఅధికార పక్షాన్ని వెంటాడక మానదు.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com