లాలూ ప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు
తినకూడనిదేదో తింటున్నట్లున్నాడు నితీశ్ కుమార్. మోదీ లంచ్‌కి పిలవగానే బిహార్‌లో తను తింటూ ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా వదిలేసి ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశాడు! సోనియా లంచ్‌కి పిలిస్తే వెళ్లనివాడు, మోదీ లంచ్‌కి పిలవగానే ఆ ఎంగిలిచేత్తోనే వెళ్లిపోయాడు.
‘ఏమయ్యుంటుంది ప్రసాద్’’ అని రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ని అడిగాను. ఇలాంటి ప్రశ్నలకు ప్రసాద్ మీసాలతో నవ్వుతాడు. గడ్డంతో నవ్వుతాడు. ముక్కుతో నవ్వుతాడు. కనుబొమలతో నవ్వుతాడు. అంతే తప్ప, నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుండి మాత్రం నవ్వడు.
‘‘చెప్పు ప్రసాద్.. శుక్రవారం సోనియాజీ లంచ్‌కి పిలిస్తే వెళ్లకుండా, శనివారం మోదీ లంచ్‌కి పిలిస్తే నితీశ్ ఎందుకు వెళ్లి ఉంటాడు?’’ అని అడిగాను.
మళ్లీ అంతకుముందులానే నవ్వాడు ప్రసాద్.
‘‘సోనియాజీ ఇచ్చే లంచ్ కన్నా, పీఎం ఇచ్చే లంచ్ టేస్ట్‌గా ఉంటుందని అనుకుని ఉంటాడు’’ అన్నాడు.
ప్రసాద్ సరిగ్గానే గెస్ చేశాడు. మోదీ ఏం చేసినా నితీశ్‌కి నచ్చుతోంది. సర్జికల్ స్రై్టక్‌లు నచ్చాయి. డీమోనిటైజేషన్ నచ్చింది. నా మీద, నా ఇద్దరు కొడుకుల మీద, నా పెద్ద కూతురు మీద బినామీ ఆస్తుల కేసులు పెట్టడం నచ్చుతోంది. అంటే.. నితీశ్‌కి మోదీజీ ముఖం నచ్చుతోంది!
వెంటనే నితీశ్‌కి ఫోన్ చేశాను.
‘‘నా ముఖానికి ఏమయింది నితీశ్! నచ్చలేదా?’’ అని అడిగాను. రిప్లయ్ లేదు.
‘‘నాకు సీట్లు ఎక్కువొచ్చినా, నిన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టాను కదా నితీశ్’’ అన్నాను. రిప్లయ్ లేదు.
‘‘చెప్పు నితీశ్.. మళ్లీ బీజేపీతో టై అప్ అయ్యి, ఎన్డీయేలోకి వెళ్లిపోతావా?’’ అన్నాను.
‘‘సార్ లేరు.. ఢిల్లీ వెళ్లిపోయారు’’ అన్నాడు!
‘‘నిన్ను నువ్వు సార్ అనుకునే స్థాయికి దిగజారిపోయావా నితీశ్!’’ అని అడిగాను.
‘‘నిజంగానే నేను సార్‌ని కాదు సార్’’ అన్నాడు వాడెవడో. చిరాకొచ్చేసింది. ‘‘నువ్వెవరు?’’ అన్నాను.
‘‘సార్ దగ్గర ఉంటాను సార్’’ అన్నాడు!
‘‘ఏమైంది లాలూజీ’’ అంటున్నాడు ప్రసాద్.
‘‘సోనియాజీ ఫోన్ ఎత్తుతుంది. మమతా బెనర్జీ ఫోన్ ఎత్తుతుంది. మాయావతి ఫోన్ ఎత్తుతుంది. అఖిలేశ్ యాదవ్ ఫోన్ ఎత్తుతాడు. చెయ్యను కానీ.. చేస్తే నరేంద్ర మోదీ, అమిత్‌షా కూడా ఫోన్ ఎత్తుతారు. నితీశ్ ఎందుకు ఫోన్ ఎత్తడు ప్రసాద్!’’ అని అడిగాను.
‘‘తింటున్నాడేమో లాలూజీ’’ అన్నాడు ప్రసాద్.
కళ్లు మూసుకున్నాను. కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను. నిజమే. ఢిల్లీలో ఒక మతవాది, ఒక లౌకికవాది కలిసి కూర్చొని లంచ్ చేస్తున్నారు!
మళ్లీ కళ్లు మూసుకుని, మళ్లీ కనురెప్పల్ని వేళ్లతో అదుముకున్నాను.
లంచ్ పూర్తయింది. ఇద్దరు మతవాదులు సోంపు నములుకుంటూ డైనింగ్ హాల్‌లోంచి పెద్దగా నవ్వుకుంటూ బయటికి వస్తున్నారు.