ట్రయల్ పార్టీ చూపిస్త మావ...
మామూలుగా నవలల్ని సినిమాలుగా తీసేవారు. ఇప్పుడు నవలలకి సినిమాల్లాంటి ట్రయల్ పార్టీలు మొదలయ్యాయి. పోయిన రెండు మూడు వారాల్లో ముగ్గురు రచయితలు ఇలా ‘ట్రయల్స్’ వదిలారు. ‘‘ట్రయల్ పార్టీ’’ తెలుసా? పాతకాలపు సినిమాలకు ముందు ఫిలిమ్స్ డివిజన్ డాక్యుమెంటరీలు వేసేవారు. పిల్లలకి విసుగే. అయినా గాంధీగారు కనిపించినా, నెహ్రూగారు కనిపించినా గట్టిగా చప్పట్లుకొట్టి సరదాపడిపొయ్యేవాళ్లు. వాటినే తేటతెలుగులో ట్రయల్ పార్టీ అనేవారు.
రంగుల సినిమాలొచ్చాయి. కొంతకాలానికి వాటి ‘ట్రయల్ పార్టీ’లు మొదలయ్యాయి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకి ట్రయలర్లు భారీ ఖర్చుతో తీస్తున్నారు. ‘‘మాకు తెలుసులేవో’’ అంటారా? అసలు సంగతి వాటి గురించి కాదు. పుస్తకాల ప్రచురణలో కూడా ఈ ట్రయల్ వచ్చి కూచుంది.
మామూలుగా నవలల్ని సినిమాలుగా తీసేవారు. ఇప్పుడు నవలలకి సినిమాల్లాంటి ట్రయల్ పార్టీలు మొదలయ్యాయి. పోయిన రెండు మూడు వారాల్లో ముగ్గురు రచయితలు ఇలా ‘ట్రయల్స్’ వదిలారు. ముగ్గురూ బానే పేరున్నవాళ్లే.
మొన్న మే మొదటి వారాంతంలో రచయిత అమిష్ రాబోయే తన నవల ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ను డెరైక్టర్ కరణ్ జోహార్‌తో రిలీజ్ చేయించాడు. ‘రామచంద్ర’ పేరిట రాబోయే తన గొలుసు నవలల్లో ఇది మొదటిది. వెస్ట్‌లాండ్ పబ్లిషర్స్ 2013లో ఈ నవలలకి ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. అమిష్ అంటాడూ: ‘‘నా నవలల మీద వసూళ్లు 30 నుంచి 40 కోట్ల రూపాయలుంటాయి. అంటే ఒక మధ్యరకం బాలీవుడ్ సినిమా ఆదాయం. కనుక దాని ట్రయలర్ కూడా అదే తరహా ప్లానింగ్, బడ్జెట్‌తో ఉంటుంది’’. ఈ ట్రైలర్‌లో మంటల బాణాలూ, గుర్రాలూ సైన్యాల కత్తులూ కటార్లూ అచ్చం ‘జోధా అక్బర్’ లెవెల్‌లోనే ఉంటుంది. ఇది ‘‘ప్రధానంగా మార్కెటింగ్ సాధనం... పుస్తకంలో ఉండే విషయాలూ, వాతావరణమూ పాఠకులకు తెలుస్తాయి. ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకోవటానికి పబ్లిషర్లకు ఇది ఉపయోగం’’ అని పెంగ్విన్ రేండమ్ హౌస్ బాస్ చెప్పారు.
అనుజా చౌహాన్ అనే రచయిత్రి కూడా తన కొత్త నవలకు(ద హౌజ్ దట్ బిజె బిల్ట్) ఇలాగే ట్రైలర్ విడుదల చేస్తే, మొదటి రోజే రెండు వేల మంది చూసి, అభిప్రాయాలు చెప్పారు. కరణ్ బజాజ్ కూడా తన కొత్త నవల(ద సీకర్) ట్రైలర్ ఇలాగే రిలీజ్ చేశాడు. అయితే ఈ రెండూ మొదటి ట్రైలర్‌లాగా హాలీవుడ్ హడావుడితో అంత బిగ్ బడ్జెట్‌వి కావు. పుస్తకమంటే అంతా పాఠకుడి ఊహకి వదిలేయాలి కానీ ఈ తతంగమంతా ఏవిటి? అని కొందరు పాతకాలంవాళ్లు నసిగారు. కానీ అమెరికాలో ఈ సాంప్రదాయం పదేళ్ల నుండీ ఉందట. ఆస్కార్ అవార్డ్స్‌లాగా ‘మోబీ అవార్డ్స్’ 2010 నుండీ ఈ ట్రైలర్‌లలో ఉత్తమ చిత్రాలకు ఇస్తున్నారట.
అయితే అన్ని రకాల పుస్తకాలకీ ఇలా పురా పురా ట్రైలర్స్ తీసేయరు. ‘కమర్షియల్ సక్సెస్’ ఉంటుందని గట్టిగా అనిపిస్తేనే ఇలా చేస్తామని వెస్ట్‌లాండ్ సీఈవో చెప్పారు. ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ నవలని ఈ పబ్లిషర్స్ 60 లక్షల కాపీలు అచ్చేసి వదుల్తున్నారు.
పాఠకులనే వాళ్లు పుస్తకాల షాపుల్లో, లైబ్రరీలలో ఏమాత్రం కనిపించడం లేదు. కనుక వాళ్లని పట్టుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌ల లాంటివే దారి. అయితే ట్రైలర్ వల్ల పుస్తకాలు బాగా అమ్ముడవుతాయని ఇంతవరకూ ఎక్కడా రుజువు కాలేదని కూడా పబ్లిషర్లే చెబుతున్నారు.
ఇలాంటి కబుర్లు వింటుంటే, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, ఇతర ప్రాంతీయ భాషల రచయితలూ, ప్రచురణ కర్తల గుండెలవిసిపోతాయి. లక్షల కాపీలూ, కోట్ల ఆదాయం వీళ్లెవరూ వచ్చే జన్మలో గూడా ఊహించలేనివి. గబ్బర్‌సింగ్, బాహుబలి లాంటి సినీ బడ్జెట్‌లలో శతాంశంతో గూడా ఒక నవల, కథల సంపుటి రావడం కలలో మాట. ఏమో మన వచనానికీ, కవితకీ, ఇలాంటి ‘అదృష్టం’ పట్టకపోవడమే మహద్భాగ్యమేమో!
సబ్బులనీ, షాంపూలనీ ఎడ్వర్‌టైజ్‌మెంట్ బ్లిట్జ్‌తో మార్కెటింగ్ చేయడం చిత్రం. అమెరికన్ మహారచయిత ఆప్టన్ సింక్లైర్ మాటలు గుర్తొస్తున్నాయ్:
... ఎవ్వరూ చదవని ఒక బుక్ రాశానంటే మిస్టర్ మనీ వికటాట్టహాసం చేస్తాడు. ఓ లక్ష కాపీలు అమ్ముడుపోయిన రచయిత అంటే, పుస్తకం ఎలా ఉన్నా సరే అతడు గొప్ప రచయితైపోతాడు. అది కూడా ఎంత తక్కువ కాలంలో ఎన్ని ఎక్కువ కాపీలు అమ్ముడైతే అంత గొప్ప. కావలసింది సక్సెస్. అంతే తప్ప, సక్సెస్ ఎలా వచ్చింది? ఏ కారణం వల్ల అది సక్సెస్ అయింది అనేది అనవసరం. ఎవరో చెప్పినట్టుగా ‘గొప్పవాడు’, ‘ప్రముఖుడు’ అనేవాళ్లు ఆకర్షిస్తారు. గొప్ప స్మగ్లర్, హంతకుడు, గొప్ప కళాకారుడు, గొప్ప వ్యభిచారి, గొప్ప అనేదాన్ని ఆరాధిస్తాం. వీళ్ల గిఏై’ట గిఏైలో ఎటువంటివాడైనా సరే, హంతకులు, దొంగలు, నేరస్థులు, ప్రెసిడెంట్లు, కోటీశ్వరులు, గ్రామీణులు ఎవరైనా సరే ‘గొప్ప’వాళ్లు మాత్రమే ఉంటారు. వీళ్ల ఆదర్శం చాలా స్పష్టమైనది. నిఖార్సైనది. ‘ఒరిజినాలిటీ’, ‘కొత్త’ అనేవి వీళ్ల నిఘంటువులో లేవు. ప్రపంచం మొదటినుంచీ ఇలాగే ఉంది. ఇలాగే ఉంటుంది... మానవ స్వభావం మారదు. ‘బిచ్ గాడ్ ఆఫ్ సక్సెస్’ను ఆరాధించిన అమెరికన్ సమాజం గురించి ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో ఇలా రాశాడాయన. ఇపుడు సింక్లైర్ బొంబాయిలో ఇంగ్లిషు చదివే, మాట్లాడే జనం మధ్య ఉంటే మళ్లీ ఇలాగే రాస్తాడేమో!