
మూడు కాళ్ల కుందేళ్లు
జీవన కాలమ్
ఈ మధ్య పేపర్లో చదివాను. ఒకానొక గ్రామంలో ప్రజలెవరూ ఇంతవరకూ న్యాయస్థానం ఎలా ఉంటుందో ఎరగరట. ఈ దేశంలో కోట్ల వ్యాజ్యాలు కోర్టుల్లో మురుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద విడ్డూరం. ఇదేమిటి? వీళ్లకి సమస్యలు రావా? తగాదాలు ఉండవా? తేల్చుకోవలసిన అంశాలు ఉండవా? ఉంటాయి. కానీ ఉండవలసిన గొప్ప సంప్రదాయం వారి దగ్గర ఉంది. తమ పెద్దల మాటనీ, తీర్పునీ గౌరవించే సంస్కారం. ఇది చాలా గొప్ప పరిణతి.
మనదేశంలో రాజకీయ నాయకులు, మంత్రులు పాలన జరపడం మానేసి చాలా కాలమయింది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పాలన ఎలా జరగాలో ప్రతీ చిన్న విషయాన్నీ నిర్దేశిస్తోంది. కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనని విధించింది. న్యాయస్థానం అది సబబుకాదంది. ప్రభుత్వం ఫలానా పార్టీ సొంత కంపెనీ కాదంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రజల మనసుల్లో అలాంటి చర్య ఒక ‘నిస్పృహ’ని కలిగిస్తుందంది. 10 రాష్ట్రాలలో 33 కోట్ల మంది ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక అలమటిస్తూంటే లక్షల లీటర్ల నీటిని క్రికెట్ మైదానాల్ని తడపడానికి ఖర్చు చేసి కోట్ల ఆదాయాన్ని సంపాదించే క్రికెట్ ఆటకి పూనుకున్నారు. రెండు రోజులకొకసారి లభించే గుక్కెడు నీళ్లు 41 అడుగుల లోతు నూతిలోంచి తోడు కోడానికి వెళ్లిన 11 ఏళ్ల పిల్ల చచ్చిపోయింది. ‘‘నీళ్లు వృథా చెయ్యకండి బాబూ! మనుషులు చచ్చి పోతున్నారు’’ అని న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది.
ఆ మాత్రం కనీస బాధ్యతని ఈ దేశపు పెద్దలకి కోర్టులు తమ అధికారంతో నేర్పాలా? 9000 కోట్లు ఎగవేసి పరాయి దేశంలో సేద తీర్చుకుంటున్న ఓ పెద్ద మనిషిని ఈ దేశపు న్యాయస్థానం అరెస్టు చేసి తీసుకురావలసిన చర్యకు పూనుకోవ లసి వచ్చింది. ‘‘మీ గుడిలో దేవుడికి మొక్కు కోవడానికి మీ అమ్మకీ, మీ బిడ్డకీ, మీ భార్యకీ అవకాశం ఇవ్వండి బాబూ! ’’ అని సుప్రీంకోర్టు మగభక్తులకి చెప్పాల్సి వచ్చింది. మా ఇంట్లో తెలంగాణ పనిమనిషి పనిచేస్తోంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది కనుక- మా రాష్ట్రంలో తెలంగాణ పని మనిషి- పనిచేస్తున్నా జీతం ఇవ్వను అన్నాను. ‘‘కాదు బాబూ! ఆమె మీ పనిచేస్తోంది. మీ ఇంట్లో పని చేస్తోంది. మీరు ఇవ్వాల్సిందే’’ అని 1250 మంది ఆంధ్రా విద్యుచ్ఛక్తి సిబ్బందికి జీతాలివ్వమని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది.
నూడుల్స్ అమ్మకాన్ని, ఇసుక పంపకాన్ని, నీటి వనరుల కేటాయింపుల్ని, ఆస్తుల పంపకాల్ని - అన్నిటిని ఎల్లవేళలా సుప్రీంకోర్టే నిర్ణయిస్తోంది. ఒక నాయకుడు మూతి బిగించి - ‘‘నా మెడ మీద కత్తి పెట్టినా నేను ‘భారత్ మాతాకీ జై’ అనను’’ అన్నారు. సభలో ఆ వర్గం వారు చప్పట్లు కొట్టారు. ఈ దేశంలో ఎవరూ ఈయన్ని అనమనలేదు. కానీ ఆయనే అన్నారు. ఎందుకట? రాజ్యాంగం ఆ పని చెయ్యమని చెప్పలేదు కనుక. ‘‘మనం ఏం ఒప్పుకోవాలో వీళ్లు చెప్పనక్కరలేదు’’ అనే అరాచకం నేలబారు ప్రజలకి నచ్చుతుంది కనుక. ప్రజల్ని మెప్పించే ఇచ్చకం నేటి రాజకీయం. ఇలాంటి మెచ్చుకోలు కబుర్లకి ‘చట్టపరమైన’ ఔచిత్యం ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు కోర్టులు చెప్పాలి.
తాము చేసే పనులు సబబు కాదని తెలిసినా-పైన చెప్పినవేవీ చట్టానికి నిలవవని వారికి తెలుస్తున్నా - సుప్రీంకోర్టు దాకా లాగి- న్యాయస్థానం తీర్పు వింటే కానీ అంగీకరించని స్థితికి నేటి నాయకత్వం వచ్చింది. ఇది ఎంత అనవసరమో, హాస్యాస్పదమో, అనర్ధమో- విచక్షణనీ, పెద్దరికాన్నీ తమ గ్రామ పెద్దల్లోనే నిలుపుకున్న ఓ చిన్నగ్రామం నిరూపించడం విశేషం. మన అదృష్టం బాగుండి ఈ దేశంలో న్యాయస్థానాలున్నాయి కనుక బతికిపోయాం గానీ లేకపోతే ఈ దేశంలో అన్ని కుందేళ్లకూ మూడే కాళ్లుండేవి.
గొల్లపూడి మారుతీరావు