పాడి సంతలైన పశువుల సంతలు
సందర్భం
కేంద్ర ప్రభుత్వం జంతువుల మార్కెట్ల క్రమబద్ధీకరణపై తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో గొడ్డు మాంసాన్ని నిషేధించలేదు. కేంద్రం అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే.. అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు.
భారత ప్రభుత్వ పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ 2017 మే 23న అన్ని రాష్ట్రాలలోను జంతువుల మార్కెట్లను క్రమబద్ధీకరించడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్కెట్‌లు రైతులకు మాత్రమే ఉద్దేశించినవి. ఇక్కడ రైతులు వ్యవసాయ అవసరాల కోసం పశువులను కొనవచ్చు, అమ్మవచ్చు. జంతువులSపట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద ప్రకటించిన ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు.. 1. జిల్లా జంతువుల మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలి. 2. పశు వైద్యసేవలు, ఆశ్రయం, నీరు, పశుగ్రాసం వంటి అన్ని రకాల సౌకర్యాలను నిర్వహిం చాలి. ఈ నిబంధనలు ఆవులు, దూడలు, గేదెలు, ఒంటెలు, కోళ్ళు వంటి వాటికి వర్తిస్తాయి. కాని గొర్రెలకు, మేకలకు కాదు.
ఈ వార్త మీడియాలో మే 25వ తేదీన వెలుగు చూసింది. 29వ తేదీన మద్రాస్ హైకోర్టు (మదురై బెంచి)లో కొందరు రాజ్యాంగ పరమైన అంశాలుపైకి చాలెంజ్ చేస్తే ఈ నోటిఫికేషన్‌ను నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఫెడరల్ వ్యవస్ధని దెబ్బ తీస్తుంది కనుక దీన్ని మేం అమలు చేయమని ఒక సీఎం అన్నాడు. ఇంకో సీఎం అయితే తామే మిగిలిన సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నోటిఫికేషన్‌ని వ్యతిరేకిస్తాం అన్నాడు. మరో సీఎం ఇది కేంద్ర నోటిఫికేషన్, దీన్ని అమలు చేయకండి అని మాంస వ్యాపారాలకు పత్రికా ముఖంగా పిలుపునిచ్చాడు. ఒక పార్టీ కార్యకర్తలు బీఫ్ పెస్టివల్ పెట్టి ఒక దూడనే క్రూరంగా, అన్యాయంగా, చట్ట విరుద్ధంగా చంపి బహిరంగ విందు చేసుకున్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు విశ్లేషకులు, పరిశోధకులు, వకీళ్లు మీడియా ద్వారా కేంద్ర నోటిఫికేషన్‌ని వ్యతిరేకిస్తూ రకరకాల వాదనలు చేస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం, పశువుల పెంపకం రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఎందుకు ప్రకటించింది అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. 2014 నుంచి జరిగిన కొన్ని చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే అటువంటి ప్రశ్నలకు జవాబు లభిస్తుంది.
ఆ వాస్తవాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి: గౌరి మలేఖ అనే జంతు సంక్షేమ కార్యకర్త సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 881/2014 నంబరుతో 2014లో దాఖలైన ఈ వ్యాజ్యంపై విచారణ 14 అక్టోబర్ 2014న మెుదలైంది.
నేపాలీ హిందువులు ప్రతి ఐదేళ్లకోసారి గథిమా పండుగ జరుపుతారు. ఈ పండుగ ఆచారాలలో భాగంగా లక్షలాది పశువులను బలి ఇస్తారు. 2014లో జరిగిన పండుగలో దాదాపు 2.5 లక్షల పశువులను బలి ఇచ్చారని అంచనా. దీని కోసం మనదేశం నుండి లక్షల సంఖ్యలో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇలా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను నిరోధించడం ఈ వ్యాజ్యంలో ప్రధాన అభ్యర్థన. ఈ అక్రమ రవాణా వలన మన సరిహద్దు భద్రతాదళం వివిధ కార్యాచరణ సమస్యలను ఎదుర్కొంటోంది.
హోం మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 203 సంఖ్య గల నివేదికలో పశువుల అక్రమ రవాణా గురించి చర్చిం చింది. నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం ప్రతి ఏటా లక్షలాది పశువులను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. సాధారణంగా ఈ విధంగా స్వాధీనం చేసుకున్న పశువులను కస్టమ్స్ శాఖకు అప్పగిస్తారు. గడచిన సంవత్సరాలలో వీరు స్వాధీనం చేసుకున్న పశువుల సంఖ్య : 2012–1,20,724, 2013–1,22,000, 2014–1,09,999, 2015–1,53,602.
కమిటీ నివేదిక పేరా 2.6.9 లో ఈ విధంగా సిఫారసు చేసింది.
‘‘అన్ని రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం వైపు పశువుల సామూహిక గమనం జరుగుతున్నదని కమిటీ అంగీకరిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల వైపుగా జరుగుతున్న పశువుల గమనాన్ని ఆపడంలో వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు విఫలమయ్యాయని, పశువుల కదలికలను అడ్డుకోవడంలోను లేదా ఆపడంలోను పశ్చిమ బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని కమిటీ భావిస్తోంది. లోతుగా పాతుకుపోయిన దుష్ట సంబంధాలే ఈ సమస్య విస్తరించడానికి కారణమని, దీనిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం ఈ మూలాలపై దెబ్బతీయాలని కమిటీ భావిస్తోంది’’.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, రాష్ట్ర ప్రభుత్వాలను కక్షిదారులుగా చేర్చింది. పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది.
ఈ వ్యాజ్యంపై విచారణ 14 సార్లు జరిగింది. 12 జూన్ 2016 న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద నిబంధనలను మూడు నెలలలోపు ప్రకటించాలని కేంద్ర పర్యావరణం, అడవుల మంత్రిత్వశా ఖను కోరింది. తదనుగుణంగా 16 జనవరి 2017న పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను ఆహ్వానించింది.
కొత్త నిబంధనల ప్రకారం జంతువుల మార్కెట్‌లు రైతుల కోసం ఉద్దేశించినవి కనుక, అక్కడ వ్యవసాయేతర అవసరాలకు జంతువులను కొనాలనే వారుగాని, అమ్మాలనుకునే వారుగాని, వధశాలల ప్రతినిధులు గాని వ్యవహారాలు జరుపకూడదు. వధించడం కోసం జరిగే జంతువుల క్రయ, విక్రయాలు ఈ మార్కెట్‌ల వెలుపలే జరగాలి. అయితే, ఆ విధంగా విక్రయించే అన్ని జంతువుల ఆరోగ్యం గురించి పశువైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
31 మే 2017 న కేరళ హైకోర్టు ఈ నియమాల రాజ్యాంగ బద్ధతను ధ్రువీకరిస్తూ, ఈ నియమాలు గొడ్డు మాంసాన్ని నిషేధించలేదని, యదార్థంగా ఈ నియమాలను పూర్తిగా చదవకుండానే ప్రజలు స్పందిస్తున్నారని చెబుతూ, దీనిపై వచ్చిన అభ్యర్థనను రద్దు చేసింది. పై వివరణను అర్థం చేసుకున్న వాళ్లకి కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్య నిస్సందేహంగా సత్యమనే అనిపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నియమాలను ప్రకటించే ముందు అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దాంతో ప్రజాధన వృధాను, అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు.
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్
పి. వేణుగోపాల్ రెడ్డి
9490470064