గుణపాఠాలను గుర్తిస్తారా?
డా॥ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు
‘మార్క్సిజం’ కేవలం మిగిలిన తత్వశాస్త్రాల వలే మేధావుల చర్చలకే పరిమితం కాదనీ, దాని పునాదిగా శ్రామిక రాజ్యా న్ని ఏర్పాటుచేయవచ్చు నని రష్యాలో నిరూపించి న వాడు లెనిన్. కమ్యూనిస్టు పార్టీని తన నేతృత్వంలో నడిపించిన గొప్ప చా రిత్రక పురుషుడు లెనిన్! ఇప్పుడు మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలుగా ప్రకటించుకుంటున్న అనేకానేక పార్టీలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలను ఆనాడే లెనిన్ ఎదుర్కొన్నారు. ప్రధానంగా శ్రామికవర్గ రాజ్యం, సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమా? శాంతియుత మార్పునకు అవకాశం ఉన్నదా? అన్న ప్రశ్న అప్పుడూ ఉత్పన్నమయ్యింది. రష్యాలో మన పార్లమెంటు మాదిరి ‘డ్యూమా’ ఉంది. ఆ డ్యూమా పట్ల లెనిన్ వివిధ సందర్భాలలో, వివిధ వైఖరులు తీసుకున్నారు. ఈ పార్లమెంటు కేవలం కాలక్షేపపు కబుర్లకే పరిమితమనీ, అందులో పాల్గొనడం వృథా ప్రయాస అని డ్యూమాను గురించి విప్లవానికి కొన్ని నెలల ముందే వ్యాఖ్యానించి, దానిని బహిష్కరించాలని లెనిన్ పిలుపునిచ్చారు. కానీ విప్లవానికి కొన్ని వారాల ముందు డ్యూమాను శ్రామికవర్గం తన వర్గ పోరాటానికి సాధనంగా వాడుకుని, ‘నోరు’లేని కో ట్లాది నిరుపేదలకు ‘గొం తు’ కల్పించాలని లెనిన్ భా వించారు. అంతేకాదు ‘శ్రామి కవర్గ’ విప్లవం విజయవంతమైతే ఈ డ్యూమా (పార్లమెంటు)ను మరింత బల పరుస్తామని కూడా రష్యన్ కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రకటించారు. కానీ తీరా విప్లవం జయప్రదం అయిన మూడు నెలలకే అసలు డ్యూమానే లెనిన్ రద్దుచేశారు. దాని స్థానంలో మరో జాతీయ సంస్థను ఏర్పాటు చేయలేదు. లెనిన్ నాయకత్వాన కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ఈ చర్యను నాటి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రముఖ నాయకురాలు ‘రోజా లగ్జెంబర్గ్’ లెనిన్ ఉండగానే బాహాటం గా విమర్శించారు.
మరో ముఖ్యమైన విషయం కార్మికవర్గ నియంతృత్వానికి సంబంధించినది. మార్క్స్ రచించిన కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ఎక్కడా ఈ పదం నియంతృత్వంగా కనిపించదు. పైగా వాస్తవంలో శ్రామికవర్గ నియంతృత్వం అంటే శ్రామికవర్గ ప్రజాస్వామ్యమనీ... 90 శాతంగా ఉన్న పీడితులు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ నూటికి 10 మంది ఉండే దోపిడీదారులపై నియంతృత్వం అని మార్క్స్ తన మిత్రులకు ఒక లేఖలో వివరణ ఇచ్చారు. కానీ లెనిన్ కాలానికి కార్మికవర్గ నియంతృత్వం కేవలం సై ద్ధాంతిక అంశమే కాదు అది ఆచరణాత్మక ‘అవసరం’ అ యింది. అందుకు రష్యన్ విప్లవం జయప్రదం అయిన ఏడాదిలోపే రష్యా తీవ్రమైన అంతర్యుద్ధానికి గురైంది. పదవీ భ్రష్టులైన రష్యన్ దోపిడీ వర్గాల, పాశ్చాత్య దేశాల అండదండలతో రష్యన్ కష్టజీవుల రాజ్యంపై హింసాయుత తిరుగుబాటుకు పూనుకున్నారు. నిజానికి నవంబర్ శ్రామికవర్గ విప్లవం సమయంలో కంటే ఆ తర్వాత అంతర్యుద్ధంలోనే కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ హింసను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ క్రమంలో వార్ కమ్యూనిజం అనే పద్ధతినీ లెనిన్ ప్రభుత్వం అనుసరింపవలసి వచ్చింది.
మన కమ్యూనిస్టులు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని ఎలా అన్వయించాలి అన్న అంశం మీదే ఇన్ని పార్టీలుగా ముక్కలయ్యారు. వివిధ గ్రూపులు లెని న్ నుంచి తమకు అనుకూలంగానూ, ప్రత్యర్థులకు వ్యతిరేకంగానూ పేజీల కొలదీ ఉటంకించే ఆస్కారం ఉందని ఒక్క డ్యూమా పట్ల లెనిన్ వైఖరిని దృష్టిలో ఉంచుకున్నా అర్థమవుతుంది. అందుకే సీపీఎంకు మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య తరచుగా ఒక విషయం చెప్పేవారు. ‘‘మార్క్స్-ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్‌ల రచనల నుంచి కొటేషన్లకేం ఎన్నయినా ఇవ్వవచ్చు. కావలసింది మార్క్సిజాన్ని మన నిర్దిష్ట వాస్తవిక భౌతిక పరిస్థితికి అన్వయించడం. అదే ప్రధానమైన సమస్య’’ అనేవారు.
తమ మధ్య ఇన్ని విభేదాలు పెట్టుకున్న కార్మిక వర్గంలోని వివిధ పంథాలు విప్లవానికి కొత్త ఊపిరులూదడం ‘అసాధ్యం’ అని మార్క్స్ 1850 నాటి పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అన్నారు. ‘నిజానికి ఒక దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీ ఉండగా మరొక కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఎక్కడ?’ అని కూడా మార్క్స్ స్పష్టం చేశారు. కనుక మన దేశంలో అతి ముఖ్యమైనది కార్మికవర్గ ఐక్యత. మనది సువిశాల దేశం. వివిధ భాషలు, సంస్కృతు లు, జాతులు, ఉపజాతులు ఉన్న దేశం. రష్యా, చైనాలలో ఇంతటి వైవిధ్యం లేదు. వీటికితోడు వేళ్లూనుకున్న బానిస వ్యవస్థకు చిహ్నమైన కులవ్యవస్థ ఉంది. పీడన, దోపిడీ, వివక్షలకు గురవుతున్న ప్రజానీకాన్ని సమరశీల ఉద్యమాలలో సమీకరించకుండా తాము సాధించవలసిన బృహత్తర కర్తవ్యం సాకారమ వుతుందని కమ్యూనిస్టులు అనగలరా! ఉద్య మాలను నడుపుతున్న నాయకులు దీనిని గుర్తించాలి.