మాటల జలధారలతోనే సీమకు ‘సౌభాగ్యం’
సందర్భం
కృష్ణా బ్యారేజ్ ద్వారా గోదావరి జలాలను సముద్రానికి చేర్చే మహా విద్రోహం కాంట్రాక్టర్లను బాగుపరచడానికే తప్ప కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. సీమ రైతులకు అసలు ఒరిగేదే లేదు.
ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక తకు, ప్రజల పట్ల బాధ్యతకు అద్దం పడుతుంది. చంద్రబా బు నాయుడిగారి ఈ వార్షిక బడ్జెట్ మాత్రం బాధ్యతారాహి త్యానికి పరాకాష్ట! సీమను, మెట్ట ప్రాంతాలను ఉద్ధరిస్తా నని అంటూనే చంద్రబాబు ఈ బడ్జెట్లో కరువు ప్రాంతాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల బడ్జెట్‌లో ఘోర నిర్లక్ష్యం చూపారు. దాదాపు ఆరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల తాగు నీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు శూన్యం. ఉదాహరణకు ఒక్క అనంతపురం జిల్లా నుంచే 6 లక్షల గ్రామీణ ప్రజలు వలస బాట పట్టా రు. దాదాపు 1,000 గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఉంది. ఇక వ్యవసాయం సరే.. సరి. దాదాపు ఇదే పరిస్థితి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలది కూడా. గ్రేటర్ రాయలసీమలోని తెలుగుగంగ, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, శ్రీశైలం కుడి కాలువ, గండికోట తదితర ప్రాజెక్టులకు నిధులను సమకూర్చాల్సి ఉన్నా బాబు బడ్జెట్‌కు పట్ట లేదు. పోలవరం ప్రాజెక్టుపై శ్రద్ధ చూపిందీ లేదు. ఇటీ వల ఆయన చేపట్టిన రాజధాని పట్టిసీమ ప్రాజెక్టులపై రైతు సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విజయ వాడలో జరిగిన రాష్ట్ర రైతు సంఘాల సమావేశంలో 13 జిల్లాల రైతు ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, టీడీపీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా నేత కుమారస్వామి అధ్యక్షత వహించారు. ‘‘పోలవరం ముద్దు... పట్టిసీమ వద్దు’’ అనీ, రాయలసీమలోని సేద్యపు నీటి ప్రాజెక్టులకు రూ. 2,500 కోట్లు కేటాయిం చాలని, వాటిని పూర్తి చేసేవరకు మరే ఇతర ప్రాజెక్టులు చేపట్టరాదనీ ఆ సమావేశం రెండు తీర్మానాలు చేసింది. అనంతపురం సమావేశానికి 13 జిల్లాల రైతాంగం, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ, సీపీఎంల రైతు నేతలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో రాయల సీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును కోరారు. పట్టి సీమకు వ్యతిరేకంగా తీర్మానించారు. పోలవరంకు నిధుల కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎంతగా నెత్తీనోరూ కొట్టుకున్నా బాబు పట్టిసీమ ప్రాజె క్టుకు అధిక ప్రాధాన్యమిచ్చి దాదాపు రూ. 1,700 కోట్ల ను ఖర్చు పెట్టడానికి పూనుకున్నారు.
పైగా పుండుకు కారం రాసినట్టు.. ‘‘సీమకు సేద్య పు నీటిని అందించడానికి పట్టిసీమను చేపట్టినందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారు’’ అంటూ ఎదురు నీచ ప్రచారం ప్రారంభించారు. రాయలసీమ రైతులు ఏ రోజూ పోల వరం, పులిచింతల ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు. కాక పోతే పట్టిసీమ ద్వారా ఏవో ప్రయోజనాలు సమకూర బోతున్నాయని చెబుతున్న కల్లబొల్లి కబుర్లను వ్యతి రేకిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల్లో గాలేరు- నగరికి రూ. 1,400 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవు తాయి. బడ్జెట్‌లో కేటాయించింది రూ. 196 కోట్లు మాత్రమే. తెలుగు గంగకైతే రూ. 62 కోట్లే. హంద్రీ- నీవాకు రూ. 2,820 కోట్లు కావాలి. రూ. 212 కోట్లు దులపరించారు. వెలిగొండకు కావాల్సింది రూ. 2,981 కోట్లు. కానీ రూ. 153 కోట్లు విదిలించారు. పట్టిసీమకు రూ. 257 కోట్లు, పోలవరానికి రూ. 725 కోట్లు కేంద్రం అందిస్తుందని అంచనాలు వేశారు. పులిచింతల ప్రాజె క్టుకు రూ. 20 కోట్లు చాలన్నారు. శ్రీశైలం కుడికాలువకు కావాల్సింది రూ. 80 కోట్లు కాగా రూ. 10 కోట్లు కేటా యించారు. ఈ నిర్లక్ష్యం వల్లనే నీటికి కటకటలాడు తున్న ఈ ఏడాది కూడా 150 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయి. ఈ నిర్వాకం కప్పిపుచ్చు కోడానికి గోదావరి వరదతో పట్టిసీమ నీటిని కృష్ణా బ్యారేజి దగ్గరికి చేర్చి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఇంతకు మించిన దగా లేదు. కృష్ణా వరద జలాలు ఎగువనున్న శ్రీశైలం నుంచే రావాలి. అవే సీమకు అందేవి. కానీ, చంద్రబాబు పుణ్యమాని దాదా పు రూ.1,700 కోట్లు పట్టిసీమకు ఖర్చుపెట్టి మరీ.. కృష్ణా బ్యారేజ్ ద్వారా గోదావరి జలాలను సముద్రానికి చేర్చే మహా విద్రోహం కాంట్రాక్టర్లను బాగుపరచడానికే తప్ప కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. సీమ రైతులకు అసలు ఒరిగేదే లేదు. చంద్రబాబుది అసత్య ప్రచారమని, కపట నాటకమని ఆయన బడ్జెట్ కేటా యింపులే చెబుతున్నాయి.
గ్రేటర్ రాయలసీమ వాసులు మద్రాసు నుంచి విడి పోయినది ఆదిగా నేడు తెలంగాణ ఏర్పడే వరకు అడుగ డుగునా దగాపడ్డారు. కృష్ణా, పెన్నార్ నదీ జలాలు పోయాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తర్వాతే ఇతర ప్రాంతాల సాగునీటి గురించి యోచించాలన్న శ్రీబాగ్ ఒప్పందానికి తిలోదకాలిచ్చారు. నేడు శ్రీశైలం కృష్ణా జలాలపై సీమకు హ క్కే లేదంటున్నారు. సీమ కరువును రాజకీయ పెట్టుబడిగా వాడుకోవడం పార్టీలకు, నాయకులకు అలవాటైంది. రాయలసీమ కోసమే చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టును సీమ వాసులే అడ్డుకోయత్నిస్తున్నారంటూ చంద్రబాబు.. ‘‘దొంగే దొం గ, దొంగ’’ అని అరిచినట్టు గావుకేకలు పెడుతున్నారు. గోదావరి, కృష్ణా జలాలతో 13 జిల్లాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు తీవ్ర కృషికి అంకురార్పణ జరగాల్సి ఉం ది. అది వదలి హంద్రీ-నీవా నేనే ప్రారంభించానని, గాలేరు-నగరి, గండికోట రిజర్వాయర్లకు పునాది రాళ్లు వేశానని, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల రుణం తీర్చుకుంటానని ఊకదంపుడు ఉపన్యా సాలు, మోసపూరిత బడ్జెట్ కేటాయింపులు బాబుకున్న అంతంత మాత్రం విశ్వసనీయతకు సైతం గండి కొడ తాయని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు.
ఇమామ్, కదలిక పత్రిక సంపాదకులు.
మొబైల్ నం: 9989904389