-నదులు చెంతనే ఉన్నా సాగు, తాగునీటి కష్టాలు
– రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆవేదన
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్): రాయలసీమలో,ని సాగు, తాగునీటి కష్టాలను పాలకులకు పట్టడం లేదని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్లు సోమశేఖర్ శర్మ, నక్కలమిట్ట శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఓడబ్ల్యూ భవన్‌లో సోమవారం ఆ సమితి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమలోని రైతులు పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మిగులు జలాలపై నిర్మించబడుతున్న గాలేరు–నగరి, హంద్రీనీవాల్లో భవిష్యత్తులో నీళ్లు ఉండవని చెప్పారు.
సీమ ప్రజల వరప్రదాయిని అయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచే ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. 69 జీవోతో శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగుల నుంచి 834 అడుగులకే కుదించడం శోచనీయమన్నారు. సాగునీరు లేక పంటలు పండక వేలాదిమంది రైతులు నేడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. రైతు సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈనెల 21న రాయలసీమ జలచైతన్య సభలు నిర్వహిసు్తన్నట్లు చెప్పారు. అనంతరం ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వి.వి.నాయుడు, రత్నం యోసేపు, కోనేటి వెంకటేశ్వర్లు, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.