సీమపై సీఎం వివక్ష
సీమపై సీఎం వివక్ష
Published Fri, Apr 28 2017 11:22 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
- నికర జాలల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించాలి
- రాయలసీమ సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి
కర్నూలు సిటీ: అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడు రాయలసీమపై వివక్ష చూపుతున్నారని రాయలసీమ సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థాని ప్రభుత్వ జూనియర్ కాలేజీ(టౌన్ మెడల్)లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ తరతరలుగా అన్యాయానికి గురవుతోందన్నారు. సీమలో వందేళ్లలో 30కిపైగా కరువులు సంభవించాయన్నారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కోస్తా ప్రాంతంలో కొత్త కొత్త ప్రాజెక్టులను ఆగమేఘాల మీద చేపడుతున్నారన్నారు. ఇప్పటికే 85 శాతం నీటి పారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతానికే అన్ని ప్రాజెక్టులు మంజూరు చేయడం దారుణమన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీమలో 50 లక్షల మంది కరువుతో పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేవారు. రాయలసీమకు 40 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, దీనికి చట్టబద్ధత కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమలో కరువును పారదోలాలంటే తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు, శ్రీశైలం ఎగువన సిద్దేశ్వరం అలుగు నిర్మించాలన్నారు. సీమకు శాశ్వత జలాల చట్టబద్ధ హక్కులకు వచ్చే నెల21వ తేదీన నంద్యాలలో రాయలసీమ జల చైతన్య సభ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రత్నం ఏసేపు, గట్టు తిమ్మప్ప, రామశేషయ్య, మధుసూదన్‌శర్మ, రమణాగౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు కె.వెంకటేశ్వర్లు, నాగేశ్వరరెడ్డి, రంగముని, రీయాజ్, రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement