స్వైన్‌ఫ్లూపై స్పష్టత ఏది?
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాలేదని కొట్టిపారేయడంతోనే ఇటీవల వరకు సరి పెడుతూ వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రజలలో మాత్రం ఈ వ్యాధిపై ఒక భయానక వాతావరణం నెలకొంది. పత్రికలలో స్వైన్‌ఫ్లూ వ్యాధి వలన ఇప్పటికే చాలా మంది మృత్యువాతపడుతు న్నట్లు ప్రతి రోజూ కథనాలు వస్తున్నా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అసలు స్వైన్‌ఫ్లూ లేదని కరాఖండిగా చెబుతూ వచ్చింది. ఇప్పుడు సైతం ఈ వ్యాధితో చనిపోయేంత ప్రమాదం ఉండదని ఊపిరితిత్తులు, కాలే యం, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి స్వైన్‌ఫ్లూ వస్తే పరిస్థితి విషమిస్తుందని తెలుపుతూ చేతులు దులుపుకుంటోంది. మరో వైపున తెలంగాణలోని ప్రధాన ఆస్పత్రులలో సైతం వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికైనా మేల్కొని స్వైన్‌ఫ్లూ వ్యాధిపై నిజానిజాలు వెల్లడించాలి. ప్రజలలో రోజు రోజుకు పేరుకుపోతున్న భయాందోళనలను పార ద్రోలి, అందరికీ వైద్య చికిత్సకు వీలుకల్పించి భరోసా ఇవ్వాలి.
కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్
వీరికి విద్యార్హత వద్దా?
మన దేశంలో గుమాస్తా పదవులకు కూడా కనీస విద్యార్హతగా 5వ తర గతిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి రాజ్యాంగ విధులను నెరవేర్చే నాయకులకు కనీస విద్యార్హత లేకపోవడం వలన అవినీతి చెర గని సిరాగా మారిపోయింది. పైగా మన నేతలు శాసనసభకు, పార్ల మెంటుకు ఒకేసారి పోటీ చేస్తూ గెలిచాక ఏదో ఒకదాన్ని నిలుపుకుంటూ తక్కిన సీటుకు రాజీనామా చేస్తున్నారు. అలా వదులు కున్న సీటుకు మళ్లీ ఎన్నికలు జరపడం, లక్షలు, కోట్లలో ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా దేశం తీవ్రంగా నష్టపో తోంది. కాబట్టి గెలిచిన వారే రాజీనామా చేసిన నియోజ కవర్గం ఎన్నికల ఖర్చు భరించేలా ఎన్నికల కమిషన్ నిబంధన విధించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంటర్ ఉత్తీర్ణతను, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణ యించాలి. లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ ఉద్యో గులు విద్యార్హత లేని నేతలముందు చేతులు కట్టుకుని మెలగాల్సి వస్తుంది. ఇది ఉన్నత విద్యకే అవమానం. ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట ర్లను ఆకర్షించే నేతల వాగ్దానాలపై కొరడా ఝళిపించాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస విద్యను అర్హతగా పెట్టాలి.
కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి
మురుగన్‌లు మరణించరు
ప్రశ్నకు సమాధానం లేనప్పుడు, దౌర్జన్యమే శరణ్యమవుతుంది. భావ స్వేచ్ఛ మీద నమ్మకం లేనప్పుడు దాడే ఆయుధమవుతుంది. ప్రజాస్వా మ్యంలో విశ్వాసం లేనప్పుడు నిరంకుశత్వం పడగ విప్పుతుంది. గతం మీద మత్తు ఉన్నప్పుడు వర్తమానం మీద అసహ నం కలుగుతుంది. తార్కికబుద్ధి లోపించినప్పుడు మౌడ్యం విజృంభిస్తుంది. తమిళ రచయిత మురుగన్ విషయంలో ఇదే జరిగింది. దౌర్జన్యాలకు తలొగ్గి ఒక రచయిత తాను రచయితగా మరణించినట్లు తనకు తానుగా ప్రకటన చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రకు మాయనిమచ్చ. రచన వెలువ డినప్పుడు దాంట్లోని మంచి చెడులను నిర్ణయించడం ఒక నాగరిక చర్య. అలాకాకుండా, రచయిత మీద దాడిచేసి తాను మరణించానని అతడే స్వయంగా ప్రకటించేలా చేయడమంటే మనకు ప్రజాస్వామ్యం ఇంకా జీర్ణం కాలేదని అర్థం. దేశ గౌరవానికి ఇలాంటి సంఘటనలు తలవంపులు తెస్తాయి. ఒక అంశం మీద అందరికీ ఒకే రకమైన అభిప్రా యం ఉండదు. అభిప్రాయ భేదాలను గౌరవించడం కనీస ప్రజాస్వా మ్యం. భౌతిక దాడులతో బౌద్ధిక శక్తులను అణచివేయాలనుకోవడం అప్రజాస్వామికం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ మీద వీరి దాడిని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గర్హించి ఖండి స్తోంది. మురుగన్‌లు ఎన్నటికీ మరణించరని చాటుతున్నది.
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం
ధూమపాన నియంత్రణ!
ధూమపానాన్ని నియంత్రించే దిశగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగానే స్వాగతించదగినవి. దేశం లో 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పొగాకు ఉత్పత్తులను అమ్మాలనడం, సిగిరెట్లు విడిగా అమ్మకూడదనటం.. ఇవన్నీ ధూమ పాన నియంత్రణలో భాగమే. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమ పానం చేస్తే 200ల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తామనడం కూడా మంచి నిర్ణయమే. అయితే ఈ నిర్ణయాలన్నీ కచ్చితంగా అమలయ్యే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కొన్ని సంవత్స రాల క్రితం గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు కలిగించే పొగాకుతో కూడిన ఉత్పత్తులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇలాగే నిషేధం విధించింది. కానీ ఈ ఉత్పత్తులు నేటికీ దేశంలోని ప్రతి దుకాణంలోనూ లభ్యం కావడమనేది, నిషేధం అమలుపై కేంద్ర ప్రభు త్వ నియంత్రణా లోపాలను అత్యంత స్పష్టంగా ఎత్తి చూపుతోంది. దీని ఫలితంగా ప్రకటన చేయడం సాధ్యమే కాని, అమలు అసాధ్యం అని తేలుతోంది. ఇక్కడ ప్రభుత్వమే గాక, ప్రతి పౌరుడూ స్వచ్ఛందంగా వీటి అమలుకు తన సహకారాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తెరిగి నడుచుకోవాలి.
సలగల వెంకటేశ్వర్లు, బాపట్ల, గుంటూరు
ఉద్యోగులకు జీతాల్లేవా!
రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలకుగాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించ డానికి కూడా డబ్బు లేని స్థితిలో పడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. వేలాది కోట్ల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయగలిగిన, కోటిమంది తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక అందివ్వగలిగిన ప్రభు త్వం... తన ఉద్యోగులకు నెల జీతాలుకూడా చెల్లించలేని దుస్థితిలో ఉందా? ఇది నిజమే అయితే దీనికో పరిష్కారం ఉంది. సింగపూర్ తన భూమిని విస్తరించుకోడానికి తన చిన్న దీవి చుట్టూ ఉన్న లోతులేని సముద్ర ప్రాంతాన్ని నివాస యోగ్యంగా చేసుకోవడంలో విజయం సాధించింది. మనం కూడా ప్రతిపాదిత రాజధాని చుట్టూ ఉన్న 50 చద రపు కిలోమీటర్ల పరిధిలోని భూమిని కనీసం 50 ఏళ్లపాటు లీజుకిచ్చి దీనిపై ప్రతి ఏటా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మడం అవసరమయ్యాక ఇక కించపడాల్సిన పనిలేదు. నెపోలియన్ తన యుద్ధావసరాల కోసం లూసియానా ప్రాంతాన్ని అమెరికాకు అమ్మే శాడు. రష్యా జార్ చక్రవర్తి అలస్కాను అమెరికాకు అమ్మేశాడు. చైనా కూడా హాంగాంగ్, మకావూలను ఇంగ్లండ్, పోర్చుగీసులకు వందేళ్లపాటు లీజుకు ఇచ్చేసింది. పోర్చుగీసు రాజు మన ముంబైని బ్రిటిష్ రాణికి కట్నం కింద అప్పగించేశాడు. ఇలా చరిత్రలోని ఆచరణాత్మక అనుభవాలతో కొత్త రాష్ట్రం కూడా సింగపూర్ బాటలో నడవవచ్చు.
డాక్టర్ టి. హనుమాన్ చౌదరి, కార్ఖానా, సికిందరాబాద్