ఇదేమి రాజనీతి? | what is Political moral in killing of godavari puskaras pilgrims at rajamandry puskara ghat ? | Sakshi
Sakshi News home page

ఇదేమి రాజనీతి?

Published Sun, Jul 19 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

ఇదేమి రాజనీతి?

ఇదేమి రాజనీతి?

‘టైమ్స్‌నౌ’ న్యూస్ చానెల్  ప్రధాన సంపాదకుడు అర్నాబ్ గోస్వామి న్యూస్ అవర్ కార్యక్రమంలో వరుసగా రెండు రోజులు ఉతికి ఆరేసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మరింత ఎత్తిపొడవటం వల్ల ప్రయోజనం లేదు. గోదావరి మహాపుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 14వ తేదీ ఉదయం రాజమండ్రిలోని పుష్కరఘాట్‌లో 29 మంది అమా యకుల ప్రాణాలు పోవడానికి నైతిక బాధ్యత స్వీకరించి పదవి నుంచి వైదొలిగి ఉంటే చంద్రబాబునాయుడు (మంత్రి పల్లెరఘునాధరెడ్డి న్యూస్ అవర్ డిబేటులో అభివర్ణించినట్టు) రాజనీతిజ్ఞుడి (స్టేట్స్‌మన్)గా నిజంగానే పేరు తెచ్చుకునే వారు. లాల్‌బహదూర్‌శాస్త్రి, అడ్వానీల తర్వాత నైతికతకు ఆనవాలుగా చంద్రబాబునాయుడు పేరు చెప్పుకునేవాళ్ళం. అంతటి ఉదా త్తమైన స్పంద నను నేటి రాజకీయాలలో ఆశించడం అత్యాశ. కానీ ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కొన్ని అవాంఛనీయమైన రాజకీయ ధోరణుల సమీక్ష మాత్రం అత్యవసరం.
 
 పని చేసేవారే పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు గ్రహించి సవరించుకునే రాజకీయ నాయకులు కొద్దిమంది ఇంకా మిగిలి ఉన్నారు. డబ్బుపోసి అధికారం  సంపాదించడం, అధికారంతో డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో తిరిగి అధికారం దక్కించుకోవడం అనే చట్రంలో పడి తిరగడమే రాజకీయ మని త్రికరణశుద్ధిగా విశ్వసించే రాజకీయనాయకులు నానాటికీ అధికం అవుతున్నారు. రాజ్యాంగాన్నీ, చట్టాలనూ ఉల్లంఘించగలుగుతు న్నారు కానీ ఏదో ఒక అంతుచిక్కని అద్భుతం ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా సజీవంగా ఉన్నది కనుక ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలను ఎదుర్కో వడం తప్పనిసరి అవుతోంది. ఎన్నికలలో గెలుపొందడం కోసం కులాన్నీ, మతాన్నీ, ప్రాంతాన్నీ ప్రయోగించడం, అరచేతిలో ఆకాశం చూపించడం, అల వికాని వాగ్దానాలు చేయడం, ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కిన తర్వాత అన్నీ విస్మరించడం రె ండో రకం రాజకీయ నాయకుల లక్షణం. ఒకసారి ఎన్నికలైపోయిన తర్వాత తిరిగి ఎన్నికలు వచ్చేవరకూ అధికారం తమ హక్కుభుక్తమని తలపోసే రాజకీయ నాయకులు ఈ రకానికి చెందినవారు. వీరికి గమ్యం ముఖ్యం కానీ మార్గం కాదు. ఎత్తులపైనా, జిత్తులపైనా ఆధార పడిన రాజకీయం వీరిది.
 
 
 ఎదురుదాడి లేదా మౌనం  
 తప్పు చేసి దొరికిపోయినప్పుడు వీలైతే ఎదురుదాడి చేయడం లేకపోతే మౌనంగా ఉండటమే కానీ పదవీత్యాగం చే యాలన్నంత దూరం ఆలోచించే నాయకులు లేరు. ఒకసారి ఎన్నికలలో గెలుపొందితే వచ్చే అయిదేళ్ళ వరకూ తామే సార్వభౌములమనే భావన బలంగా నాటుకున్న  నాయకులు మితి మీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మంత్రివర్గ సహచరులను సంప్రదించరు. ఉన్నతాధికారుల సలహాలు ఆలకించరు. తమ పోకడను ప్రశ్నించే వారిని శత్రువులుగా పరిగణిస్తారు. తమ వాదంతో ఏకీభవిం చనివారిని ప్రత్యర్థులుగా చూస్తారు. వారి నోరు మూయించడానికి అవస రమైతే పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తారు. తమ అనుభవం, తెలివితేటలు వినియోగించే అవకాశం ఉన్నతాధికారులకూ ఉండదు. ఎంతటి ఉన్నతా ధికారైనా సరే ముఖ్యమంత్రి వెంట ఫైలుపట్టుకొని తిరగవలసిందే. వారి అభిమతం తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవలసిందే. వారి ఎత్తుగడలు. వ్యూహాలు ఎక్కడైనా ఎప్పుడైనా బెడిసి కొడితే అందుకు మూల్యం అనివార్యమైతే అధికారులే చెల్లించాలి. శాసన సభ్యులకు ఆదాయ వనరు చూపించాలి. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’నంటూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.
 
  ఇసుక కావచ్చు. కంకరతో, సిమెంటుతో పని కావచ్చు. డబ్బు మిగిలే పనులు శాసనసభ్యులకూ, ఇతర ప్రజాప్రతినిధులకూ అప్పగించాలి. ఇసుక దొంగతనం చేస్తున్న శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి మందలించలేరు. చౌర్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి దాడికి గురైన మహిళా తహసీల్దారు వనజాక్షి నోరు మూయిం చారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత రెడ్డిని తప్పుపట్టకపోగా అతడిని కథా నాయకుడిగా పార్టీ సహచరులు కీర్తించారు.  తెరాస శాసనసభ్యుడు స్టీఫెన్సన్‌కి డబ్బు ఇస్తున్న దృశ్యాన్ని లోకం అంతా చూసిన తర్వాత కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు మీసం మెలేస్తూ, తొడగొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాలు చేస్తున్న రేవంత రెడ్డి దృశ్యాలు తెలుగుదేశం పార్టీ నాయకులలో ఎవ్వరికీ రవ్వంత ఎబ్బెట్టుగా కనిపించకపోవడం, ఒక్కరు కూడా తప్పు జరిగి పోయిందని ఒప్పుకోకపోవడం రాజకీయ, నైతిక విలువల పతనానికి పరాకాష్ఠ. భిన్నమైన రాజకీయనేత చంద్రబాబునాయుడు ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నమైన వ్యక్తి.
 
 రాజకీయం ఆయనకు ఒక క్రీడ. ఏదో విధంగా పాయింట్లు సంపాదించాలి. లక్ష్యం సాధించాలి.  నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, సూత్రాలూ పట్టుకొని వేళ్ళాడ కూడదు. కార్యసాధన ప్రధానం. పరిస్థితుల ప్రకారం ప్రవర్తన మారాలి. 1978లో ఇందిరాగాంధీ ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకొని రాజగోపాల నాయుడు కాంగ్రెస్(ఐ) టిక్కెట్టు ఇప్పించినప్పుడు కాంగ్రెస్‌వాదిగానే వ్యవహరించారు. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపిం చినా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత చల్లగా ఆయన పంచన చేరారు. మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. జాతీయ రాజకీయాలలో కీలక  పాత్ర పోషించారు. ఇద్దరు వ్యక్తులు ప్రధానులు కావడానికి దోహదం చేశారు. వామపక్షాలతో భుజం కలిపి పనిచేశారు. హరికిషన్‌సింగ్ సూర్జిత్‌నీ, బర్దన్‌నీ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ కలిసేవారు. ఎన్‌డీఏ హయాంలో వాజపేయినీ, అడ్వానీనీ మెప్పించి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులను అదుపులో ఉంచేవారు.
 
 గంగామాత పిలిస్తే వారణాసి వచ్చి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించిన నరేంద్రమోదీ నేపథ్యం వేరు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి తిరుపతి లడ్డూ సంచీలు పట్టుకొని వెడుతున్నారు. ప్రధాని మోదీనీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షానీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌నీ కలుసుకొని తిరుపతి ప్రసాదం ఇస్తున్నారు. అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక మార్గం. భక్తిప్రపత్తులు పెరిగాయి. ఇదివరకు భువనేశ్వరి బహిరంగ సభలకు వచ్చేవారు కాదు. అమరావతికి శంకుస్థాపన చేసినా, గోదావరిలో పుష్కర స్నానం చేసినా పక్కన అర్థాంగి, మరో పక్కన కుమారుడు లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులూ ఉండటం యాదృచ్ఛికం కాదు. సంప్రదాయ హిందూ కుటుంబం పెద్దగా భార్యాపిల్లలతో కలసి పుణ్య కార్యాలు నిర్వహిస్తున్నట్టు కనిపించడం దేశంలో ప్రస్తుతం ఆమోద యోగ్యమైన రాజకీయ వాతావరణానికి చక్కగా సరిపోతుంది. 1999కూ, 2015కూ మధ్య తేడా ఏమిటంటే నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం మనుగడకి తెలుగు దేశం పార్టీ మద్దతు అవసరం. ఇప్పుడు బీజేపీకే స్వయంగా లోక్‌సభలో సాధారణ మెజారిటీ ఉంది. మిత్రపక్షాలు బుద్ధిగా ఉంటేనే అధికారంలో భాగస్వామ్యం. ఈ పరిమితి తెలుసు కనుకనే చంద్రబాబునాయుడు ప్రధాని మోదీ సమక్షంలో ఒదిగి ఉంటున్నారు.
 
 మోదీ ఆధిక్యాన్ని అంగీకరించినప్పటికీ దేశంలోని ముఖ్యమంత్రులలో తానే అగ్రగణ్యుడనని  నిరూపించుకోవాలన్న తపన చంద్రబాబునాయుడికి ఉంది. ముఖ్యంగా లోగడ తన మంత్రివర్గంలో అంత ప్రాధాన్యం లేని శాఖను నిర్వహించిన కేసీఆర్ కంటే తాను తెలివైన, సమర్థుడైన రాజకీయ నాయ కుడని లోకానికి చాటుకోవాలన్న బలమైన కోరిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నిలువనీయడం లేదు. రెండు కళ్ల సిద్ధాంతానికి కాలం చెల్లినప్పటికీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని కళ్లకు కడుతున్నప్పటికీ ఇక్కడ కంటికి కన్నూ, పంటికి పన్నూ మాదిరి రాజకీయ క్రీడ సాగించాలని ప్రయత్నించడం వల్లనే రేవంతరెడ్డి ఉదంతం సంభవించింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలహీనపరచడానికి కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. సందేహం లేదు.  వాటిలో అనేకం అనైతికమైనవీ, చట్టబాహ్యమై నవీ కావచ్చు. కానీ రెండు తెలుగురాష్ట్రాల ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఉన్నంతకాలం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మనుగడ కష్టం. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొనే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు. పరస్పర దూషణలోనే ఇరు పక్షాలకూ ప్రయోజనం ఉన్నప్పుడు సఖ్యతకు అవకాశం లేదు. అయినా సరే రాజకీయాలలో అసాధ్యమంటూ లేదనే చంద్రబాబునాయుడి నమ్మకం. డబ్బు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదని ప్రగాఢ విశ్వాసం.
 
 ఆధిక్యం ప్రదర్శించడానికి ప్రతి సందర్భాన్నీ ఒక ఈవెంట్‌గా చంద్ర బాబునాయుడు పరిగణిస్తారు. హుద్‌హుద్ తుపాను వస్తే అది ఒక ఈవెంట్. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని ఆలోచిస్తారు. ఎన్నికలు వస్తే మరో ఈవెంట్. మండలి ఎన్నిలూ ఈవెంటే. అదే విధంగా గోదావరి పుష్కరాలు. పుష్కరాలు బాగా నిర్వహించినట్టు పేరు తెచ్చుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా చాటు కోవాలి. ఇందుకు రూ. 1,650 కోట్లు ఖర్చు అయినా  పర్వాలేదు. ప్రచారం బాగా జరగాలి. తన పేరు మారుమోగాలి.  ఒక ఈవెంట్ మేనేజర్ ఏదైనా ఈవెంట్‌ని సమర్థంగా నిర్వహించి వాటి తాలూకు దృశ్యాలను చూపించి అంత కంటే పెద్ద ఈవెంట్‌కు ఆర్డరు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు.
 
 అతడి వ్యాపారానికి ప్రచారం అవసరం. ఒక ముఖ్యమంత్రికి ప్రచారం ఎందుకు? 2003లో గోదావరి పుష్కరాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే జవహర్‌రెడ్డి అనే అధికారి నేతృత్వంలో జరిగాయని చెబుతారు. 2004లో కృష్ణా  పుష్కరాలకు ఎవరు సారథి అంటే ప్రభాకరరెడ్డి అనే అధికారి  పేరు చెబుతారు. 2015లో గోదావరి పుష్కరాలకు ఎవరు కర్త, కర్మ, క్రియ? చంద్ర బాబునాయుడే. రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించాలని కోరుకునే చంద్రబాబు నాయుడు స్థాయి 2003 నాటి కంటే పెరిగిందా, తగ్గిందా? ఆయనే ఆలోచిం చుకోవాలి. ప్రతివిషయం తానే పర్యవేక్షిస్తున్నట్టూ, సర్వం తనకే తెలిసినట్టూ, తక్కినవారందరూ నిష్ర్పయోజకులన్నట్టూ వ్యవహరించడం మానుకోవడం ఆయనకే మంచిది.
 - కె.రామచంద్రమూర్తి
 సాక్షి ఎడిటోరియల్  డైరెక్టర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement