
'కల్యాణ' మస్తు అంటే చాలా?
ముఖ్యమంత్రిని కలవడానికి చాలామంది ప్రముఖులు వస్తుంటారు. వారిలో చాలామంది పవన్ కంటే కూడా ప్రముఖులే ఆయా రంగాల్లో. అందరికీ ఇటువంటి స్వాగతం ముఖ్యమంత్రి నుండి లభిస్తుందా?
డేట్‌లైన్ హైదరాబాద్
ముఖ్యమంత్రిని కలవడానికి చాలామంది ప్రముఖులు వస్తుంటారు. వారిలో చాలామంది పవన్ కంటే కూడా ప్రముఖులే ఆయా రంగాల్లో. అందరికీ ఇటువంటి స్వాగతం ముఖ్యమంత్రి నుండి లభిస్తుందా? అందరి మాటెందుకు, అదే రోజున ముఖ్యమంత్రిని కలసిన కమల్ హాసన్‌కి ఇంతే ప్రాధాన్యం ఇచ్చారా? లేదు. కారణం ఏమిటంటే ఆడిన మాట తప్పి తమకు ఏమీ చెయ్యలేదని ఆగ్రహించి దూరం కాబోతున్న సామాజిక వర్గాన్ని బుజ్జగించడానికి కమల్ హాసన్ పనికిరాడు కదా.
గత వారం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలో కలుసుకున్నారు. ఆయన వెంట రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పవన్ హీరోగా నటిస్తున్న గబ్బర్‌సింగ్ 2 సినిమా నిర్మాత శరత్ మరార్ కూడా ఉన్నా పవన్, బాబు మాత్రమే మూడు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. బయట మీడియా వారు టెన్షన్‌గా వెయిటింగ్. మూడు గంటలు పవన్ కల్యాణ్‌తో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఎంతో ముఖ్యమయిన విషయాలే అయి ఉంటాయి. మంచి వార్తే దొరుకుతుంది అని సంబర పడుతూ తిండితిప్పలు మరిచిపోయి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట పడిగాపులు పడ్డారు.
మీడియాకి తమ సమావేశం వివరాలు ఏం చెప్పాలి, ఏ మేరకు చెప్పాలి అనే విషయం చర్చించుకుంటున్నారు లోపల, అందుకే ఇంత ఆలస్యం అవుతున్నది అని ఒక తుంటరి విలేకరి వ్యాఖ్యానిస్తే మీడియా వారికి కోపం కూడా వచ్చి ఆ విలేకరిని ఏం బెహద్బీ అని ఆక్షేపిం చారట కూడా. సమావేశం ముగిసింది. పవన్‌కల్యాణ్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో, ఏం చెప్పాలనుకున్నారో అర్థంకాక మీడియా మిత్రులు తలలు పట్టుకుంటే సదరు తుంటరి విలేకరి వాళ్ల వైపు ఓ నవ్వు విసిరి అక్కడి నుండి నిష్ర్కమించాడట. సినిమా హీరోలు సొంతంగా మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది, మీరే అర్థం చేసుకోవాలి, అయినా అర్థంకాకపోతే సర్ద్దుకుపోవాలి అన్నట్టుగా ఆయనతోబాటు వచ్చిన మంత్రి కామినేని ఓ చిరునవ్వు విసిరి వెళ్లిపోయారట.
పవన్, బాలయ్య
నిజమే మాటల రచయిత రాసిచ్చిన డైలాగులు బట్టీ పట్టి లేదా చూసి చదివి డబ్బింగ్ చెప్పే హీరోలను ధారాళంగా, అనర్గళంగా మాట్లాడమంటే ఎట్లా సాధ్యం చెప్పండి! తాము చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత లేకపోడానికి హీరోలు కారణం ఎట్లా అవుతారు పాపం. సినిమాల్లో లాగే రాజకీయాల్లో కూడా మాటల రచయితలు ఉంటారు. కానీ తేడా ఏమిటంటే రాజకీయాల్లో అన్ని సందర్భాలలో మాటల రచయితలూ రెడీగా ఉండరు కదా ఏం మాట్లా డాలో, ఎలా మాట్లాడాలో చెప్పడానికి.
పైగా సినిమా వార్తలు రాసే వాళ్లు హీరోలను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడగరు కూడా. అందుకే హీరోలు రాజకీ యాలు మాట్లాడినప్పుడు ఈ సమస్యలు తప్పవు మరి. ఆ మధ్య మరో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి విలేకరులు ప్రశ్నిస్తే తడబడి మా బావగారు ఒక నిర్ణయం తీసుకుని ప్రక టిస్తారు అన్నందుకు సోషల్ మీడియా ఎంత హంగామా చేసింది! పాపం ఆయన ముఖ్యమంత్రికి బావమరిది, వియ్యంకుడు అయినంత మాత్రాన అన్నీ తెలిసి ఉండాలనుకుంటే ఎలా? అదే మాట పవన్‌కల్యాణ్‌కు కూడా వర్తిస్త్తుంది కదా. నిజమే దాన్నెవరూ కాదనరు. కానీ సినిమాల్లో వేషాలన్నా వేసుకోవాలి, పూర్తిగా రాజకీయాల్లోకి అయినా రావాలి అన్న విజ్ఞప్తుల మాట కూడా నిజమే కదా. బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడంటే అది కుటుంబ వ్యవహారం. తండ్రి తరువాత తండ్రి అంతటి అన్న స్థానంలో స్వయానా బావగారికి తోడుగా ఉండటానికి ఆయన శాసనసభ్యుడయ్యారు.
పవన్‌కల్యాణ్‌కి ఏం పని రాజకీయాల్లో? ఆయనేం చంద్రబాబు బావ మరిది కాదు, తమ్ముడూ కాదు. పైగా ఆయన కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన మరో ప్రముఖ హీరో చిరంజీవి తమ్ముడు. ఆయనేమీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. శాసనసభ్యుడో, పార్ల మెంట్ సభ్యుడో కాదు. ఆయనే చెప్పినట్టు జనసేన అనే పార్టీ పెట్టినా దాన్ని నడిపించడానికి తగిన ఆర్థిక స్తోమత కలవాడు కాదు. మరి అటువంటప్పుడు అప్పుడప్పుడు ఎలుక కలుగులో నుండి తల బయట పెట్టినట్టు ముఖ్యమం త్రిని కలసి ఏవో నాలుగు మాటలు మీడియాకి చెప్పేసి మళ్లీ కనపడకుండా పోతాడు! ఇలా జరగడం మొదటిసారి కాదు.
2014 ఎన్నికల సమయంలో బయటికొచ్చి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, తప్పులు జరిగితే ప్రశ్నిస్తానని కనిపించకుండాపోయిన పవన్‌కల్యాణ్ మధ్యలో ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి బల వంతంగా భూములు లాక్కున్నప్పుడు రెండోసారి బయటికొచ్చాడు. భూములు కోల్పోయిన రైతుల దగ్గర ఒక మాట, హైదరాబాద్ వచ్చి చంద్ర బాబును కలిశాక ఇంకో మాట. మళ్లీ కలుగులోకి. మళ్లీ గతవారం విజయ వాడలో చంద్రబాబును కలవడానికి మూడోసారి. ఏ సమస్యను గురించి చర్చించారు, సందర్భం ఏమిటి? ఇంత హఠాత్తుగా ప్రత్యేక విమానంలో ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు? ప్రజలకు తెలిసే అవసరం లేదా?
మర్యాద వెనుక ఆంతర్యం
అమరావతి శంకుస్థాపనకు పిలిచారు రాలేకపోయాను, అందుకు కృతజ్ఞ్ఞత తెలపడానికి వచ్చానన్నారు ఒకసారి. బాగుంది, ఆ కృతజ్ఞతలు ఫోన్‌లో కూడా చెప్పొచ్చు. లేదా ఈయన కంటే పెద్ద నటుడు, గొప్ప నటుడు కమల్ హాసన్ కూడా అదే రోజు ముఖ్యమంత్రిని కలసి ఇటువంటి కృతజ్ఞతలే చెప్పి వెళ్లారు. అట్లా చేసి ఉండొచ్చు కదా. విజయవాడ నుండి ఒక ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా హైదరాబాద్ వెళ్లి పవన్‌కల్యాణ్‌తో మాట్లాడి జాగ్రత్తగా వెంట పెట్టుకుని అదే విమానంలో విజయవాడకు తీసుకొచ్చి ముఖ్యమంత్రితో భేటీ చేయించి తిరిగి జాగ్రత్తగా తీసుకువెళ్లి హైదరాబాద్‌లో దింపివచ్చారు.
పవన్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి రాగానే ముఖ్యమంత్రి స్వయంగా బయటి దాకా వచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. తిరిగి వెళ్లేప్పుడు కూడా అంతే ఘనంగా పవర్‌స్టార్‌కు వీడ్కోలు పలికారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని కలవడానికి చాలా మంది ప్రముఖులు వస్తుంటారు. వారిలో చాలా మంది పవన్ కంటే కూడా ప్రముఖులే ఆయా రంగాల్లో. అందరికీ ఇటు వంటి స్వాగతం ముఖ్యమంత్రి నుండి లభిస్తుందా? అందరి మాటెందుకు, అదే రోజున ముఖ్యమంత్రిని కలసిన కమల్ హాసన్‌కి ఇంతే ప్రాధాన్యం ఇచ్చారా? లేదు. కారణం ఏమిటంటే ఆడిన మాట తప్పి తమకు ఏమీ చెయ్య లేదని ఆగ్రహించి దూరం కాబోతున్న సామాజిక వర్గాన్ని బుజ్జగించడానికి కమల్ హాసన్ పనికి రాడు కదా.
అమరావతి శంకుస్థాపనకు తనకు అందిన ఆహ్వానం తీరుకు పవన్ కల్యాణ్ కినుక వహించాడనీ, ఆ విషయం తెలిసిన లోకేశ్‌బాబు పవన్ సామా జిక వర్గం మీద ఆధారపడి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవలేదని పార్టీ నాయకుల సమక్షంలో వ్యాఖ్యానించాడనీ దానితో తెలుగుదేశంలోని ఆ సామాజికవర్గం శాసనసభ్యులు, నాయకులు ఆగ్రహంగా ఉన్నారనీ వార్తలు వచ్చాయి. పవన్‌కల్యాణ్ సామాజికవర్గం కాపులను బీసీలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్న ఎన్నికల వాగ్దానం అటకెక్కింది.
కాపుల సంక్షేమా నికి ఈ ఐదేళ్ల కాలంలో ఐదు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్న మాట కూడా మరిచిపోయారు ఏ మొహం పెట్టుకు తిరగాలని అధికార పార్టీ లోని కాపు నాయకులు మథనపడుతుండగా పుండు మీద కారం జల్లినట్లు మాజీ మంత్రి, బహుపార్టీల మాజీ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రచురించిన ఆత్మకథలో 1989లో జరిగిన వంగవీటి రంగా హత్యకు సూత్రధారుడు చంద్రబాబు అని పేర్కొంటూ ఆనాడు తనకు తెలిసిన విషయాలు రాసి వివాదం సృష్టించాడు. అదెంతవరకు నిజం అనే మాట పక్కన పెడితే కాపు సామాజికవర్గం ఆ రోజుల్లో తిరుగులేని నాయకుడిగా భావించిన రంగా హత్యలో ఆనాటి అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జోగయ్యగారు అదే అధికార పార్టీ టీడీపీ లోనే ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత జోగయ్య చేస్తున్న ఆరోపణలకు ఏ మాత్రం విశ్వసనీయత ఉంటుంది? చట్టపరంగా, న్యాయపరంగా ఏ మేరకు నిలబడు తుంది? అన్న విషయాలు పక్కన పెడితే మానుతున్న గాయాన్ని జోగయ్య గారు మరోసారి రేపినట్టు మాత్రం అయింది.
జోగయ్య కలకలంతోనేనా ?
ఇవన్నీ కలసి ఏపీ సీఎం చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేక విమానంలో పిలిపించి గుమ్మం దాకా వెళ్లి స్వాగతం పలికి, మూడు గంటలు ముచ్చటించి సంతృప్తిపరిచి పంపాల్సివచ్చింది. పవన్ సంతృప్తి చెందాడనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన బయటికొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ముఖ్య మంత్రికి ఇబ్బంది కలిగించే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. పైగాప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే బీజేపీకి కష్టాలు తప్పవన్నారు. పవన్ సంతృప్తి చెందాడు సరే, రాష్ర్ట ముఖ్యమంత్రి మీద గుర్రుగా ఉన్న కాపు సామాజికవర్గం మాటేమిటి? తమ వర్గానికి చెందిన పవన్‌ను పిలిచి ముచ్చటించారు కాబట్టి వారూ సంతృప్తి చెందినట్టేనా? పవన్ మంత్రం ప్రతిసారీ పారుతుందా? హామీలు నెరవేర్చకుండా, సమస్యలు పరి ష్కరించకుండా ఆ వర్గం జనానికి ముఖ్యమంత్రి ఎంతకాలం పవన్ బామ్ రాస్తారో వేచి చూడాల్సిందే.
వ్యాసకర్త: దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com