‘ఉదారవాదం’ జాడ ఎక్కడ? | ' where is Liberalism? shekhar guptha writes | Sakshi
Sakshi News home page

‘ఉదారవాదం’ జాడ ఎక్కడ?

Published Sat, Jan 23 2016 3:37 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

‘ఉదారవాదం’ జాడ ఎక్కడ? - Sakshi

‘ఉదారవాదం’ జాడ ఎక్కడ?

జాతిహితం

 

1991 నాటి సంస్కరణలు, ఉదారవాద విధానాలు లెసైన్స్-కోటా రాజ్ ను నిజంగానే సడలించాయి. నిజమైన ఉదారవాది తన ఆధీనంలోని అధికారాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపార రంగానికి సంబంధించిన మరిన్ని అంశాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడమనే అర్థంలో మోదీ ఉదారవాది కారు. ఆ మేరకు ఆయన చైనా తరహా రాజ్య ప్రధానవాది. తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన అన్న ఆయన నినాదాన్ని ‘‘మరింత ప్రభుత్వం, మెరుగైన ప్రభుత్వం’’ అని తిప్పి చదువుకోవాలి.

 

మంచుతో కప్పడి ఉన్న దావోస్ నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక గురించి నివేదిస్తూ క్రికెట్ గురించి ప్రస్తావించడం హాస్యాస్పదం అనిపిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ సమావేశాల్లో వినవస్తున్న మాటను బట్టి చూస్తే, టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ ఎలాగో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అలాంటిదేనేమోనని ఆశ్చర్యం కలుగుతుంది. రోహిత్ శర్మ ప్రతిభను అంతా గుర్తిస్తారు. అతను సఫలం కావాలని కోరుకుంటారు. అయితే ఆ అద్భుత ప్రతిభ అప్పుడప్పుడూ మెరుస్తుందే తప్ప, మొత్తంగా చూస్తే అతగాడు తన శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రాణించకపోవడం అభిమానుల, సెలెక్టర్ల సహనాన్ని నశింపజేసేట్టుగా ఉంటుంది.

 భారత ఆర్థిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలను నేటికి దశాబ్దికి ముందే అంతా గుర్తించారు. 2003-07 మధ్యలో అది తన పై పెంకును పగల గొట్టుకుని బయటకు వస్తున్నట్టనిపించింది. చైనా పతనోన్ముఖం అయ్యే సమయానికి బయటపడి, దాని స్థానాన్ని ఆక్రమించి, శూన్యాన్ని పూరిస్తుందని ప్రపంచ నేతలు, దేశాలు, కార్పొరేషన్లు ఆశించాయి. చైనా అ దశకు చేరుకుంది కానీ, భారత్ అక్కడికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటి లాగే, మనది గొప్ప శక్తిసామర్థ్యాలున్న దేశమే. కాకపోతే అందుకు తగ్గ సంఘటిత కృషి చేసేట్టు అయితేనే అది అంతటి శక్తివంతమైనది కాగలుగుతుంది. ఆ ‘‘అయితేనే’’ అనేదే ప్రబలమైనది. 

 

నిరుపయోగంగా ఉన్న అనుకూలతలు

ఆ ‘‘అయితేనే’’అనే దాన్ని ఎంత కచ్చితంగా నిర్వచించగలం? అమెరికన్ అర్థశాస్త్రవేత్త నూరియెల్ రూబినీ అంటే మహాప్రళయ ప్రవక్తగా ప్రపంచ వ్యాప్త గుర్తింపూ, భయమూ కూడా ఉన్నాయి. దావోస్ సమావేశంలో అరుణ్ జైట్లీ కేంద్రంగా సాగిన భారత్‌పై చర్చలో రూబినీ పై ప్రశ్నకు సంక్షిప్తంగా సమాధానం చెప్పారు. భారత్ ఇప్పుడు ‘స్వీట్ స్పాట్’(కీలక స్థానం)లో ఉన్న దనీ, పెట్టుబడి లోటును భర్తీ చేసుకునే మార్గాలపై అది దృష్టిని కేంద్రీకరిం చడం మాత్రమే చేయాల్సి ఉందనీ ఆయన అన్నారు. భారత్‌కు ఇప్పుడు అన్ని రకాలైన పెట్టుబడులూ కావాలి. రూబినీ మాటల్లోనే చెప్పాలంటే... భౌతిక మైన మౌలిక సదుపాయాలు, నిపుణ శ్రమశక్తి, మేధో సంపదలకు సంబం ధించిన పెట్టుబడులు, ప్రభుత్వ నియంత్రిత పెట్టుబడులు అన్నీ అవసరమే,

 

భారత్‌ను నిజంగానే కీలక స్థానంలో ఉంచగలిగిన అంశాలన్నిటి సాను కూలతను ఉపయోగించుకోవడానికి ఇవన్నీ చేయమనడం పెద్ద కోరికే. కానీ ప్రస్తుత ప్రపంచవ్యాప్త హఠాత్ భయాందోళనలకు కారణం సరుకుల (ప్రత్యే కించి చమురు) ధరలు పడిపోవడమే. మనది గణనీయమైన స్థాయిలో నికరంగా సరుకులను దిగుమతి చేసుకునే పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి.   కాబట్టి ఈ పరిణామం సమస్యాత్మకంగా ఉన్న మన దేశ ద్రవ్య, వాణిజ్య లోటుకు మేలు చేస్తుంది. మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉడాయి స్తున్న మాట నిజమే. కానీ, అది పరివర్తనాత్మకమైనదే. కాబట్టి అవి పలా యనం చిత్తగిస్తున్న ప్రతి చోటకు భారత్  వేగంగా కదలాల్సి ఉంటుంది. దాదాపుగా ప్రపంచానికే ఒక మినహాయింపులాంటి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఇప్పటికీ మనం ఆ పని చేయగలం.

 

అయితే, దావోస్‌లో ఎవరూ నాలుగు మంచి మాటలకు మించి, భారత్ నిజంగానే ఆ అద్భుత స్థానానికి చేరుకుంటుందని ఎవరూ ఒప్పంచలేక పోయారు. సుప్రసిద్ధ బహుళజాతి సంస్థల నేతల ప్రకటనలకు, అందులోనూ అవి జాతీయ నేతల సమక్షంలో చేసినవైనప్పుడు  మనం ఉప్పొంగిపోజాలం. ఆ మాటలనే పట్టుకుని మన దేశంలో అమలుచేసేయలేం. ఉదాహరణకు, 2016 భారత దేశపు సంవత్సరమనీ, భారత్ తన బంధనాలను తెంచుకుని బయటపడతుందని సిస్కో సంస్థకు చెందిన జాన్ చాంబర్స్ అన్నారు. సిస్కోకు మన దేశంలో గణనీయమైన ఉనికే ఉంది. పైగా చాంబర్స్ ఇప్పుడు అమెరికా-భారత్ వ్యాపార మండలి అధ్యక్ష పదవిని చేపడుతున్నారు. ఆయన భారత్ గురించి మంచి మాటలు చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే రూబినీకి ఉన్న అర్హతలే ముఖ్యమైనవి.

 

ఆశావాదానికి సవాలు

2014-15లో భారత్ పట్ల ఉన్న నైరాశ్యం అర్థం చేసుకోగలిగిందే. అప్పట్లో యూపీఏ తన రాజకీయ పెట్టుబడిని కోల్పోవడమేగాక, మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో అమలుపరచిన సంస్కరణల నుంచి వైదొలగుతున్నట్లు కూడా అనిపించింది. దీంతో వారు రక్షణాత్మక వైఖరి వహించారు. ఇక భారీ కుంభ కోణాల గురించిన చర్చ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్పొరేట్ వ్యతిరేక సెంటిమెంట్‌ను మరింతగా ఎగదోసింది. అంతేకాదు, భారత్ భారీ ప్రభుత్వ లోటును ఇంకా ఎదుర్కొంటున్నదనే సమంజసమైన అభిప్రాయాన్ని  కలుగ జేసింది. భారత్‌లోని నెమ్మదైన, దృఢమైన, న్యాయ వ్యవస్థ పట్ల గతంలో ఉన్న గౌరవం సైతం వొడాఫోన్ రెట్రోస్పెక్టివ్ పన్ను సమస్యతో (గత నిబంధ నలను ఇప్పుడు సవరించి పన్ను చెల్లించమనడం) దెబ్బతింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు రెండూ అదుపు తప్పాయి. నరేంద్ర మోదీ ఎన్‌డీ ఏ పూర్తి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చాక ఇదంతా మారుతుందని ఆశించారు.

 ఆ ఆశావాదం ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది. ఇక కొత్త కుంభ కోణాలేవీ లేవనే వాస్తవానికి విస్తృతంగానే గుర్తింపు లభించింది. మోదీని నిజమైన శక్తివంతమైన జనాకర్షణగల కొత్త నేతగా చూస్తున్నారు. ఆయన ప్రపంచమంతా పర్యటించి దేశాధినేతలతోనూ, కార్పొరేట్ అధిపతులతోనూ వ్యక్తిగత అనుబంధాలను నెలకొల్పుకుంటున్నారు.

 

భారత్‌కు మరింత శక్తివం తమైన, చలనశీలమైన దేశంగా గుర్తింపు లభిస్తోంది. ‘స్వచ్ఛభారత్’ నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్ అప్ ఇండియా’ వంటి ఆయన చేపట్టిన కార్యక్రమాలతో పాటూ, మత ప్రబోధకునిలా ఆయన వాటిని ప్రచారం చేయడాన్ని  కూడా ప్రశంసిస్తున్నారు. కానీ ఫలితాలు లేదా మార్పు ఎక్కడ? మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గాలు... 1991లో మన్మోహన్‌సింగ్ చేపట్టిన సంస్కరణలతో పోటీపడేలా నరేంద్రమోదీ మరో దఫా సంస్కరణలను చేపడతారని ఆశించింది. ఆయన ప్రభుత్వం నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం కంటే చాలా బలమైనది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ నిజమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడమనే ‘‘వరం’’ సైతం ఆయనకు లభించింది.

 

ప్రజాస్వామ్యంలో సత్వర సంస్కరణలకు, సరళీకరణకు సమంజ సత్వం లభించడానికి అవి రెండూ ముందు షరతులు. ఇప్పుడిక, నరేంద్ర మోదీ గురించిన కొత్త అంచనా ముందుకు వస్తోంది. సరళంగా చెప్పాలంటే, మోదీ బలమైన, చిత్తశుద్ధిగల సంస్కర్తేగానీ కచ్చితమైన సరళీకరణవాది కారనే అభిప్రాయం కలగుతోంది. ఇది ఎలా పనిచేస్తుంది? 

 

ఉదారవాది కారు... సంస్కరణవాదే

మోదీ చాలా ప్రభుత్వ క్రమాలను సంస్కరించారు. స్పెక్ట్రమ్, ఖనిజాల వంటి వనరుల వేలం సాఫీయైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో పడింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఈ-టెండర్లను పిలవడం మరో ముఖ్య సంస్కరణ. అలాగే డీజిల్‌పై సబ్సిడీని పూర్తిగా తొలగించి, ఎల్‌పీజీపై సబ్సిడీని క్రమంగా తగ్గించుకుంటూ పోవడం, నగదు బదిలీలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు చాలానే చేపట్టారు. ఇవన్నీ ముఖ్యమైనవే. కానీ అవి పూర్తిగా సంస్కరణల కోవకు చెందుతాయే తప్ప ఉదారవాద విధానాల అమలు కాదు. తేడా ఏమిటి? 1991 నాటి సంస్కరణల పరంపర, ఉదారవాద విధానాలు దేశంలోని  లెసైన్స్-కోటా రాజ్ ను నిజంగానే బాగా సడలించి భారత వాణిజ్యాన్ని పాత ఫ్యూడల్ మాఫియా  ‘‘డెరైక్టరేట్ల’’ నుంచి విముక్తి చేసింది. వాణిజ్య మంత్రిగా చిదంబరం తన మంత్రిత్వ శాఖకు అధికారాలను సమకూర్చిన డెరైక్టరేట్లనే రద్దుచేసేశారని ఒక సందర్భంగా మన్మోహన్ అన్నారు. నిజమైన ఉదారవాది ప్రభుత్వంలో తన అధీనంలో ఉన్న అధికారాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

 

అది మోదీ పద్ధతి కాదని నేడు విశ్వసిస్తున్నారు. ఆయన ప్రభుత్వ క్రమాలను, పారిశుద్ధ్యాన్ని, నియంత్రణ వ్యవస్థలను తెలివిగా సంస్క రించగలిగిన శక్తిసామర్థ్యాలు కలిగిన నేత. అంతేగానీ వ్యాపార రంగానికి సంబంధించిన మరిన్ని అంశాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడమనే అర్థంలో ఆయన ఉదారవాది కారు. ఆ మేరకు ఆయన చైనా తరహా రాజ్య ప్రధానవాది (స్టేటిస్ట్). తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన అన్న ఆయన నినాదాన్ని ‘‘మరింత ప్రభుత్వం, మెరుగైన ప్రభుత్వం’’ అని తిప్పి చదువుకోవాలి.

 

ఈ వాదనకు సమర్థనగా చాలా ఆధారాలనే చూపాం. స్టార్ట్-అప్ ఆర్థిక రంగంలో దాని కోసం  నిధిని ఏర్పాటు చేయడం అందుకు తాజా ఆధారంగా చూపవచ్చు. లేదంటే వాజపేయీ ఎన్‌డీఏను అనుసరించి ప్రైవేటీకరణకు తిరస్కరించడాన్ని చెప్పుకోవచ్చు. అయితే, ప్రపంచ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆయన ప్రభుత్వ వైఖరి పట్ల వ్యక్తమౌతున్న అసహనం మరింత ముఖ్యమైనది. ఈ విషయంలో యూపీఏ కన్నా మోదీ ప్రభుత్వం మరింత కఠినమైన ప్రొటెక్షనిస్టు వైఖరిని (రక్షిత విధానాలను) అవలంబిస్తోందని భావిస్తున్నారు. టీపీపీ, అపాక్ వంటి నూతన ప్రపంచ, ప్రాంతీయ కూట ములు అందిస్తున్న అవకాశాలను ఈ వైఖరి భారత్‌కు అందకుండా చేస్తోంది. ఆ రెండు అవకాశాలు గత ఏడాది ఒబామా పర్యటన సందర్భంగా అందివచ్చాయి. కానీ మోదీ ప్రభుత్వ నూతన విధానం... జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ చింతనకంటే అతివాదంగానూ, ఆర్‌ఎస్‌ఎస్ చింతన కంటే మితవాదంగానూ అనిపిస్తోంది. కాబట్టి ఆ దిశగా కదలికే కనబడలేదు. భారత్ పట్ల ప్రపంచం చూపుతున్న ఉత్సాహంపై అది నీళ్లు చల్లుతోంది.

 

 -శేఖర్ గుప్తా

 twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement