నరేంద్ర మోదీ- రాహుల్ గాంధీ
జాతిహితం
భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో మోదీకి ఓటు వేశారని మనకు తెలుసు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ వీరు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వం దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ లక్ష్యమైతే ప్రజలు తమకు అందుబాటులోని అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. రాహుల్ దూకుడు శైలి మోదీ ప్రతిష్టకు నష్టం కలిగించి, ప్రజలు అంతిమంగా ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా?
చాన్నాళ్ల క్రితం అప్పటి ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, తమకు ఓటు వేయని వారితో సహా ప్రజలందరి ప్రయోజనాలను కూడా సంరక్షించేవారు. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసు అంటే ప్రజల విశ్వాసం. కానీ ఇప్పుడు మాత్రం పాలకులు తమను బలపర్చే ప్రజా పునాది గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వారి మద్దతుదారులు తప్ప తక్కినవారు ఇప్పుడు లెక్కలోకి రారు. ఒక ఉదాహరణ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్షలాదిమంది అమెరికన్లు మతిలేని మూర్ఖుడు, జాత్యహం కారి వగైరా వగైరా పదాలతో నిందిస్తున్నారు. కానీ తనను విమర్శిస్తున్నవారి పట్ల ట్రంప్ ఎంత తూష్ణీభావంతో చూస్తే అంత కంటే ఎక్కువగా మద్దతుదారులు ట్రంప్‌ను ఆరాధిస్తుంటారు. మిగతావారి విషయం ఏమిటి? వారు రంగం నుంచి తప్పుకోవలసిందే. ఇదేం సూచిస్తుంది? నీవు నాకు ఓటు వేయకపోతే, నానుంచి మీరు ఏమీ ఆశించవద్దు.
అలాగే అధికారంలోకి రావడానికి హిందూ ఓటుపై స్వారీ చేస్తున్నమోదీ బీజేపీని చూడండి. 20 శాతం ముస్లిం జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అటు లోక్‌సభలో, ఇటు అసెంబ్లీలో బీజేపీ ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండానే రెండింటిలోనూ ఘనవిజయం సాధిం చింది. సవర్ణులు అంటే ఎగువ, మధ్య స్థాయి కులాల ఓట్లను కొల్లగొట్టింది కాబట్టే బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ ముస్లింలను, చాలావరకు దళితులను పక్కనబెట్టేసింది. అందుకే అగ్రకుల హిందువులను వైదొలుగుతున్న మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లతో సత్కరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ తనకున్న ప్రజాపునాదిని ఎలా నిర్వచిస్తారు? ప్రజాపునాది అంటే ఏమిటో ఆయనకు తెలుసా? మోదీ వ్యతిరేకవాదం ఒక్కటి మాత్రమే మీ ప్రచారానికి ఇప్పుడు సరిపోదన్నది స్పష్టమే.
భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో ఓటు వేశారని మనకు తెలుసు. పైగా మోదీని ఇప్పుడు కూడా మీరు ఇష్టపడకపోవచ్చు లేక తనతో విభేదించవచ్చు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ ఇలాంటివారు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ ఉద్దేశం అయితే మీరు అందుబాటులో ఉన్న అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. బెంగాల్‌లో మమత కావచ్చు, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కావచ్చు. బిహార్‌లో లాలూ కావచ్చు. కేరళలో వామపక్షం కావచ్చు. ఇక తెలంగాణ, ఒడిశా, ఢిల్లీల్లో వరుసగా కేసీఆర్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు.
రాహుల్ ఒంటెత్తు మనస్తత్వం మాత్రమే మోదీ ప్రతిష్టకు అంత నష్టం కలిగించి ప్రజలు బీజేపీ ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా? ఈరోజు అలాంటి అవకాశమే కనబ డటం లేదు. ఎందుకంటే ఒక బలీయమైన ప్రతిపాదన లేదా అభిప్రాయం (మోదీది అధమపాలన) దానికదే మరొక ప్రతిపాదనవైపు మొగ్గు (రాహుల్ ఉత్తముడు) చూపకపోవచ్చు.1989 వరకు కాంగ్రెస్ ప్రజాపునాది దిగువ కులాలు, మైనారిటీలు, గిరిజనులు, బ్రాహ్మణులు, కొన్ని మధ్య కులాలు, పేదల్లో చాలామంది మద్దతును గెలుచుకోగలిగినంత పెద్దదిగా ఉండేది. అప్పట్లో బీజేపీ ప్రధానంగా పట్టణ వ్యాపారులు, హిందూ మధ్యతరగతులకు మాత్రమే పరిమితమై ఉండేది.
కాబట్టే ఇందిరాగాంధీ జనసంఘ్, బీజేపీలను బనియా పార్టీగానే పిలిచేవారు తప్పితే వారిని హిందూ పార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. అలాగే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నంతవరకు, బీజేపీ ఎన్నడూ ఆమె పార్టీని ముస్లిం పార్టీగా పిలవగలిగేది కాదు. కానీ పొటా (ఉగ్రవాద నిరోధక చట్టం)ను ఎప్పుడయితే రద్దు చేశారో అప్పుడే మోదీకి కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీ అని పిలిచే దమ్ము వచ్చేసింది. 1989లో రాజీవ్ గాంధీ తన ప్రజాపునాదిని కోల్పోవడం ప్రారంభం కాగానే, కాంగ్రెస్ పార్టీ మిగిలిన తన మద్దతుదారులతో, బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల మద్దతుతో మాత్రమే మనగలగ సాగింది. 2014 తర్వాత పార్టీని తిరిగి వైభవంలోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తోంది.
అయితే ఇప్పటినుంచి వందరోజుల లోపు అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్పితే మరే రాష్ట్రంలోనూ విశ్వాస పాత్రులైన ఓటర్లతో కూడిన ప్రజారాశులను కలిగిలేదన్నది స్పష్టం. అది ఇప్పటికే బీజేపీతో పాటు తూర్పు మధ్య ప్రాంత గిరిజనులను పంచుకుంటోంది. దళితులు అన్ని పార్టీల్లో ఉంటున్నారు. ముస్లింలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉంటున్నాయి. పైగా పట్టణ మధ్యతరగతిలో ప్రధానంగా 25 ఏళ్ల లోపు వయస్కులలో చాలామంది ఇప్పటికీ మోదీ పట్ల అనుకూలతతోనే ఉంటున్నారు. మోదీ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారిని మీ శిబిరంలోకి లాక్కోవడం ద్వారా మాత్రమే మీరు ఎన్నికల్లో గెలుపు సాధించిపెట్టే కొత్త ఓటర్ పునాదిని మీరు నిర్మించలేరు.
మీరు మోదీకి నష్టం కలిగించవచ్చు కానీ దాని ప్రయోజనం మాత్రం అనేకమంది మిత్రులు, ప్రత్యర్థుల మధ్య విభజితం కావచ్చు. ఈ కోణంలో, రాహుల్ 2010–14 నాటి అరవింద్ కేజ్రీవాల్ స్టైల్‌ని అనుసరిస్తున్నారు. అన్నాహజారేని, ఆరెస్సెస్ గొంతుబలాన్ని ఉపయోగించి, యూపీఏని ప్రత్యేకించి కాంగ్రెస్ విశ్వసనీయతను విధ్వంసం చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషిం చారు. దీంతో కాంగ్రెస్ వారు సైతం పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలనుంచి సమర్థించుకోలేని మానసిక స్థితిలో కూరుకుపోయారు. యూపీఏని పతనం చేసిన ఘనతను బీజేపీకి, వివేకానంద ఫౌండేషన్‌కి ఆపాదించడం ప్యాషన్ కావచ్చు కానీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రధానాస్త్రంగా వ్యవహరించింది మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. తాను యువకుడు, విశ్వసనీయత కలిగినవాడు, అవినీతి అంటనివాడు కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అనే ఇమేజిని తానే పెంచిపోషించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లించడానికి తాను ప్రయత్నించిన ఓటర్లు కేజ్రీవాల్‌వైపునకు రాలేదు. అలాంటి ప్రజాపునాదిని తాను నిర్మించుకోలేదు. అతడి ప్రయోజనాలు ఢిల్లీకే పరిమితమయ్యాయి. కాకపోతే, నరేంద్రమోదీవైపు ఓటర్లు మళ్లిపోయేలా చేయడంలో కేజ్రీవాల్ విజయవంతమయ్యారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించకుండా కేవలం వ్యతిరేకతపై మాత్రమే ఆధారపడిన రాజకీయాల్లోని ప్రమాదం ఇదే. ఇది జరగకూడదంటే మీరు మీ పునాదిని నిర్వచించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే రాహుల్ పెనుప్రమాదంలోకి కొట్టుకెళ్లిపోతున్నారు. ఒక తిరుగుబాటుదారుగా సమర్థంగా వ్యవహరించడం సరైందే కావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో మీరు చేయగలిగేది ఏమిటంటే అధికారాన్ని గెలుచుకోవడం కాకుండా ప్రతిష్టను దెబ్బతీయగలగడం, అధికారాన్ని మరొకరికి అప్పగించడం మాత్రమే.
గెరిల్లా యుద్ధతంత్రం ప్రకారం రాహుల్ తన ఎత్తుగడలను బలంగానే అమలు చేస్తున్నారు కానీ దాని వ్యూహాత్మక ఫలితం ఏమిటన్నదే ముఖ్యం. ముస్లింల అనుకూల పార్టీగా తనపై ఉన్న ముద్రను తొలగించుకోవడానికి రాహుల్ ఆలయాలను సందర్శిస్తూ టీవీల్లో ప్రసారమయ్యేలా జాగ్రత్తపడుతున్నారు, తన జంధ్యాన్ని ప్రదర్శిస్తూ తన బ్రాహ్మణ గోత్రాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. కానీ, ఆయన పార్టీ... ట్రిపుల్ తలాక్, శబరిమల, అగ్రవర్ణాల రిజర్వేషన్ వంటి కీలకమైన లౌకిక–ఉదారవాద సమస్యల పట్ల మౌనం వహిస్తోంది. భారతదేశాన్ని యూదుజాత్యహంకార దేశంగా సమర్థవంతంగా క్రోడీకరించబోతున్న పౌరసత్వ చట్ట సవరణపై చర్చ జరుగుతుంటే లోక్‌సభనుంచి వాకౌట్ చేయడంలో కూడా పార్టీ సంప్రదాయాల లేమి కొట్టొచ్చినట్లు కనబడింది.
ఇజ్రాయెల్ తన్నుతాను భావజాలపరంగానే జాత్యహంకార దేశంగా మల్చుకుంది. కానీ భారత్ దానికి భిన్నంగా పూర్తి వ్యతి రేకదిశలో.. భావజాలేతర, లౌకిక రాజ్యాంగంగా తన్ను తాను మల్చుకుంది. ఈరోజు ఆ పునాదే సవాలుకు గురవుతుండగా కాంగ్రెస్ వాకౌట్ చేయటంకంటే మరేమంత ఘనచర్యకు పూనుకోలేకపోవడమే విషాదం. ఇలాంటి నిస్సహాయ స్థితిని అస్సామ్‌లో హిందువులు, ముస్లింలు ఇదదరూ కలిసి చూస్తుండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితే బీజీపీకి కలిసొస్తుంది. ఆ పార్టీ ప్రజాపునాది అనేది సరిగ్గా దీన్నే కోరుకుంటోంది. అక్రమ వలసదార్లు చెదపురుగులు అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే బీజేపీ ప్రజాపునాది అభినందిస్తోంది. ఈ చెదపురుగుల్లో ముస్లింలు మాత్రమే ఉంటున్నారని పేర్కొంటూ రాజ్యాంగాన్ని ఎవరైనా సవరించడానికి పూనుకుంటే బీజేపీ ప్రజాపునాది కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటుంది.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన పునాది ఏంటో కూడా తెలుసుకోవడం లేదు. లేదా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమీపిస్తుండగా అంటే వచ్చే నెలలో తన పునాదిని నిర్మిం చుకోవడం ఎలా అని కూడా దానికి తెలీడం లేదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వాన్ని ఎంత ఆగ్రహంతో ప్రదర్శించినప్పటికీ, అది దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మీరు చేయవలసింది ఏమిటంటే మోదీని వచ్చే ఎన్నికల్లో 200 కంటే తక్కువ సీట్లతో వెనుకబడేలా చేయడమే. దీనికి ప్రతిగా మీరు ప్రారంభంలోనే 100 సీట్లను అదనంగా పొందే స్థితిని ఇది కలిగిస్తుందా? అలా జరగాలంటే ముందుగా రాష్ట్రం తర్వాత రాష్ట్ర స్థాయిలో భారత చిత్రపటాన్ని నిశితంగా పరిశీలించాలి. బీజేపీ పట్ల ప్రజల్లో ఆశలు ఎంత ఎక్కువస్థాయిలో ఆవిరయినప్పటికీ మే నెలనాటికి కాంగ్రెస్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో వారి ప్రత్యామ్నాయ ఎంపిక కావడం కష్టమే. రాహుల్ గ్రహించాల్సిన అత్యంత కఠిన వాస్తవం ఇదే మరి.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment