రాయలసీమా,రాయలసీమా! నువ్వెక్కడ? | where is rayalaseema.. where are you? | Sakshi
Sakshi News home page

రాయలసీమా,రాయలసీమా! నువ్వెక్కడ?

Published Mon, Nov 23 2015 10:09 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

రాయలసీమా,రాయలసీమా! నువ్వెక్కడ? - Sakshi

రాయలసీమా,రాయలసీమా! నువ్వెక్కడ?

సంతలో తప్పిపోయిన పిల్లవాడిలా రాయలసీమ ఇప్పుడు దిక్కులు చూస్తోంది. అమరావతీ నగర ఆకాశ సౌధాలతో తమకు ఒరిగేదేమిటో రాయలసీమకు అర్థం కావడం లేదు. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలు కృష్ణా జిల్లాను తడిపితే తామెందుకు కలశ పూజలు చేయాలన్నది రాయలసీమ ప్రశ్న. 'ఎవ్రీ వన్ లవ్స్ గుడ్ డ్రాట్' అంటూ పాలకులు తమ స్వార్థం కోసం కరువును ఎలా అమ్ముకుంటారో ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ ఎప్పుడో కళ్లకు కట్టినట్లు విశ్లేషించారు. కూడళ్లలో పాల కోసం గుక్క పట్టి ఏడ్చే చంటి పిల్లలను చంకన వేసుకుని అడుక్కు తినే వారు కనిపిస్తుంటారు. ఆ పసిపిల్లలను ఎత్తుకుని అడుక్కుంటున్నవారు వారికి నిజమైన తల్లిదండ్రులేనా అంటే అదో పెత్త హృదయవిదారకమైన భిక్షా వ్యాపార కోణం. మానవత్వాన్ని తట్టి లేపడానికి తగిన వాతావరణం సృష్టించడం చిన్న విషయం కాదు. ఏడ్చే పిల్లలతో అడుక్కుతినే వారికి కొంత సమ్మతి దొరికినట్లు, రాయలసీమ పేరు చెప్పి కృష్ణకు గోదావరి మళ్లించడంతో ఏలినవారు సీమ ఎండమావిని సజీవంగా ఉంచగలిగారు.

అద్భుతాలను చెప్పి చేసే చంద్రబాబు ఏదో ఒకటి చేయకపోతారా అని రాయలసీమలో పాలకపక్షం పంటి బిగువున బాధను భరిస్తోంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. ప్రజలు మాత్రం తోక తెగిన గాలిపటంలా ఉన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ముందురోజు వరకు రాయలసీమ అంగళ్లలో రత్నాలు రాశులు పోసి అమ్మారా ? లేక ఇప్పుడు రాబోయే కలల రాజధాని భూభాగంలోలాగా ఏటా రెండు పంటలే.. వీలైతే మూడు పంటలే పండించారా? అంటే-ఏమీ లేదు. స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్లకు 1957లో విద్వాన్ విశ్వం 'పెన్నేటి పాట' రాశాడు. '.. ఇదే పెన్న.. ఇదే పెన్న.. నిదానించు నడు.. వట్టి ఎడారి తమ్ముడు' అంటూ గుండెలు బాదుకున్నాడు. దీనికి ముందు మాట రాసిన ప్రఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఇంకాస్త వెనక్కు వెళ్లి చెరువులు, పంటలు ఎలా పాడైపోతూ వచ్చాయో, నీటి చుక్క ఎందుకు ఆవిరయ్యిందో వివరించారు. అంటే విజయనగర రాజులు బావులు, చెరువులు తవ్వించారు. మనం పాడు చేశాం. నీళ్లొక్కటి ఉంటే ఈ నేల ఎంత పచ్చగా  ఉండేదో అని 'ఎడారి కోయిల' కథలో మధురాంతకం రాజారాం నిట్టూర్పు విడిచాడు. నీళ్లు లేక, పనులు లేక ఫ్యాక్షన్ లీడర్ల గొడవల మధ్య సామాన్యులు ఎలా 'బలి' అవుతారోనని సింగమనేని నారాయణ బాధపడ్డాడు. కాస్త సామాజిక స్పృహ ఉన్న ప్రతి కవి, రచయిత, జర్నలిస్టు, కళాకారుడు, మేధావి స్పందిస్తూనే ఉన్నారు. దశాబ్దాలు దొర్లిపోతూనే ఉన్నాయి. ఇప్పటి తరానికి తెలిసినా, తెలియకపోయినా మిగులు జలాలు, నికర జలాలు అంటూ డెభ్భయ్యో పడిలో కూడా ఎంవీ రమణారెడ్డి రాయలసీమ దీనావస్థ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. 'కదలిక' ఇమామ్ రాస్తూనే ఉన్నారు. భూమన్ సంచి భుజాన వేసుకుని తిరుగుతూనే ఉన్నారు. సీమ సాహితీ ప్రత్యేక సంచికలు కష్టాలు, కన్నీళ్లతో బరువెక్కుతూనే ఉన్నాయి.

గత శతాబ్ది తొలి అడుగులు 1920,1930ల నాటి నుంచే ఆంధ్ర మహాసభల్లో సీమ బాధలు బాధలుగానే మిగిలిపోయాయి. మద్రాసు అసెంబ్లీ సాక్షిగా జరిగిన కుట్రలు, కుతంత్రాలు సీమ గాయాలుగా రికార్డు అయి ఉన్నాయి. పాతతరం వారు 'శ్రీ బాగ్' పేరిట పెద్దమనుషుల ఒప్పందాన్ని అప్పుడప్పుడు చప్పరిస్తూనే ఉంటారు. ఆ శ్రీ భాగ్యం రాయలసీమకు ఎందుకు రాలేదో ? రాకపోవడానికి కారణం ఎవరో మాత్రం పెద్దగా చర్చ జరగదు. ఒకప్పుడు మద్రాసులో అన్యాయం జరిగిందంటే ఏదో తమిళ పెత్తనం అనుకోవచ్చు. ఆ తరువాత సీమకు జరిగిన అన్యాయం రాస్తే రామాయణం-వింటే భారతం. పోతిరెడ్డిపాడు పాదయాత్రలు, ఎన్టీఆర్ స్మరించిన గాలేరు-నగరి, హంద్రినీవా సుజల స్రవంతి, తుంగభద్ర హై లెవల్ కెనాల్, కేసీ కెనాల్ ఇలా బయటవారు వింటే సీమ ఎడారిలో అడుగడుగుని ఒయాసిస్సులే ఉన్నాయేమో అనిపిస్తుంది.


చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా మొన్నటికిమొన్న రాష్ట్ర విభజనలో అనంతపురం, కర్నూలు జిల్లా వాసులు తెలంగాణలో కలిస్తే బాగుండనుకున్నారు. అందుకు తగినట్లుగానే మీడియా బ్రహ్మలు గీతలతో నిలువునా చీల్చి రాతలేవో రాశారు. హైదరాబాద్ రాజధాని, కృష్ణా జలాల సౌలభ్యం ఆ ఆశకు ఒక కారణం. అంతకు బాగా ముందు బళ్లారి ఆంధ్రప్రదేశ్ లో అయినా కలవాలి, లేదంటే అనంతపురం జిల్లా కర్ణాటకలో అయినా ఉండాలి అని ఇలాగే కలగన్నారు. అప్పుడూ తుంగభద్ర జలాలే కారణం. రాయలసీమలో నాయకత్వం లేదా అంటే దేశం పట్టలేనంత పెద్దవారు.. పుట్టారు.. పెరిగారు.. ఏలారు.. పోయారు. రాయలసీమ మాత్రం తన భిక్షాపాత్రలో ఎవరు చిల్లిగవ్వలు వేస్తారా అని అలాగే ఎదురుచూస్తూనే ఉంది.

తాజా విభజన తరువాత సీమ బాధ బాధ కాదు. భాష, యాసతో అమరావతిలో తిన్నగా ఎదరకెళ్లలేక, విజయవాడ ఉక్కలో కక్కలేక మింగలేక సీమ సరిహద్దుల నుండి అమరాధిపతిని చేరాలంటే 16గంటల బస్సు ప్రయాణమైనా గమ్యం ఇంకా మిగిలే ఉంటే దాన్ని ప్రయాణమంటారా? సప్తవర్ణ శోభితంగా.. హైదరాబాద్ అసూయ పడేలా తయారవుతుందంటున్న రాజధానితో రాయలసీమకు ఎమోషనల్ అటాచ్మెంట్ రావట్లేదని గ్రహించే మొన్నటికిమొన్న మట్టి, నీరు, ఇటుకలు అంటూ రాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల కాన్సెప్టుకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆన్లైన్‌లో ఇటుకలమ్మినా, ఆఫ్‌లైన్ లో ఇసుక అమ్మినా, ప్లై యాష్ కు టెండర్ వేసినా ప్రతి కదలికకు ఒక ప్రయోజనం ఉంటుంది. భూమి గుండ్రంగా ఉందన్న ఖగోళ శాత్రవేత్తలను మతపెద్దలు మొదట బతకనివ్వలేదు. ఇప్పుడు అమరావతిని కూడా ఒక ప్రజా ప్రభుత్వ రాజధానిగా కాకుండా ప్రశ్నించడానికి వీలులేని ఒక భావోద్వేగ గోపురంగా మలచాలన్న ప్రయత్నం అణువణువునా కనిపిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ (సమ్మతిని కృత్రిమంగా తయారు చేయడం)లో ఇప్పటికే అనుకున్నది సాధించామని ముఖ్యమంత్రి మనవడికి ప్రధానమంత్రి పెట్టిన కళ్లజోడు సాక్షిగా సంబరపడుతున్నారు.

భూమి పూజ ఒక పండుగ. శంకుస్థాపన ఒక సంబరం. ఆహ్వానపత్రిక ఒక అద్భుతం. ఈవెంట్ ఒక జ్ఞాపకం. నాడు త్రేతాయుగంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి ముందు వానరులు భూమండలమంతా తిరిగి సకల నదుల, సముద్ర జలాలను తెచ్చారు. ఆ తరువాత ద్వాపర యుగంలో ఇలాంటి ఈవెంటుకు ఆస్కారం లేకపోయింది. మళ్లీ కలిపురుషుడు ప్రవేశించిన కలియుగంలో సర్వసత్తాక సర్వతంత్ర స్వతంత్ర గణతంత్ర ప్రజాతంత్రంలో ఇలాంటి యజ్ఞం జరిగినందుకు సంతోషించాలి. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు వెయ్యేళ్లకు నిలిచి వెలిగే రాజధాని కావాలి.. రావాలి. కానీ రాయలసీమ కన్నీళ్లను ఈ రాజధాని తుడుస్తుందా? రాయలసీమ భయాలను ఏ ఉద్ధండరాయుడు తొలగిస్తాడు? రాయలసీమలో ఆశ విత్తనాలను ఏ ప్రభువు, ఏ హెలికాప్టర్ నుంచి చల్లుతాడు ?

గోదావరి, కృష్ణ అనుసంధానం అయిపోయింది. ఇక గోదావరి-కృష్ణ-పెన్న, ఆపై కావేరి-పెన్న, ఆ తరువాత సీమ కరువు అసూయపడి పారిపోవడం అంటుంటే జలవనరుల నిపుణుల నోట మాట రావడంలేదు. నాగలి పట్టి దున్నుతుంటే రైతు చెమట చాళ్లల్లో నీళ్లుగా పారుతుందేమో కానీ ఈ నేలలో విత్తనానికి తడెక్కడ దొరుకుతుందని విద్వాన్ విశ్వం కన్నీరు కార్చాడు. అనంతపురం జిల్లాలో మొన్నమొన్నటి వరకు కొగిర జైసీతారాం పేరు తెలియనివారుండరు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి కవిత్వం. పరిటాల రవి పెళ్లి పెద్దల్లో ఒకరు. 'చలిమంట' పేరిట ఆయన రాసిన దీర్ఘ కవిత పెనుకొండ మాండలికంలో ఆయనే సంభాషణాత్మకంగా చదువుతుంటే విన్నవారి గుండె తరుక్కుపోతుంది. సీమ దుస్థితికి దర్పణం. అత్తా-కోడళ్లు, సరిగా పైకప్పు కూడా లేని పూరి గుడిసె, మంచం మీద కదలలేని అత్త చలికి తట్టుకోలేకపోతుంటే గుడిసె పైకప్పుగా ఉన్న గడ్డినే కొంచెం లాగి కోడలు చలిమంట వేస్తుంది. ఆ క్షణానికి అత్తకి అదే అవసరం. కోడలికి అదొక ఉపాయం. కొగిర జై సీతారాం ఇప్పుడు మన మధ్య లేరు. కానీ సీమలో గుడిసెలున్నాయి. చలిమంటలోలా అత్తా-కోడళ్లున్నారు. ప్రకృతి ప్రకోపానికి వణికిపోయేవారున్నారు. నెలకు రెండు వేలు, మూడు వేల రూపాయలు సంపాదించడానికి ఊరు కాని ఊరు, భాష కాని భాష అయిన కేరళ రేకుల షెడ్లలో ఉండడానికి వలస వెళ్తున్నవారు ఉన్నారు.

సీమకు ఇప్పుడు పులులు, సింహాలు అక్కర్లేదు. కావాల్సింది నీళ్లు, ఉద్యోగాలు. సన్రైజింగ్ స్టేట్లో సన్లు మాత్రమే రైజ్ అవుతున్నారు. సీమ జనం రైజ్ కావడానికి సూర్యుడెప్పుడొస్తాడో ?

- పమిడికాల్వ మధుసూదన్
email : madhupamidikalva@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement