మాట మరియు మరణము
ప్రోజ్ పొయెమ్
అపుడు కదా, చీకటి గుహలో ఒంటిగా ఉన్నపుడు పూలరెక్కలతో ఎగిరివచ్చి మదిలో కొన్ని మిణుగురులను పొదుగుతావు. ఇన్ని యుగాలు ఏమైపోయావ్- బ్రహ్మనడిగి నీ చిరునామా కనుక్కొన్నా తెలుసా అంటో కొన్ని మంత్రపుష్పాలు చల్లి ఎడారిని సరస్సుగా మారుస్తావు. పిల్లలమై పిల్లులమై కిచకిచలాడుకుంటున్నవేళ పొత్తిళ్లలో కొన్ని కలల్ని వదులుతావు. ఎద ఆన్చి అద్వైతం అంటే ఇదే, ఇదొక్కటే, ఇది మాత్రమే నిత్యమూ సత్యమూ శాశ్వతమూ అని కొత్త భాష నేర్పుతావు. అర్ధనారీశ్వరులమై ఏకదేహమున శివసాయుజ్యం పొందెదమని ఆన పెడతావు.
చేయి వదిలితివా నా ప్రాణమేనని బేలకళ్లతో కువకువమంటావు. మాటలను వెలిగించి చలి కాచుకుంటూ ఉంటానా, కాగితప్పడవలు చేసి జలపాతాల్లో ఆటలాడుకుంటూ ఉంటానా, గాలిబుడగలు చేసి ఆకాశపు అంచుల్లో విహరిస్తూ ఉంటానా! అపుడు కదా, గాలిదుమారంలాగా వచ్చి పిచ్చీ అవి బుడగలు కావు, కండోమ్స్ అంటావు- కొత్తనైన చూపుతో.
- నవదీప్