వైఎస్ లేఖ ఒక అనివార్యత! | Ys Rajasekhara reddy's Government gives letter to tribunal over Krishna waters | Sakshi
Sakshi News home page

వైఎస్ లేఖ ఒక అనివార్యత!

Published Tue, Dec 3 2013 3:13 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

వైఎస్ లేఖ ఒక అనివార్యత! - Sakshi

వైఎస్ లేఖ ఒక అనివార్యత!

ప్రస్తుతం టీడీపీ గోల చేస్తున్న ‘వైఎస్ లేఖ’కు కూడా చంద్రబాబు వైఫల్యాలే మూలం. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్ణాటక 1997 మార్చి 1న సుప్రీంకోర్టుకు (కేసు నం.ఓఎస్ 1/1997) వెళ్లింది. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఈ ప్రాజెక్టులను చేపట్టడం, ఆ వెంటనే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడం జరిగిపోయాయి. దాంతో మరోసారి కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించి ట్రిబ్యునల్ ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది. దాంతో వైఎస్ ప్రభుత్వం అనివార్యంగా ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వాల్సి వచ్చింది. ‘మిగులు జలాలపై మాకు స్వేచ్ఛ ఉంది. ఒక హక్కుగా మేం కోరడం లేదు. అనుమతించండి’ అని వైఎస్ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. దాంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. చంద్రబాబు వైఫల్యాల పుణ్యమా అని కృష్ణా ట్రిబ్యునల్ రాష్ట్రానికి నష్టదాయకమైన తీర్పు వెలువరిస్తే.. వైఎస్ లేఖకు తనదైన శైలిలో వింత భాష్యాలు చెబుతూ ట్రిబ్యునల్ నష్టదాయక తీర్పుకు వైఎస్సే కారణవుని చంద్రబాబు నిందించే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం!
 
బాబు నిర్వాకం గాలేరు నగరికి తెలుసు..
1985లో రాయలసీమ ఉద్యమ ఒత్తిడి కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా శేషాచల రిజర్వాయర్‌కు రూ.30 లక్షలతో శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 1990 ఫిబ్రవరిలో మంత్రివర్గ సమావేశంలో గాలేరు నగరికి సంబంధించిన పనుల్ని చేపట్టాలని నిర్ణయించారు. 1993లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్‌ను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామిరెడ్డి అప్పటి సీఎం విజయభాస్కరరెడ్డికి సమర్పించారు. అనంతరం ప్రాజెక్టులో భాగమైన మిట్టకందాల డీప్ వెడ ల్పు పనులకు, గండికోట రిజర్వాయర్  తదితర పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకోసం రూ. 50 కోట్లను కూడా కేటాయించారు.

అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నారుు. చివరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 డిసెంబర్ 5న గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 1996లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దాంతో గాలేరు నగరిలో భాగమైన గండికోట రిజర్వాయర్‌కు బాబు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్టు  ప్రకటించారు. అరుుతే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులూ లేకపోవడమే విచిత్రం. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్ని పట్టించుకోలేదు. చంద్రబాబు గద్దె దిగే 2004 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎంతో విలువైన సమయం వృథా అయింది. వైఎస్ అధికారంలోకి రాగానే 2004 జూన్ 10న ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు జీవో ఇచ్చారు. ఒక్క గాలేరు నగరే కాదు హంద్రీ-నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో బాబు నిర్లక్ష్యం ఇలాగే కొనసాగింది.
 
ప్రాజెక్టుల కోసం వైఎస్ యాత్ర..
సాగునీటి ప్రాజెక్టులపై బాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ అనుక్షణం ప్రయత్నించారు. ఇందుకోసం ఏకంగా యాత్రనే చేపట్టారు. ఈ యాత్రలో చంద్రబాబు చేసిన శంకుస్థాపనలను గుర్తుచేస్తూ... వాటి వద్ద మొక్కలు నాటడంతో పాటు వాటికి ‘స్మృతి చిహ్నాలు’గా నామకరణం చేశారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర సమయంలో కూడా ప్రాజెక్టుల ప్రాంతానికి వైఎస్ వెళ్లారు. ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. 2002 సెప్టెంబర్ 16న ఆయన యాత్రను ప్రారంభించారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి 1999 జూన్ 25న నాటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ వద్ద శంకుస్థాపన చేశారు.

 

అదే ప్రాంతం నుంచి వైఎస్ యాత్రను ప్రారంభించారు. 1999లో శంకుస్థాపన చేసినప్పటికీ 2002 వరకూ ఒక్క రూపాయి కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు చేపట్టాలని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కనేకల్, బెలుగుప్ప, ఆత్మకూరు తదితర ప్రాంతాలను 2002 సెప్టెంబర్ 18వ తేదీన వైఎస్ సందర్శించారు. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో ఒకసారి... 1999లో ఆత్మకూరు వద్ద మరోసారి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని వైఎస్ డిమాండ్ చేశారు.

 

చంద్రబాబు శంకుస్థాపన చేసిన పైలాన్స్ వద్ద మొక్కలు నాటారు. కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన వెలిగల్లు ప్రాజెక్టును పూర్తిచేయాలని వైఎస్ 2002 సెప్టెంబర్ 20న గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన వేసిన చంద్రబాబు... ఒక్క పైసా నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు. 1988లో ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఆయన మరణానంతరం చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ 2002 నాటికి 14 సంవత్సరాలైన సందర్భంగా... ఆక్కడి పైలాన్ చుట్టూ 14 మొక్కలను 2002 సెప్టెంబర్ 23న వైఎస్ నాటారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ సంగతి పక్కనపెడితే.... కనీసం గతంలో ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను సైతం నిర్లక్ష్యం చేయడాన్ని వైఎస్ దుయ్యబట్టారు. భవిష్యత్తులో రాబోయే నీటి ముప్పును ముందే గ్రహించిన వైఎస్... బాబు కళ్లు తెరిపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ బాబు పట్టించుకోలేదు.
 
రాష్ట్రానికి బాబు ద్రోహం ఇలా...

  •  ‘ఫస్ట్ ఇన్ టైం, ఫస్ట్ ఇన్ రైట్’ అనే స్ఫూర్తితో, బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసేలోపు ప్రాజెక్టులు నిర్మించాలని ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బాబు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోలేదు. అందిపుచ్చుకోలేదు! ప్రాజెక్టులను పట్టించుకోలేదు సరికదా ఎన్టీఆర్ పిలిచిన టెండర్లనూ రద్దు చేశారు!
  •    జలవినియోగంలో ముందుంటేనే హక్కులు సాధించుకోవచ్చునని కర్ణాటక యుద్ధప్రాతిపదికన ఆలమట్టి వంటి ప్రాజెక్టులు చేపడితే... ఆ వేగమెందుకో చంద్రబాబు అర్థం చేసుకోలేదు. అడ్డుకోలేదు. సరికదా కేంద్రంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో చక్రం తిప్పే స్థాయిలో తనూ పరోక్షంగా ఆ రాష్ట్రానికి సాయపడ్డారు!
  •    పాత ట్రిబ్యునల్ గడువుకు నాలుగేళ్ల ఏళ్ల ముందు కాలం, గడువు ముగిశాక కొత్త ట్రిబ్యునల్ ఏర్పడటానికి పట్టిన మరో 4 ఏళ్ల వ్యవధి.. అంటే 1996-2004లో కర్ణాటక, మహారాష్ట్రలు ప్రాజెక్టులపై ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని వెచ్చించాయి. ప్రాజెక్టుల్ని నిర్మించుకోవాల్సిన విలువైన అవకాశాన్ని మన రాష్ట్రం కోల్పోయిందీ ఈ కాలంలోనే. బాబు పాలనాకాలమూ అదే.
  •    ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకత గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ఎలుగెత్తినా... చరిత్రహీనుడవుతావంటూ హెచ్చరించినా... పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటినా... చంద్రబాబు కళ్లు తెరుచుకోలేదు.
  •    తనకు ప్రాజెక్టుల నిర్మాణం చేతగాకపోగా... 2004 తరువాత వైఎస్ చేపట్టిన జలయజ్ఞానికి కూడా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారు.

 
 బాబు మార్కు స్ఫూర్తి ఇదీ..
 కర్ణాటక 300 టీఎంసీల సామర్థ్యంతో ఆలమట్టిని  నిర్మిస్తుంటే దాన్ని నిలువరించలేని చంద్రబాబు అనంతపురం జిల్లా హద్దుల్లో 300 ఎంసీఎఫ్‌టీ స్థాయిలో నిర్మించే ఓ చిన్న చెరువులాంటి పరగోడు ప్రాజెక్టును రచ్చ చేయటానికి ప్రయత్నించారు. పరిటాల రవిని ఉసిగొల్పారు. దటీజ్ బాబు మార్కు రాజనీతిజ్ఞత!
 
సుప్రీం ఉత్తర్వులిస్తేనే తీర్పు అమల్లోకి...
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా విచిత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వెంటనే అమల్లోకి రాకుండా సుప్రీంలో రాష్ర్టం గతంలోనే ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. అంటే ఈ తీర్పు గెజిట్‌లో ప్రచురితమై ఆచరణలోకి రావాలంటే సుప్రీంకోర్డు ఉత్తర్వులను జారీ చేయాలి. ఈ విషయం తెలిసి కూడా కేవలం ప్రచారం కోసం చంద్రబాబు రాష్ర్టపతి ని కలిసి తీర్పు అమల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలనడం విడ్డూరం.
 
బాబు చక్రం తిప్పినప్పుడే కర్ణాటకకు ఎక్కువ నిధులు!
తెలుగుదేశం పదేళ్ళ పాలన (1995-2004)లో నీటిపారుదల మీద పెట్టిన ఖర్చు రూ.10,663 కోట్లు. అదే పదేళ్ళలో కర్ణాటక ప్రభుత్వం నీటి పారుదలకు పెట్టిన ఖర్చు రూ.19,391 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు. ఏఐబీపీ అనేది చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్న 1996లో ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే ఆయకట్టు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం కింద అత్యధిక మొత్తంలో నిధులు చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ళలోనే కర్ణాటకకు అందాయి. ఈ పథకం ప్రారంభమైన 1996 నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్న చివరి సంవత్సరం 2004 వరకు ఎనిమిదేళ్ళలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందినది కేవలం రూ.867 కోట్లు. అదే కాలంలో కర్ణాటక ఏకంగా రూ.1954 కోట్లు దక్కించుకుంది.
 
వైఎస్ హయూంలో సాగునీటికి 4 రెట్లు ఎక్కువగా నిధులు

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత, వైఎస్ ప్రభుత్వం 2004-09 మధ్య సాగునీటి మీద చేసిన వ్యయం ఏకంగా రూ.44,530 కోట్లు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం పదేళ్ళలో పెట్టిన ఖర్చుకంటే, వైఎస్ ప్రభుత్వం అయిదేళ్లలో చేసిన వ్యయం నాలుగు రెట్లు ఎక్కువ.ఇదే కాలంలో కర్ణాటక ఇరిగేషన్ మీద పెట్టిన ఖర్చు రూ.17,604  కోట్లు మాత్రమే. అంటే వైఎస్ ప్రభుత్వం కర్ణాటకతో పోలిస్తే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందన్నమాట.
  •  
  • కర్ణాటక 1994-99 మధ్య అయిదేళ్లలో నీటిపారుదల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని... వైఎస్ ప్రభుత్వం ఒక్క 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒక్క ఏడాదిలోనే ఖర్చు చేసింది. కర్ణాటక 1999-2004 మధ్య అయిదేళ్లలో ఇరిగేషన్‌మీద ఎంత ఖర్చు చేసిందో 2006-07 సంవత్సరంలోనే వైఎస్ ప్రభుత్వం అంత డబ్బును ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల మీద వెచ్చించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement