లక్ష్యరేఖ | archery player jyothi surekha special story | Sakshi
Sakshi News home page

లక్ష్యరేఖ

Published Sun, Feb 11 2018 10:59 AM | Last Updated on Sun, Feb 11 2018 11:01 AM

archery player jyothi surekha special story - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంటున్న జ్యోతి సురేఖ

చాలా సందర్భాల్లో లక్ష్యానికి, విజయానికి మధ్య విభజన రేఖ చిన్నదిగా కనిపిస్తుంది. వింటిని గట్టిగా లాగి సూటిగా వదిలిన బాణంలా అలుపెరగక దూసుకుపోతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ సన్నని గీత చెరిగిపోయి విజయరేఖగా మారుతుంది. చివరకు తనపేరులోని రేఖను విజయ రేఖగా మార్చుకున్న జ్యోతి సురేఖలా ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. అవమానాలకు కళ్లెంవేస్తూ అవాంతరాలపై స్వారీ చేస్తూ ప్రపంచ ఆర్చరీ పటంలో తానొక పుటగా ఆవిష్కృతమవుతుంది. ప్రతిభను వెతుక్కుంటూ వచ్చే పద్మశ్రీ అవార్డులకు, ఆదర్శ పాఠాలు నేర్చుకునే వర్ధమాన క్రీడాకారులకు అర్జున అవార్డు గ్రహీత జ్యోతిసురేఖ చిరునామాగా మారుతుంది.

అప్పుడు ఆ చిన్నారి పాప వయస్సు నాలుగేళ్ల 11 నెలలు. ఆ వయసులో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిని చూడటానికే భయపడతారు. అలాంటిది నదిలో 5 కిలోమీటర్ల దూరాన్ని చేపపిల్లలా మూడుసార్లు అటూ ఇటూ 3 గంటల 6 నిమిషాల వ్యవధిలో ఈదేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించేసింది.
ఇప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు. విలువిద్యలో ఏకలవ్యుడి శిష్యురాలిలా దూసుకుపోతోంది. విల్లు చేతబూని విలువిద్యలో తనకు సాటిలేరని నిరూపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. దేశంలోనే కాంపౌండ్‌ ఆర్చరీలో తొలిసారిగా, జిల్లాలో తొలి అమ్మాయిగా అర్జున అవార్డు సాధించి వర్ధమాన క్రీడాకారులకు లక్ష్యరేఖగా మారింది.
ఆమె పేరే జ్యోతి సురేఖ.

విజయవాడ స్పోర్ట్స్‌: జ్యోతి సురేఖ 1996, జూలై 3వ తేదీన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో వెన్నం సురేంద్రకుమార్, శ్రీదుర్గకు జన్మించారు. కేవలం క్రీడల్లోనే కాదు.. చదువులోనూ టాపే. కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) పాసై అదే యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. తొలుత పిన్నవయసులోనే  స్విమ్మింగ్‌లో రాణించి.. అనంతరం ఆర్చరీని ఎంచుకుంది. అయితే, ఆర్చరీ ప్రాక్టీస్‌కు అవకాశం కుదరలేదు. స్థానికంగా ప్రోత్సాహం లభించలేదు. అయినా కుంగిపోకుండా, పట్టువిడవక తల్లిదండ్రులు, స్నేహితులు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహంతో  ప్రాక్టీస్‌ చేసి ఏషియన్‌ గేమ్స్‌లో పతకం సాధించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి రాష్ట్ర, దేశఖ్యాతిని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది.

ఘనత
ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో ప్రపంచ స్థాయిలో 14వ ర్యాంకులో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 30 పోటీల్లో పాల్గొంటే, 8 స్వర్ణ, 8 రజత, 5 కాంస్య పతకాలు కైవసం  
2015ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 80కి 80 పాయింట్లు సాధించి వరల్డ్‌ రికార్డు సమం.
2017లో 20వ ఏషియన్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 703 పాయింట్లు సాధించిన తొలి ఇండియన్‌ కాంపౌండ్‌ ఆర్చరర్‌గా ఘనత.
ఒకే ఏడాది సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ విభాగాల్లో చాంపియన్‌.
అవార్డులు
2017లో అర్జున అవార్డు, 2014లో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్‌ అవార్డు, 2013లో వరల్డ్‌ ఆర్చరీ  ఫిటా గోల్డెన్‌ టార్గెట్‌ అవార్డు, 2002లో భారత ప్రభుత్వం నుంచి ఎక్స్‌సెప్షనల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు. 2016 సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు  
2017  ఢాకాలో 20వ ఏషియన్‌ ఆర్చరీ చాంపిన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య, టీమ్‌ విభాగంలో స్వర్ణ, మిక్స్‌డ్‌ విభాగంలో రజత పతకాలు సాధించింది.

కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది
చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఆర్చరీ అంటే ఇష్టపడటంతో చేర్పించాం. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఆనందంగా ఉంది. – వెన్నం సురేంద్రకుమార్, జ్యోతి సురేఖ తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement