ఒంగోలు క్రైం: జిల్లా నుంచి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు, యాత్రికులు టూర్ ఆపరేటర్లు, కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులు, సైబర్ కేఫ్ ఆపరేటర్లతో మోసవపోవద్దని ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదూర ప్రాంతాలకు యాత్రలకు వెళ్లే స్వాములను కొందరు మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గతేడాది వివిధ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన యాత్రికులు అనేక రకాలుగా మోసపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే కేరళ డీజీపీ జిల్లా పోలీసు కార్యాలయానికి పంపిన లేఖకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. గతేడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వెబ్‌సైట్‌ను కొందరు వినియోగించుకుని యాత్రికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేశారని, యాత్రికులకు నకిలీ బుకింగ్ కూపన్లు ఇవ్వడంతో పాటు శబరిమలలో అదనపు సౌకర్యాలు కల్పిస్తామని మోసం చేసినట్లు ఎస్పీ చెప్పారు.
శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేరళ పోలీసులు వర్చువల్ క్యూ సిస్టం పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించారన్నారు. ఆ వెబ్‌సైట్ నుంచి ముందుగా దర్శనం టిక్కెట్లను ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న బుకింగ్ కూపన్లను ప్రింట్ తీసుకుని యాత్రికులు విధిగా తమ వెంట తీసుకెళ్లాల్సి ఉందన్నారు. సన్నిదానం వద్ద పోలీసులు ఆ కూపన్లను పరిశీలించి అనంతరం అయ్యప్పస్వామి దర్శనం కోసం ఎంట్రీ కార్డు ఇస్తారన్నారు.
ఈ ఏడాది నవంబర్ నుంచి జనవరి వరకు శబరిమల యాత్రకు వెళ్లేవారు ఈ ఉచిత వెబ్‌సైట్ సర్వీసును ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ముందు బుక్ చేసుకున్న వారికి ముందే దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారని కేరళ డీజీపీ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే శబరిమల యాత్రీకులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తిరిగి ఇంటికి రావచ్చని ఎస్పీ వివరించారు.
కేరళ పోలీసుల సూచనలు పాటించాలి
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములు కేరళ పోలీసుల సూచనలను విధిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ఉచిత వెబ్‌సైట్‌ను ఉపయోగించుకొని యాత్ర సుఖంగా సాగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వెబ్‌సైట్ గురించి పూర్తిగా తెలియకుంటే బాగా పరిచయం ఉన్న వారి సేవలను వినియోగించుకున్న తర్వాతే శబరిమల వెళ్లాలని ఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు.
అయ్యప్పలూ.. తస్మాత్ జాగ్రత్త!
Published Sun, Nov 9 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement