
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కిందటి (2013) అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి కాషాయపక్షానికి ఉత్తర కర్ణాటకలో ఎనలేని నష్టం కలిగించారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన మళ్లీ బీజేపీలో చేరడంతో ఉత్తర కర్ణాటక బీజేపీ కంచుకోటగా మారింది. నాలుగేళ్ల కిందటి యెడ్యూరప్ప ‘మేజిక్’ వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ బొంబాయి-కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటకగా పిలిచే ఉత్తర కర్ణాటక గత పాతికేళ్లలో బీజేపీకి కంచుకోటగా మారింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెసెస్), మహారాష్ట్ర ప్రభావం గణనీయంగా ఉన్న ఈ ప్రాంతం బీజేపీ కర్ణాటకలో ప్రబల శక్తిగా మారడానికి కారణమైంది.
కానీ, కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు యెడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగి కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) స్థాపించి ఎన్నికల్లో పోటీచేయడంతో బీజేపీకి ఈ ప్రాంతంలో చావుదెబ్బ తగిలింది. కేజేపీ మొత్తం 224 సీట్లకుగాను 203 స్థానాలకు పోటీచేసి కేవలం 8 స్థానాలే గెల్చుకుంది. ఈ పార్టీకి పది శాతం ఓట్లు దక్కడంతో బీజేపీ ఓట్ల శాతం గతంలో సాధించిన 34 నుంచి కేవలం 20 శాతానికి పడిపోయింది. ఫలితంగా బీజేపీ 2013 ఎన్నికల్లో 40 సీట్లకు పరిమితమైంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం 110 స్థానాలు గెల్చుకుంది. అయితే, మళ్లీ యెడ్యూరప్ప బీజేపీలో చేరడం, పార్టీ రాష్ట్ర శాఖలో మార్పులు తీసుకురావడంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఓట్ల శాతం అనూహ్యంగా 43కు పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 132 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత సాధించింది.
కోస్తా కర్ణాటకలో 2014 గెలుపు పునరావృతమౌతుందా?
2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో మాదిరిగానే కోస్తా కర్ణాటకలో కూడా బీజేపీ ఘోర పరాజయం పాలయింది. అయితే, పైన జరిగినట్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన రీతిలో విజయాలు నమోదు చేసుకుంది. కోస్తా ప్రాంతంలోని దక్షిణ కార్వార్ నుంచి మంగళూరు వరకూ ఉన్న ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ బీజేపీ మెజారిటీ సాధించింది. ప్రధాని నరేంద్రమోదీ చొరవతో రాష్ట్ర బీజేపీకి, యెడ్యూరప్పకు మధ్య సయోధ్య కుదరడంతో కాషాయపక్షానికి కోస్తాలో రికార్డుస్థాయిలో గెలుపు సాధ్యమైంది. ఫలితంగా కర్ణాటకలోని మొత్తం 28 సీట్లకుగాను బీజేపీ 17 సీట్లు కైవసం చేసుకుని లోక్‌సభలో సాధారణ మెజారిటీ సాధించగలిగింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 2014 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి ఫలితాలను సొంతం చేసుకుంటే కర్ణాటకలో సర్కారు ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు సాధించగలుగుతుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, యెడ్యూరప్ప సొంత పార్టీ కేజేపీకి కలిపి 34 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడో వంతు ఓట్ల శాతానికి కాంగ్రెస్ సర్కారుపైజనంలో వ్యతిరేకత. నరేంద్రమోదీ ఉధృత ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎత్తుగడలు తోడయితే బీజేపీకి 37 నుంచి 39 శాతం ఓట్లు పడవచ్చని కర్ణాటక ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కాని, నాలుగేళ్ల తేడాతో వరుసగా జరిగే రెండు ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉంటాయన్న గ్యారంటీ ఏమీ లేదని చరిత్ర చెబుతోంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్