ఈ రోజుల్లో ఎన్నికల బరిలో నిలిచి గెలవడం మాటలు కాదు. అంతా నోట్లతోనే పని. అయితే ‘మనీ’తో కాదు ‘నేమ్’తోనూ నెగ్గుకు రావచ్చంటూ కొందరు యువకులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. తమ పేరు నలుగురికీ పరిచయమైతే చాలని కొందరంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లక్షల్లో ఖర్చు.. చేసేందుకూ వెనుకాడబోమంటున్నారు. గెలిచే అవకాశాలున్నా లేకున్నా బరిలో నిలవడమే ధ్యేయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న యువతే పోటీకి ముందు వరుసలో ఉండగా, జిల్లాల్లో సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించిన యువత రెండో వరుసలో ఉన్నారు. బరిలో నిలిస్తే బలమెంతో తెలస్తుందని కొందరు, బలం నిరూపించుకొని ప్రధాన పార్టీలకు దగ్గర కావాలనే స్పృహతో ఇంకొందరు పోటీకి సై అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 25–35 ఏళ్ల వయస్సు గల యువకులు దాదాపు 250 మంది పోటీలో నిలిచారు. వీరిలో 50 మంది వివిధ పార్టీల తరఫున బరిలో ఉండగా, మిగతా వారంతా ఇండిపెండెంట్లే.
పేరొస్తే చాలు..
ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పేరు వస్తుందనే కొందరు యువకులు పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే మాటలు కాదని, అయినా తమ పేరైనా పదిమందికీ తెలుస్తుందంటున్నారు. ఖర్చులకు కూడా తగిన వనరులను సమకూర్చుకుంటున్నట్టు కొందరు చెబుతున్నారు. గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన అనుభవంతో, యువతను రాజకీయాల్లోకి ఆకర్శించేందుకు తాను రాజకీయాల్లోకి దిగానంటున్నాడు గౌటే గణేశ్. గతంలో కొత్తపల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన అనుభవంతో శివసేన టికెట్‌పై సిరిసిల్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు చెబుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అనుభవంతో నాగర్‌కర్నూలు స్థానం నుంచి పోటీకి దిగుతున్న రాజు నేత.. ‘అమరుల ఆశయ సాధనకు, రాజకీయాల పంథాను మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా’నని అంటున్నాడు. ‘నాకున్న పరిచయాలతోనే జడ్చర్ల నుంచి పోటీకి దిగుతున్నా’నని చెబుతున్నాడు కరాటే రాజు. ఇలా ఎవరికి వారు పలువురు యువకులు లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎన్నికల సమరాంగణంలోకి దూకుతున్నారు.
ఈసారి యువ ఓటర్లూ ఎక్కువే..
ఈ ఎన్నికల్లో యువత పెద్దసంఖ్యలో పోటీలో ఉంటే, ఓటర్లగానూ యువత అధిక సంఖ్యలో నమోదయ్యారు. గా ఉన్నారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 7,96,174 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 4,56,470 మంది యువకులు, 3,39,560 మంది యువతులు, 2,695 మంది ఇతరులున్నారు. ఇక, 20–29 ఏళ్ల మధ్య గల ఓటర్లూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. చాలాచోట్ల వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయని అంచనా.
నోటా గెలిస్తే.. సీటు గల్లంతే!
ఓటు వేస్తున్న క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటరు నోటాకే జై కొడుతున్న సంగతి తెలిసిందే. 2013లో నోటాను ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఈ నోటా చాలాసార్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది. చాలా సందర్భాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా.. నోటాకు వచ్చిన ఓట్లతో సమానం. ఇది నోటాకున్న శక్తి. కానీ బరిలో ఉన్న అభ్యర్థులందరికన్నా నోటాకే ఎక్కువ సీట్లు వచ్చినా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఇలాంటి సమయాల్లో.. అందరికంటే ఓట్లు సంపాదించిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ పరిస్థితులను మార్చేందుకు హరియానా ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా.. నోటాను కూడా అభ్యర్థిగా గుర్తించనున్నారు. అందరికన్నా ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే.. మళ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న హరియాణాలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు హరియాణా ఎన్నికల ప్రధానాధికారి దలీప్ సింగ్ పేర్కొన్నారు. ‘నోటాకన్నా అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తాం’ అని దలీప్ వెల్లడించారు. డిసెంబర్16న హిసార్, రోహ్‌తక్, యమునానగర్, పానిపట్, కర్నాల్ మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
సార్.. చిల్లరే ఇవ్వగలను!
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్‌లో ఓ అభ్యర్థి నామినేషన్ ధరావతుగా నాణేలను చెల్లించిన సంగతి మరువకముందే.. రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. రాజస్తాన్‌లోని పచ్‌పద్రా నియోజక వర్గంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సమర్థ రామ్ అనే 35 ఏళ్ల యువకుడు.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతోపాటుగా రూ.10వేల విలువైన నాణాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ‘ఈ చిల్లరమొత్తాన్ని లెక్కపెట్టలేను. నాకొద్దు’ అని ఆ అధికారి సమర్థ రామ్‌కు చెప్పేశారు. అయితే తన వద్ద నోట్లు లేవని.. చిల్లరమాత్రమే ఉందని చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment