
రైతులపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభించారు. రైతులపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రైతుల ద్రోహి అని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. చెప్పినదానికంటే అధికంగా రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసిన చరిత్ర టీడీపీదని దుయ్యబట్టారు.
(చదవండి : ఐయామ్ సారీ..!)
రైతులను కాల్చిచంపిన బషీర్‌బాగ్ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. చంద్రబాబు తీరును శివరామకృష్ణన్ కమిటీ కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు. రైతులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. పామాయిల్ రైతులకు రూ.84 కోట్లు ఇచ్చిన ఘనత, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు. రైతాంగంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. పార్టీకలతీతంగా నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 96 వేల 662 మంది మత్స్యకారులకు పెన్షన్ ఇస్తున్నామని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలకు టీడీపీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
(చదవండి : అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం)