సాక్షి, అమరావతి: విశాఖకు రాజధాని వెళ్తే కమ్మవాళ్లు ఎవరూ ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోరని, ఆ సామాజిక వర్గం వ్యాపారాలు చేసుకునేందుకు అమరావతితో పాటు మరో రాజధాని వచ్చినట్టవుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ‘అక్కడున్న వ్యాపారాల్లో 50 శాతం (80 శాతం వరకు ఉన్నట్లు కొందరు సభ్యులు చెప్పారు) మావాళ్లవే’ అని నాని పేర్కొన్నారు. విశాఖలో విద్య, వాణిజ్యం, హోటళ్లు, వైద్యం, ట్రాన్స్‌పోర్ట్ రంగాలలో కమ్మ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారని వివరించారు. కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనుకుంటే విశాఖకు రాజధాని ఎందుకు తరలిస్తారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఆ ఉద్దేశమే ఉంటే రాజధాని కడపకో, కర్నూలో, నెల్లూరో, ఒంగోలో, దొనకొండకో వెళ్లేదన్నారు. నిజానికి రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కమ్మ కులాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని భావిస్తే 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ మూడు రాజధానులపై చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవర్నైనా ఆదరిస్తారని, కమ్మ సోదరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నారా లోకేష్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ విశాఖలోనే ఉందని నాని చెప్పారు. నాని ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ...
మూడుసార్లు మారితే కృష్ణా, గుంటూరు అభివృద్ధి ఆగిందా?
- చంద్రబాబు విజన్ 2020 చివరికి 420గా మారి తన కుమారుడిని కూడా గెలిపించుకోలేక 20 సీట్లకే పరిమితమైంది.
- మూడు రాజధానులపై చంద్రబాబు, ఆయన బాకా మీడియా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది.
- రాజధాని ఢిల్లీ దేశానికి మధ్యలో ఉందా? స్కేలుతో కొలిచి రాజధానిని నిర్ణయిస్తారా?
- అమరావతి అనేది ఒక మోసం. సచివాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి పుణ్యక్షేత్రాన్ని ఎండబెట్టారు.
- సెక్రటేరియట్, హైకోర్టు తరలిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. మరి గతంలో మూడు సార్లు రాజధాని మారితే కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి ఆగిపోయిందా?
- రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ సీఎం జగన్‌ను బెదిరించాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఆయన (వైఎస్ జగన్) బెదిరిస్తే బెదిరే రకం కాదు.
- రెచ్చగొడితేనో, జోలె పట్టి అమరావతిలో అడుక్కుంటేనో సానుభూతి రాదు. పాపాలభైరవుడు అడుక్కుంటే ప్రజలు ఆనందపడతారే తప్ప వీడికేం ఖర్మ అంటూ ఎవరూ జాలి చూపించరు.
- చంద్రబాబు అమరావతి కోసం తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలే కానీ 151 సీట్లున్న వైఎస్ జగన్ కాదు.
- అమరావతి ప్రాంత అక్క చెల్లెమ్మలు, రైతులు అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలి.
- బందరు పోర్టుతో పాటు కృష్ణా జిల్లాలో ఇతర ప్రాజెక్టులకు, గుడివాడ నియోజకవర్గానికి ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని కోరుతున్నా.
వైఎస్ లాంటి మరణాన్ని కోరుకుంటా..
దేవుడు తనకు ఎలాంటి మరణం కావాలని అడిగితే రాజశేఖరరెడ్డి లాంటి మరణం కావాలని కోరుకుంటానని కొడాలి నాని ఉద్వేగభరితంగా చెప్పారు. ‘ఈ రాష్ట్రాన్ని చాలా మంది పాలించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆయన పేరుతో పార్టీ పెట్టి కడప, పులివెందులలో పోటీ చేస్తే అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు డిపాజిట్లు రాలేదు. పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, తరువాత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. ఇదంతా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల కాదా?’ అని నాని పేర్కొన్నారు. 70 ఏళ్ల వయసు వచ్చింది.. బలమైన పార్టీని లాక్కున్నారు.. కొడుకును కూడా గెలిపించుకోలేని బతుకు కంటే చావడం వెయ్యి రెట్లు మేలని పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment