సాక్షి, అమరావతి: శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆయన ఏమన్నారంటే..
‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత ఎక్కువ ఉండేది కాదు. చదువుకునే వాళ్లు అసెంబ్లీకి ఎక్కువ వచ్చేవాళ్లు కాదు. అందుకే శాసనమండలికి మేధావులను తీసుకొచ్చి చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. ఈ రోజు శాసనసభలో 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. చదువుకున్న వాళ్లు, బాగా అనుభవం ఉండేవాళ్లు వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ, దీనివల్ల ఏం లాభం ఉండదని, అప్పట్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది.
1934 అక్టోబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే... 8 రాష్ట్రాల్లో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో రద్దయ్యి ఐదు రాష్ట్రాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది.
అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన అవుతుంది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏమీ మండలికి ఉండవు. అందులో కూడా పెద్ద మేధావులు వస్తారని లేదు.ఎవరిని పెడతారో తెలుసు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కాదు నష్టమొస్తుంది. ప్రజలకు భారమవుతుంది. దీని వల్ల ఏ ప్రయోజనం
లేదని వ్యతిరేకిస్తున్నాను..’’
మండలి వద్దని అప్పుడు చెప్పా..: చంద్రబాబు
మండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి. శాసనమండలి రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీ రామారావు నిర్ణయించారు. అది టీడీపీ సిద్ధాంతం. దాన్ని సమర్థించాం. కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు మండలి ప్రాధాన్యత ప్రజల నుంచి తెలుసుకున్నాను. మండలి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అవకాశం వస్తుంది. కౌన్సిల్ స్వతంత్ర ప్రత్తిపత్తి కలిగినది. 10 రాష్ట్రాలు మండలి కావాలంటున్నాయి. టీచర్లు, మేధావులు మండలికొస్తారు. ఆర్థిక భారం అని చెప్పడం ఓ సాకే. ఎందుకంటే ఏడాదికి 40 రోజులకు మించి సభ ఎప్పుడూ జరగదు. కౌన్సిల్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు..’’
Comments
Please login to add a commentAdd a comment