కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి తథ్యమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. ఓటమి నుంచి ఆయనను దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. టీఎంసీ తరఫున ఎన్నికల బరిలో దిగిన అభిషేక్ డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ...‘ ఈ ఎన్నికల్లో ఓడిపోకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆయనను అలాగే ధ్యానం చేసుకోనివ్వండి. బెంగాల్‌లోని 42 లోక్‌సభ సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తామనే నమ్మకం ఉంది. మతతత్త్వ పార్టీ అయిన బీజేపీని తరిమికొట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
కాగా ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ అభిషేక్ ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. డైమండ్ హార్బర్‌లో అభిషేక్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్‌కు మద్దతుగా మే 15న మోదీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్‌లో డెమోక్రసీ గూండాక్రసీగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ గూండాలు మమత, అభిషేక్ ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు 36 గంటల్లోగా మోదీ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment