గాంధీభవన్‌లో మాట్లాడుతున్న అభిషేక్ సింఘ్వీ. చిత్రంలో కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనంతా అవినీతిమయమని, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులంతా బందిపోటు ముఠాలా ప్రజలను దోచుకున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ ఆరోపించారు. రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి అవినీతి సొమ్మునంతా కక్కిస్తామన్నారు. ‘ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌లో కూర్చుంటానని కేసీఆర్ అంటున్నారు. ఆయన ఓటమిని ముందే అంగీకరిస్తున్నారు. ఓడాక ఫాంహౌస్‌లో నిద్రపోతామనుకుంటే కుదరదు. ప్రశ్నిస్తాం.. ఆయన అవినీతిపై నిజాలు తేలుస్తాం.. నాలుగున్నరేళ్లలో ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డారో అంత సొమ్మును కక్కిస్తాం..’అని అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్‌లతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారా డని విమర్శించారు. ‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను తుంగ లో తొక్కారు. నిధులు కొల్లగొట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించారు’అని దుయ్యబట్టారు.
అమలవ్వని హామీలు.. అన్నింట్లో కమీషన్లు
కేజీ టు పీజీ విద్యా విధానం అమలు చేస్తామని దాన్ని నీరుగార్చారని అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. 16 వేలకు పైగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరగలేదని.. 1,349 ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని చెప్పారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదని, 33 వేల ప్రభుత్వ జీవోలను తొక్కిపెట్టారని, వాటి చాటున మిషన్ భగీరథ, కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇష్టారీతిన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో 2 శాతం కమీషన్ తీసుకోవాలని ప్రభుత్వంలోని నంబర్ టు చెప్పారని బహిరంగంగానే ఓ మున్సిపల్ చైర్మన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక భూ కుంభకోణాలకు అంతేలేదని, ఇలాంటి కుంభకోణాలు దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు.
సుజనాపై దాడులు రాజకీయ కుట్ర..
ఇక బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరిపై ఈడీ కేసులను అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. సుజనాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుజనా కంపెనీలపై ఈడీ దాడుల అంశంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తోందని అడగ్గా.. అదో రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం తనకు గిట్టని వారిపై ప్రతీకార దాడులకు దిగుతోందని అందులో భాగంగానే సుజనా కంపెనీలపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మోదీ ప్రభుత్వం తనను వ్యతిరేకించే వ్యక్తులపై కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతల కంపెనీలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని అడిగారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
‘థగ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్ ఇన్ తెలంగాణ’..
అవినీతిలో తెలంగాణ రెండో స్థాన ంలో ఉందని అభిషేక్ సింఘ్వీ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ‘థగ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్ ఇన్ తెలంగాణ’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజ్యంలో పుత్రుడు, పుత్రిక, పరివారానిదే పెత్తనమని ధ్వజమెత్తారు. ఈ దోపిడీ కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయని, కొద్దిరోజుల్లోనే వారి నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment