
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సినీ నటుడు రజనీకాంత్‌కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రజనీకాంత్‌కు మద్దతు పలికారు. రజనీకాంత్ పార్టీలో రాఘవ లారెన్స్ చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక తమిళ చిత్రపరిశ్రమలో కీలక హీరోగా ఉన్న తెలుగు వ్యక్తి విశాల్ సైతం తాజాగా రజనీకాంత్ మద్దతు పలికారు. రజనీకాంత్ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తానని, రజనీ తరఫున 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపారు. రాజకీయాలంటే సేవ చేయడమేనని విశాల్ పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించి.. రాజకీయాల్లో ముమ్మరంగా పాల్గొనాలని రజనీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ మద్దతు రజనీకి లభించడం కీలక పరిణామమనే చెప్పాలి. మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీచేసేందుకు విశాల్ ఉత్సాహం చూపారు. అయితే, ఎన్నికల సంఘం అతని నామినేషన్‌ను తిరస్కరించడంతో నిరుత్సాహానికి గురైన విశాల్.. ఆ ఎన్నికల్లో శశికళ వర్గానికి చెందిన దినకరన్‌కు మద్దతు తెలిపారు. దినకరన్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ రజనీ వైపు మొగ్గుచూపుతుండటం తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.