సాక్షి, మంగళగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం.. సర్వేలన్నీ లోకేష్ బాబు విజయంవైపే.. అన్ని రిపోర్టులూ చినబాబుకు తిరుగులేదనే.. ఇవీ పోలింగ్ ముగిశాక చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన నివేదికలు. ఎన్నికల్లో నారా లోకేశ్ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం.
ఎందుకిలా అయ్యింది..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఓటమిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలవడం టీడీపీ నేతలను ఆందోళనలోకి నెట్టేసింది.
రాంగ్ రిపోర్ట్
వాస్తవానికి ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక నాయకులు మండలాల వారీగా లెక్కలు కట్టారు. ప్రతి మండలంలో లోకేష్‌కు ఆధిక్యం వచ్చినట్లు చూపించారు. మొత్తం గా 25 వేలకుపైగా మెజార్టీతో చినబాబు గెలుస్తాడంటూ చంద్రబాబుకు నివేదికలు అందజేశారు. మళ్లీ అంతర్గత సర్వే చేయించుకున్న చంద్రబాబు లోకేష్ ఓటమి ఖాయమని తెలుసుకుని స్థానిక నాయకులకు చివాట్లు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులే లోకేష్ ఓడిపోతాడంటూ బెట్టింగ్ పెట్టారని సమాచారం.
అంతటా వ్యతిరేకతే..
తాడేపల్లి పట్టణంతోపాటు మండలంలో వైఎస్సార్ సీపీ 10 వేలకుపైగా మెజార్టీ రావడంతోనే ఓటమి తప్పదని గ్రహించిన నాయకులు మంగళగిరి మండలం, పట్టణంపై ఆశలు పెట్టుకున్నారు. అనంతరం దుగ్గిరాల మండలంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన మెజార్టీతో వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) 5339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
లోకేష్ రాజకీయ జీవితానికి తెరపడినట్టే(నా)
లోకేష్ పోటీ అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు లోకేష్ రాజకీయ భవిష్యత్‌కు కూడా ముగిసినట్టేనని పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడింది. పార్టీ నాయకులు ఇసుక, మట్టి దోపిడీకి సాగించారు. ఇలాంటి ప్రాంతంలో లోకేష్‌లాంటి నాయకుడ్ని తీసుకొచ్చి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ చతురత, ప్రజల్లో చొచ్చుకుపోయే తత్వం వంటి లక్షణాల ముందు లోకేష్ నిలవలేడని తెలిసి ఇక్కడ పోటీ చేయించడం అధిష్టానం తప్పేనని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ బాబు రాజకీయ భవితవ్యంపై ఆందోళనేనని చర్చించుకుంటున్నారు.
లెక్కింపునకు ముందే ఓటమి
ఈ నెల 23వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో లెక్కింపు కేంద్రానికి సైతం లోకేష్‌తోసహా మంగళగిరి నాయకులు ఎవరు వెళ్లకపోవడంతో ఓటమికి వారు ముందుగానే సిద్ధపడ్డారని స్థానిక కార్యకర్తలు అంటున్నారు. డబ్బు, అధికారం గెలిపిస్తుందనే ఆశతో ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగిన లోకేష్‌ను మంగళగిరి ఓటర్లు శంకరగిరి మాన్యాలకు పంపించారని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. రెండు రోజుల నుంచి చోటా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఫలించని చిలుక జోస్యం
ఇప్పటికే జగన్ సునామీలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు గల్లంతయ్యాయి. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయడం.. రాష్ట్రం చూపు ఇటే ఉండడం.. చివరకు చినబాబు మట్టి కరవడం జరిగాయి. ఈ బాధలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థికంగానూ చితికిపోయారు. సర్వేలన్నీ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నా.. టీడీపీపై ఉన్న అభిమానంతో అప్పులపాలయ్యారు. రాజధానిలో వివిధ రకాల బెట్టింగ్‌లతో కోట్ల రూపాయలు, భూములు నష్టపోయారు. వీరి ఆత్మవిశ్వాసం లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన చిలకజోస్యంతో అతి విశ్వాసం మారి ఇల్లు గుల్ల చేసుకున్నారు.
రాష్ట్రంలో తమకు ఒక్క సీటయినా వైఎస్సార్ సీపీ కంటే ఎక్కువగా వస్తుందని తాడికొండ మండలంలో సుమారు రూ.10 కోట్లకుపైగా పందేలు కాశారు. కానీ పందెం తల్లకిందులైంది. ఒక్క సీటు కాదు ఏకంగా 128 సీట్లు వైఎస్సార్ సీపీకి ఎక్కువగా రావడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. తుళ్లూరు మండలంలో టీడీపీకి 8 వేలకుపైగా మెజార్టీ వస్తుందని పందేలు కాశారు. ఇక్కడ 6 వేలకే పరిమితమైంది. భూములిచ్చిన రైతులు, ఓ సామాజిక వర్గం టీడీపీకి సానుకూలంగా ఉన్నా..లంక, అసైన్డ్ భూముల రైతులు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపారు. లంక అసైన్డ్ భూముల రైతులను ప్యాకేజీ విషయంలో టీడీపీ నాయకులు దారుణంగా మోసం చేశారు.
టీడీపీని తరిమికొట్టారు
అతి తక్కువ ధరలకు మంత్రుల బినామీలు కొనుగోలు చేసి చట్టబద్ధం చేసుకొనేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లంక, అసైన్డ్ భూముల రైతులకు సాధారణ రైతులకు ఇచ్చే ప్యాకేజీ కంటే 20 శాతం ఎక్కువ ఇస్తామని ప్రకటించడడంతో వారు టీడీపీని తరిమికొట్టారు. తాడికొండ మండలంలో ఒక్క ఓటు అయినా తమకు మెజార్టీ వస్తుందని వేసిన పందేలు దాదాపు రూ.40 లక్షల వరకు బెడిసికొట్టాయి. ఇక్కడ వైఎస్సార్ సీపీకి 850కిపైగా మెజార్టీ వచ్చింది. రాజధాని ప్రాంతంలో టీడీపీ పాగా వేస్తుందనే గట్టి నమ్మకంతో కొందరు బెట్టింగ్ రాయుళ్లు శ్రావణ్ కుమార్ విజయంపై భారీగా పందేలు వేసి భంగపడ్డారు.
ముంచిన ఎల్లో మీడియా
ఎల్లో మీడియా, ఆంధ్రా ఆక్టోపస్ చిలక జోస్యంను నమ్మి అప్పన్నంగా తమకే సొమ్ము వస్తుందనే అత్యాశతో లక్షల్లో పందేలు కాసి కుదేలయ్యారు. దీంతో ‘సొమ్ము పోయే... శని పట్టే’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది.
రాజధాని వ్యాప్తంగా ఇదే పరిస్థితి
రాజధానిలోని మంగళగిరిలో ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేయడంతో ఎట్టి పరిస్థితులలో విజయం సాధిస్తాడనే నమ్మకంతో పందేలు కాశారు. నామినేషన్ సమయంలోనూ భారీగా బెట్టింగ్‌లు నడిచాయి. తుళ్లూరు మండలంలోని మందడం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని ఐదెకరాలతోపాటు లగడపాటి మాటలు నమ్మి రూ.2 కోట్ల పందెం కాసి నష్టపోయినట్లు చర్చ జరుగుతోంది. రాజధాని వ్యాప్తంగా సుమారు యాభై ఎకరాలకుపైగా భూములను టీడీపీ నాయకులు పందెం కాసి భంగపడ్డారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, బేతపూడి, నీరుకొండ, నిడమర్రు గ్రామాల్లోనూ బెట్టింగ్ నడిచాయి. ఇలా రాజధాని వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వరకు టీడీపీ నేతలు బెట్టింగ్‌లు పెట్టి జేబులు గుల్ల చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment