లక్నో: ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని మధ్యలోనే అడ్డుకొని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంకను అరెస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. బాధితులను కలిసేంతవరకూ తాను వెనుతిరిగేది లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ప్రియాంక ధర్నాకు దిగిన చునార్ అతిథి గృహం వద్దకు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశిస్తూ.. ప్రియాంక మాట్లాడారు. ‘బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వారిని కలవాలన్న నా లక్ష్యం నెరవేరింది. చనిపోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. 10లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం’ అన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంకను అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్ట్ చేయడం గానీ చేయలేదన్నారు మిర్జాపూర్ డీఎం. ఇప్పుడు ప్రియాంక ఎక్కడికైనా వెల్లవచ్చని ఆయన తెలిపారు. అయితే డీఏం వ్యాఖ్యల పట్ల ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తనను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు తనను అరెస్ట్ చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితుల్ని పరామర్శించిన తాను ఇప్పటికి వెళ్లి పోతున్నానని... కానీ త్వరలోనే తిరిగి వస్తానని ప్రియాంక స్పష్టం చేశారు.
మమ్మల్నీ అడ్డుకున్నారు..
సోన్‌భద్ర బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరెక్ ఓ బ్రియెన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం కోల్‌కతా నుంచి బయలుదేరింది. అయితే తమను వారణాసి పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు డెరెక్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దాంతో వారు విమానాశ్రయ ఆవరణలోనే నిరసనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment