సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ప్యాకేజీ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులపై వివక్ష చూపిందని అమరావతి రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. టీడీపీ ప్రభుత్వంపై దాఖలైన ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది. కాగా, రైతులు ఇచ్చిన పిటిషన్‌పై విచారణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ శ్రీధర్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం తరపున మరొకరు విచారణకు హజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే తాము ప్యాకేజీ అమలు చేశామని ఏపీ ప్రభుత్వ అధికారులు కమిషన్‌కు తెలిపారు.
పొంతనలేని సమాధానాలు..
నదీ సమీపంలోని భూములకు కొట్టుకు పోయే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు చెప్పినందునే ఆ భూములకు తక్కువ ప్యాకేజి ఇచ్చామని సీఆర్‌డీఏ అధికారులు కమిషన్‌కు విన్నవించారు. కాగా, నదీ సమీపంలోనే చంద్రబాబు అక్రమ కట్టడం కూడా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జి సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం అక్రమ కట్టడం మీకు కనిపించడం లేదా అని కమిషన్ ఏపీ అధికారులను ప్రశ్నించింది. అధికారులు పొంతన లేని జవాబులు చెప్పడంతో విచారణ వాయిదా వేసింది.
మభ్యపెట్టి తమ నుంచి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇప్పించాలని, సమాన ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కమిషన్‌ను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. జరీబు రైతులకు ఇచ్చిన మాదిరిగానే అసైన్డ్ భూములకు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలనీ, రైతు కూలీలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశారు. అలాగే, జీవో నెంబర్ 41 ని రద్దు చేయాలనీ, లేదంటే హై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment