పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
ఛండీగఢ్: పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకోగా, ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ సిద్ధాంతం ప్రకారం భారత్ 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో భారత్ సైనికులను చంపుతూ మూర్ఖంగా వ్యవహరిస్తున్న పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేల కొరిగిన ప్రతి భారత సైనికుడికి బదులుగా ఆ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను హతమార్చాలన్నారు. ఇలా తక్షణమే చర్యకు దిగాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భారత్‌పైకి అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్న పాకిస్తాన్ బెదిరింపులు వట్టివేనన్నారు.
శాంతి చర్చలకు కాలం చెల్లిందని, పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. ‘పాక్ ప్రధాని (ఇమ్రాన్ ఖాన్) శాంతి చర్చల గురించి మాట్లాడతారు. ఆర్మీ జనరల్ (ఖామర్ జావేద్ బాజ్వా) మాత్రం యుద్ధం గురించి మాట్లాడతార’ని అమరీందర్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పకపోతే ఉగ్రదాడులు పునరావృతం అవుతూనే ఉంటాయన్నారు. కాగా, పుల్వామా దాడి ఖండిస్తూ పంజాబ్ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment