
సాక్షి, తాడేపల్లి : రాజకీయ అవినీతిని అంతం చేయాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. స్వచ్చమైన, పారదర్శక, అవినీతి రహిత, విప్లవాత్మక పాలను అందించేందుకు ఇకపై కూడా ఆయన కృషి చేస్తారని తెలిపారు. అంబటి రాంబాబు శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై బురదజల్లుతూ..తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికల్లో ఆయన కుమారుడు లోకేశ్‌ను ఓడించిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే కనీసం టీడీపీ నాయకులెవరూ ఆ పర్యటనలో పాల్గొనలేదని.. ఇప్పటికైనా బాబు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని సూచించారు.
చివరికి ప్రజలకు దూరమయ్యారు..
‘టీడీపీ హయాంలో మట్టి, ఇసుక, గనులు, సహజ సంపద దోచుకున్నారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. అందుకే గత ప్రభుత్వం ప్రజలకు దూరమైంది. ఇప్పుడు బాబుతో పాటు ఎల్లోమీడియా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. పారదర్శక పాలన అందించాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టోలోని హామీల అమలుకు ఆయన కృషి చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment