సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో జేడీయూతో జత కట్టేందుకు బీజేపీ దిగొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో తమతో సమానంగా సీట్లు కేటాయించేందుకు ఒప్పుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య బిహార్‌లో బీజేపీ, జేడీయూ పొత్తుపై ప్రధానంగా చర్చ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నడుమ నెలకొన్న సందిగ్ధతకు ఈ రోజు జరిగిన భేటీలో అమిత్ షా తెరదించారు. భేటీ అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బిహార్‌లో జేడీయూతో కలిసి పోటీ చేయనుందని అమిత్ షా ప్రకటించారు. బీజేపీ, జేడీయూలు సమాన లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు.
కూటమిలోని ఇతర పార్టీలకు కూడా గౌరవప్రదమైన స్థానం కల్పించి వారికి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనేది మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్(ఎల్జేపీ), కుష్వాహలు(ఆర్‌ఎల్‌ఎస్పీ) కూడా తమతో పాటు ఉన్నారని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తామంతా కలిసి పోటీ చేస్తామని అన్నారు. జేడీయూను కలుపుకోవడం వల్ల తమ సిట్టింగ్ స్థానాల్లో కోత తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment