
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం, రాజకీయ సమస్యలకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూయే కారణమని శుక్రవారం లోక్‌సభలో హోం మంత్రి అమిత్ షా నిందించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. హోం మంత్రి అయ్యాక తొలిసారిగా అమిత్ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రణాళిక ప్రకటిస్తే, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, పారదర్శక విధానాల్లో పోలింగ్ జరుగుతుందని అమిత్ షా అన్నారు.
జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) 2019 బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రపతి పాలన పొడిగింపుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, ఆ భావజాలాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదనీ, ఉగ్రవాదమే లేని, సరిహద్దుల్లో భద్రమైన దేశంగా భారత్‌ను మార్చడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. ‘కశ్మీర్‌లో మూడింట ఒక వంతు భాగం ఈ రోజు మన దగ్గర లేదు. స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్‌లోకి పాకిస్తాన్ చొరబడి, మూడింట ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత కాల్పుల విరమణను ప్రకటించింది ఎవరు? జవహర్‌లాల్ నెహ్రూయే ఆ ప్రకటన చేశారు.
ఆక్రమించిన భాగం పాకిస్తాన్ వశమైంది. నాటి ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ మాటను కూడా అప్పుడు నెహ్రూ పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. అదే ఆనాడు పటేల్ చెప్పిన మాటను నెహ్రూ పరిశీలించి, ఆయన చెప్పినట్లు విని ఉంటే ఇప్పటి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన చేతుల్లోనే ఉండేదనీ, ఆ ప్రాంతంలో అసలు ఉగ్రవాదమే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో షా స్పందిస్తూ, తాను నెహ్రూ పేరును పలకననీ, అయితే కశ్మీర్ సమస్యకు కారణం తొలి ప్రధానేనని చెప్పడంలో మాత్రం తనకు ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment