సాక్షి, అమరావతి: యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రూల్ 90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగానే నోటీసు ఇవ్వాలి. ఛైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణలోకి తీసుకోవాలి.
ఇవేమీ పట్టించుకోకుండా ఛైర్మన్ రూల్ 90ని పరిగణలోకి తీసుకున్నారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆర్ధిక మంత్రి చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులు కుట్రతోనే సభకు వచ్చారు’అని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
మంత్రిపై దాడి చేశారు: కన్నబాబు
టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రిపై దాడికి దిగారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినందుకు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని అన్నారు. శాసన మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. సభలో లోకేష్ ఫోటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపై దాడి చేసిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
వాయిదా వేయడం శోచనీయం
శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. మండలి నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చెప్పినట్టుగా సభ జరగాలని చూశారని ఆరోపించారు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్నారు. గత సెషన్‌లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
మండలిలో టీడీపీ హడావుడి
బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో అంతకుముందు టీడీపీ నేతలు శాసన మండలిలో మరోసారి హడావుడి చేశారు. దీంతో అక్కడ ప్రతిష్టంభన నెలకొంది. బిల్లుల ఆమోదంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రుల మధ్య వాగ్వాదం నడిచింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి చేద్దామని మండలి డిప్యూటీ చైర్మన్ చెప్పగా.. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ముందుగా చేపట్టాలని మంత్రి కోరారు.
దీంతో ద్రవ్యవినిమయ బిల్లు రాజ్యాంగ ఆబ్లిగేషన్ అని యనమల రామకృష్ణుడు అడ్డుతగిలారు. అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని చెప్పారు. యనమల వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సంప్రదాయం అని బుగ్గన స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని నిలదీశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు మండలిని వాయిదా వేశారు.
(చదవండి: ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం)
Comments
Please login to add a commentAdd a comment