
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల వైఖరిపై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కృష్ణా పరివాహకంలో డ్రోన్ సాయంతో వరద పరిస్థితుల్ని అంచనా వేస్తున్నామన్న ఆయన.. డ్రోన్ వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ‘శ్రీశైలం నిండకుండానే నీళ్లు కిందకి వదిలేసామని దేవినేని ఉమా అర్థంపర్థం లేకుండా వాదిస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తే చంద్రబాబు ఇల్లు ఎప్పుడో మునిగిపోయేది. అయినా.. చంద్రబాబు ఉన్నన్నాళ్లు ఎక్కడైనా నీళ్లు వచ్చాయా..? అందుకే టీడీపీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. శ్రీశైలం మొత్తం నింపి నీళ్లు వదలాలి అని సలహాలిస్తున్నారు. ఒక్కసారి పరిస్థితులు గమనించండి.
అన్ని డ్యామ్‌లను నింపి ఒకేసారి నీటిని వదిలితే 12 లక్షల క్యూసెక్కులకు పైగా వదలాల్సి వచ్చేది. అది సరైంది కాదు. ప్రతి రిజర్వాయర్‌లో కొంత వెసులుబాటు ఉంచుకుని నీళ్లు వదులుతాం. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద పోటెత్తడంతో ఇబ్బందుల్లో పడతామని గ్రహించి చంద్రబాబు ముందే హైద్రాబాద్ వెళ్లిపోయారు. ప్రకాశం బ్యారేజీకి నాలుగు రోజుల కిందట నీళ్లు వదలడం ప్రారంభించాం. ప్రతిపక్ష నాయకుడి ఇల్లు మునిగితే చూస్తూ ఊరుకోలేం కదా. ఒకవేళ అలానే వదిలేస్తే ఇల్లు మునిగేవరకు ఎవరూ స్పందించలేదని మళ్లీ మాపై విమర్శలు చేస్తారు. పోనీ వరదలకు చెబుదామా చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావద్దని. వరద ముంపు లేదనుకుంటే.. బాబు ఇంటి దగ్గర ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు. ఇసుక బస్తాలు వేసి వరద వెళ్లే మార్గానికి అడ్డంకులు సృష్టించడం సరైందేనా.
ఇక్కడ మీ ఇల్లు కాపాడుకోవడానికి వేరొకరి ఇల్లు మునిగేలా చేస్తారా. వరదలకు పడవ కొట్టుకుని వస్తే మాకు మేనేజ్‌మెంట్ తెలియదంటున్నారు. బాబులా గోదావరి పుష్కరాలు లో 29 మంది ప్రాణాలు పోగొట్టుకునేలా చేసేంత మేనేజ్‌మెంట్ మాకు తెలియదు. ఒకవేళ టీడీపీ వాళ్ల హయాంలో నీళ్లు వచ్చుంటే రూ. 50 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టేవాళ్లు. కుషన్ లేకుండా డ్యామ్‌లు మొత్తం నింపితే బ్యాక్ వాటర్ వలన గ్రామాలు ఎక్కువగా మునిగిపోతాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటిని విడుదల చేస్తున్నాం. రైతులంతా సంతోషం గా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబు పాలనా కాలంలో దేశం మొత్తం వర్షాలు లేక.. రిజర్వాయర్లకి నీళ్లు రాకుండాపోయాయి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment