సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వరదలపై చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి అనిల్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత చెబుతున్నట్లు వరద నీటిని వదిలేసి ఉంటే ఇవాళ డ్యాముల్లో నీరు ఉండేది కాదన్నారు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామని, ఈ మాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అధికార యంత్రాంగం సమన్వయంతో వరద నీటిని నిల్వ చేసుకోగలిగిందని, అయితే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి అబద్ధాలు పదే పదే చెప్పారన్నారు. జులై 29నాటికి 419 టీఎంసీలు మూడు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉందని, ఆగస్టు 3వ తేదీ శ్రీశైలానికి వరద వస్తే 6వ తేదీ నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని వదిలామన్నారు. శ్రీశైలం జలాశయానికి వచ్చిన 890 టీఎంసీల వరద నీటిని చంద్రబాబు చెప్పినట్లుగానే 580 టీఎంసీలు నింపుకున్నా..దాదాపు 300 టీఎంసీలుపైగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరివ్వాలంటే పోతిరెడ్డిపాడు 474 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా 2,500 క్యూసెక్కులు , ఇలా రెండు కలిపితే 3 వేల క్యూసెక్కుల నీరు అవుతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు 20 రోజుల్లో ఆ మొత్తం నీరు తీసుకున్నా కూడా 80 టీఎంసీలు మాత్రమే అవుతాయన్నారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని, ఈ విషయంలో వరద రాజకీయాలు చేయడం సరికాదని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో వరదల్లోనూ డబ్బులు కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే... ఇల్లు మునగక ఏమి అవుతుందని మంత్రి సూటిగా ప్రశ్నించారు. నీళ్లు రాకముందే కింద అంతస్తులోని సామాను పైన పెట్టుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర భద్రత గురించి పట్టదని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు. నీటిని నిల్వ చేసి నా ఇల్లు ముంచారని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు పదే పదే తనను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారని, పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నది నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. 1999లో శ్రీశైలంలోని పవర్ హౌస్ ముంచిన విషయం నేర్చుకోవాలా అన్నారు. ఇప్పుడు వచ్చిన వరదలకు ఒక్క పశువు కూడా చనిపోలేదని, ప్రాణ నష్టమే లేదన్నారు. కొన్ని ఇళ్లు నీట మునిగాయి. పంటలు నీట మునిగాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment