రాష్ట్రంలో నదులను అనుసంధానం చేస్తామని, ప్రపంచంలో ఐదో నగరంగా ఉండేలా అమరావతి నిర్మాణం చేపడతామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం ఉండవల్లి ప్రజావేదికలో ‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ పేరుతో 38 పేజీలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. – సాక్షి, అమరావతి
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
‘పునర్విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేక హోదా సహా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు నేరవేర్చేలా చేస్తాం. అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తాం. ఈ పథకం ఖరీఫ్ నుంచి కౌలు రైతులకు కూడా వర్తింపచేస్తాం. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రైతులందరికీ వడ్డీలేని పంట రుణాలు, ఉచితంగా ‘పంటల బీమా పథకం’ అమలు, రైతులకు 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దాంతోపాటు మామిడి, అరటి పంటలకు మ్యాంగో బోర్డ్, బనానా బోర్డ్‌లు స్థాపిస్తాం. పశువుల కొనుగోళ్లు, పశుగ్రాసంపై 75 శాతం సబ్సిడీ ఇస్తాం, కరవు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా సాధికారత
‘పసుపు–కుంకుమ పథకాన్ని ఏటా కొనసాగిస్తాం. డ్వాక్రా మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్‌లు ఇస్తాం. వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడున్న అర్హత పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతాం. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం చేస్తాం. మహిళా ఉద్యోగినులకు స్కూటర్ కొనుగోలుకు సబ్సిడీ అందిస్తాం. వచ్చే ఐదేళ్లలో మహిళా సంక్షేమానికిచ్చే నిధులను రూ.2 లక్షల కోట్లకు పెంచుతాం. మహిళల నైపుణ్యాభివృద్ధి, ప్రతి మహిళ కుటుంబ ఆదాయం నెలకు కనీసం రూ.20 వేలు వచ్చేలా చేస్తాం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తా’మని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు
బీసీ సంక్షేమం
రూ.10 వేల కోట్ల మూలధనంతో బీసీ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు చదివే పేద బీసీ విద్యార్థులందరికీ పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంటు చేస్తాం. విదేశీ విద్య ఉపకారవేతనం రూ.25 లక్షలకు పెంచుతాం. రూ.250 కోట్లతో చేనేత మార్కెటింగ్ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.10వేల భృతి ఇస్తాం. ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు జరిగే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 25 శాతం ప్లాట్లు బీసీలకు కేటాయిస్తూ.. అందులో 33 శాతం మహిళలకు కేటాయిస్తాం. బీసీల స్వయం ఉపాధి కింద 25 శాతం సబ్సిడీపై ఇన్నోవా కార్లు అందిస్తాం. మర పడవలపై డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.10 ఇస్తాం. కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.5వేల కోట్లు కేటాయింపు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కార్పొరేషన్లకు నిధుల పెంపు’ వంటి హామీలను టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు.
పింఛన్లు పెంపు
చంద్రన్న భరోసా పథకం కింద పింఛనుదారులందరికీ నెలకు రెండు వేల పింఛన్‌ను మూడు వేలకు పెంచుతామని పేర్కొన్నారు. ‘చంద్రన్న పెళ్లికానుక మొత్తాన్ని అన్నివర్గాల పేదలకు లక్ష రూపాయలకు పెంచుతాం. వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. పేద కుటుంబాలకు పండుగల సందర్భంగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇస్తాం. తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
‘ఎస్సీలకు 100 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కాల పరిమితిని 2033 వరకు పొడిగిస్తాం. విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ రూ.25 లక్షలకు పెంచుతాం. ఆదివాసీల అభివృద్ధికి స్త్రీనిధి తరహాలో ఆదివాసీ బ్యాంకు ఏర్పాటు, మాదిగ, రెల్లి, కార్పొరేషన్ , సంక్షేమ పరిధిలోకి లిడ్ క్యాప్, రెల్లి కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మైనారిటీల సంక్షేమం
‘ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం. ముస్లిం విద్యార్థ్ధుల విదేశీ విద్యకు రూ.25 లక్షలు ఇస్తాం. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీపై ఇన్నోవా కార్లు అందిస్తాం. ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక ఆటోనగర్‌లు ఏర్పాటు, ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మాణం, క్రిస్టియన్లకు విదేశీ విద్యకు రూ.25 లక్షల ఉపకార వేతనం, జెరూసలెం యాత్రకు బడ్జెట్ పెంచుతాం’ అన్నారు.
యువజన ప్రణాళిక
‘ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కేలండర్ ప్రకటిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఇంటర్ చదివి 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉన్న యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.3 వేల భృతి ఇస్తాం. ఇంటర్ కంటే పైచదువులకు విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తాం. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాల యువతీ యువకులకు.. జనాభా ప్రాతిపదికన, ప్రభుత్వ రంగంలో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తాం’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
విద్యా రంగం
అమ్మకు వందనం ద్వారా డ్రాప్ అవుట్స్ నివారణకు కృషి చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దాంతోపాటు బిడ్డలను బడికి పంపించే ప్రతి అమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు.
పరిశ్రమలు ఉపాధి కల్పన
‘కోస్తా తీరం పొడవునా బీచ్ రోడ్డు నిర్మిస్తాం. దీన్ని ప్రతి 20 కిలోమీటర్లకు జాతీయ రహదారి, ఎయిర్‌పోర్టు, పోర్టులకు అనుసంధానిస్తాం. 2.5 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలోను, మూడు లక్షల ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోను.. మొత్తం 5.5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాం. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. దశల వారీగా పంపు సెట్లను సోలార్ పంప్ సెట్లుగా మారుస్తాం. 10 లక్షల విద్యుత్ వాహనాలు నడపడం ద్వారా కాలుష్య రహిత రాష్ట్రంగా మారుస్తాం’ అని తెలిపారు.
గృహనిర్మాణం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత గృహాలు లేని అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం ఇస్తామన్నారు. ‘ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలం ఇస్తాం. పట్టణాలలో పేదలకు ప్రభుత్వమే ఉచిత గృహాలను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మిస్తాం. ఇప్పటివరకు పట్టణాలలో పక్కా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు తీసుకున్న గృహ రుణాలన్నీ రద్దు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
వైద్య రంగం
‘పౌరులందరినీ యూనివర్సల్ హెల్త్ కేర్ కిందకు తీసుకొస్తాం. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారందరికీ.. ఎన్టీఆర్ వైద్యసేవ కింద అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ పేషెంట్లకు ప్రత్యేక పెన్షన్లు ఇస్తాం. అన్ని జిల్లా కేంద్రాలలో క్యాన్సర్ ఆస్పత్రులు నిర్మిస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం:
‘సీపీఎస్ రద్దుకు అంగీకరిస్తాం. పీఆర్‌సీ నివేదిక వచ్చిన వెంటనే దానిని అమలు చేస్తాం. ఇంటి స్థలాలు కేటాయిస్తాం. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment