‘ఈచ్ మదర్’ అని ఉత్తర్వుల్లో ఇచ్చి, ఇప్పుడు బొంకుతున్న ప్రభుత్వం
‘ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం’ అని ప్రకటన చేయకుండా దోబూచులాట
ఈ విషయంపై నోరు మెదపని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్
ఆ శాఖ కార్యదర్శికి స్పందించే బాధ్యత అప్పగించి మోసం దాచివేతకు యత్నం
సాక్షి, అమరావతి : ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై దొంగాట ఆడుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 29లో ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని బొంకుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తామని గానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఇస్తామని గానీ చెప్పడం లేదు.
జీవోలో పేర్కొన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తినా తల్లికి వందనంపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గానీ నోరు విప్పక పోవడం గమనార్హం. ఇచ్చిన హామీ ప్రకారం ‘ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తాం’ అని చెప్పడానికి వీరు ఎందుకు వెనకాడుతున్నారు? పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకునెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి.. చేయబోయే మోసంపై దాటవేత ధోరణి అవలంబించారు.
అంటే జీవో నంబర్ 29లో పేర్కొన్నట్టుగానే ఒక ఇంట్లో ఒక్కరికే పథకాన్ని వర్తింప చేస్తామని మరోసారి చెప్పారు. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ సైతం ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. కూటమి తరఫున ఇచ్చిన హామీలపై ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై స్పందించక పోవడం ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పష్టమైన ప్రకటన చేయకుండా జంకుతున్న ప్రభుత్వం
ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఇంట్లో ఇద్దరుంటే రూ.30 వేలు, నలుగురుంటే రూ.60 వేలు జమ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రతి బిడ్డకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అంగన్వాడీల్లో ఆరేళ్లలోపు పిల్లలు సుమారు 25 లక్షల మంది ఉండగా, ఒకటి నుంచి ఇంటర్ వరకు 82,29,858 మంది విద్యార్థులు, మొత్తం కోటి మందికి పైగా పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలి.
కానీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా ఈ పథకంపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. జీవోలో స్పష్టంగా పేర్కొన్న ‘ఈచ్ మదర్’ అంశంపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకే‹Ô ఎందుకు స్పందించడం లేదో అర్థంగాని పరిస్థితి.
జీవో నం.29 కేంద్ర ప్రభుత్వ ఆధార్ చట్టం మేరకు డేటాను తీసుకునేందుకే ఇచ్చామని, ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమేనని శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులోనూ తల్లికి వందనంపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పారేగాని, ‘ఈచ్ మదర్’ అన్నది తప్పు అని చెప్పకపోవడం చూస్తుంటే ఈ ఉత్తర్వుల్లోని అంశాన్నే అమలు చేసేట్టు కనిపిస్తోంది.
జీవోలో ‘ఈచ్ మదర్’ అని ఎందుకు చెప్పినట్టు?
ప్రభుత్వ పాలనలో తీసుకునే నిర్ణయాలకు, చర్యలకు, అమలు చేసే పథకాలకు గవర్నమెంట్ ఆర్డర్ (జీవో) జవాబుదారీగా ఉంటుంది. సంబంధిత శాఖ మంత్రి ఆదేశం మేరకు జారీ చేసే ఉత్తర్వులను ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలి. వాటిలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇంత ప్రాధాన్యం గల ఈ జీవోలో తల్లికి వందనం అమలుపై ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నారు.
‘‘ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాముల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకం కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని పిల్లలను పాఠశాలలకు పంపుతున్న ఒక్కో తల్లి లేదా సంరక్షకుడికి సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఒకటి నుంచి ప్లస్ 2 వరకు చదివే పిల్లల తల్లుకు ఇది వర్తిస్తుంది’’ అని పేర్కొంది. ‘‘ఈచ్ మదర్’’ అని ఇంత స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు.
ఇక్కడ ‘‘ఈచ్ చిల్డ్రన్’’ అని పేర్కొని ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్టయ్యేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మే పరిస్థితి ఉండేది. దీనిపై స్పందించకుండా తల్లికి వందనం పథకంపై ఇంకా ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పడం గమనార్హం. పైగా జీవోలో పేర్కొన్నది తప్పు అని గానీ, పిల్లలు అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని గానీ ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment