తొలి ఏడాదే వాటికి రూ. 1.65 లక్షల కోట్లు అవసరం
ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ తప్పనిసరి వ్యయం రూ.2.10 లక్షల కోట్లు
అంత డబ్బు సమీకరించడం సాధ్యమా?
పథకాలు, ప్రభుత్వ ఖర్చులకు తొలి ఏడాదే రూ.3.75 లక్షల కోట్లు కావాలి
రాష్ట్ర ఆదాయం మొదటి ఏడాదిలో రూ.2.03 లక్షల కోట్లు మాత్రమే
అంటే తొలి ఏడాదే రూ.1.72 లక్షల కోట్లు అదనంగా కావాలి
ఎఫ్‌ఆర్‌బీఎం రూల్స్ ప్రకారం తొలి ఏడాది రూ.60 వేల కోట్ల అప్పుకే అనుమతి
మిగిలిన సొమ్ము సమకూర్చాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి, లేదా జనాన్ని పన్నులతో బాదాలి
ఇవి కుదరవనుకుంటే ఉద్యోగుల జీతాలు పూర్తిగా ఇవ్వటం మానెయ్యాలి
ప్రజలను మోసం చేయడానికే ఈ హామీలిచ్చినట్లు సుస్పష్టం
(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు.
ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చిన హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు.
ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవత్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది.
2024–2025లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లే
ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.
అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథకాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది.
ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట.
ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?
తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు.
కాగ్ లెక్కలు, ఆర్‌బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్‌డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది.
ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు.
అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment