
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్రలను వేగవంతం చేసింది. అనుమతుల పేరుతో మెలిక పెట్టేందుకు యత్నిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఏపీ పోలీస్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఫోన్ చేసి, పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకి తెలిపారు.
పాదయాత్రకు అనుమతులేంటి? : పోలీస్ అధికారి ప్రశ్నకు బదులిస్తూ వైవీ సుబ్బారెడ్డి.. ‘‘పాదయాత్రలకు సంబంధించి గతంలోనూ అనుమతుల ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా ఆ అంశం ఉత్పన్నం కాబోదు. అయినా, పాదయాత్ర సమాచారాన్ని ఇదివరకే డీజీపీకి తెలియజేశాం’’ అని స్పష్టం చేశారు.
రెండో సారీ అదే మాట : సదరు అధికారి ఫోన్‌లో రెండోసారి కూడా ‘అనుమతులు తీసుకోవాలి కదా’ అని అనడంతో వైవీ సుబ్బారెడ్డి సహనంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ‘‘అసలు అనుమతి అంశమే తలెత్తబోదు. పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు రేపు(శనివారం) మా పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు వచ్చి వివరాలు ఇస్తారు’’ అని బదులిచ్చారు.
బహిరంగ సభలకు కూడా అంతే : వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తే అప్పుడైనా అనుమతి కావాలికదా అని పోలీసు అధికారి అనగా, ‘ఆ విషయం మా స్థానిక నేతలు అక్కడి అధికారులతో మాట్లాడతారు’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.