సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఎల్ఫినోస్టోన్ రైల్వేస్టేషన్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్మీని రంగంలోకి దింపినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ప్రకటించారు. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీపై తొక్కిసలాట జరిగి.. 23మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌తోపాటు మరో రెండు రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను కట్టేందుకు ఆర్మీ సహకారం తీసుకుంటున్నట్టు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వచ్చే జనవరి 31నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌ను సందర్శించేందుకు కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ముంబైకి వచ్చిన సందర్భంగా ఫడ్నవిస్ ఈ ప్రకటన చేశారు.
అయితే, సీఎం ఫడ్నవిస్ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ మాజీ జవాన్ అయిన పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఆర్మీ, నిర్మలా సీతారామన్‌లను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ.. సివిల్ పనుల కోసం ఆర్మీ వనరులను వాడుకోవడం ఎంతమాత్రం సరికాదని నిర్మలను తప్పుబట్టారు. 'ఆర్మీ కర్తవ్యం యుద్ధం కోసం శిక్షణ పొందడం కానీ, సివిల్ పనుల కోసం ఉపయోగించుకోవడం కాదు నిర్మలాజీ. రక్షణ వనరులను పౌర పనుల కోసం వినియోగించరాదు. 1962 చైనా యుద్ధం సమయంలోనూ జనరల్ కౌల్ ఇదే విధంగా వ్యవహరించారు. ఇలా చేయడం సరైన సంప్రదాయం కాదు. దీనిని నివారించండి ప్లీజ్' అంటూ ఆయన కామెంట్ చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సైతం ఈ విధానాన్ని ట్విట్టర్‌లో తప్పుబట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీని వాడుకోవడం చూశాం కానీ, ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పడినా..ఆర్మీని పిలిచేలా కనిపిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment