సాక్షి, న్యూఢిల్లీ : ముంబై రైల్వే స్టేషన్‌లో 23 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు పాదాచారుల వంతెనను పునర్మించే బాధ్యతను దేశ సైన్యానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంత మేరకు సమంజసం? ఈ నిర్ణయం వెనకనున్న ఉద్దేశం ఏమిటీ? రైల్వేకు సొంత ఇంజనీరింగ్ విభాగం, సొంత ప్రజా పనుల విభాగం ఉన్నప్పుడు సైన్యాన్ని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి పౌర వంతెన నిర్మాణం కోసం సైన్యాన్ని ఆహ్వానించడం బహూశ ఇదే మొదటిసారి కావచ్చు.
అలా అని సైన్యాన్ని పౌర సేవలకు పిలవలేదని కాదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు, తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగినప్పుడు సైన్యం పౌర సేవలను ఉపయోగించుకున్నాం.
ఢిల్లీలో 2016లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సమ్మేళనం నిర్వహించినప్పుడు యమునా నదిపై నీటిలో తేలియాడే వంతెనను సైన్యమే నిర్మించింది. ప్రకృతి విలయాల కారణంగా వరదలు వచ్చి, వంతెనలు తెగిపోయిన సందర్భాల్లో నీటిలో తాత్కాలికంగా తేలియాడే వంతెనలను నిర్మించడంలో సైన్యానికి ఎంతో నైపుణ్యం ఉంది. అందుకని యమునా నదిపై తాత్కాలిక వంతెన కోసమే సైన్యం సేవలను ఉపయోగించుకున్నారు. అంతకు మినహా పౌర సేవలకు సైన్యాన్ని అనవసరంగా ఉపయోగించిన సందర్భాలు ఇంతవరకు లేవు. మరి ఇప్పుడు ఎందుకు సైన్యానికి ఆ బాధ్యతను అప్పగించాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్న. (కూలిన వంతెన పునర్మిర్మాణంతోపాటు అదనంగా మరో రెండు వంతెనలను రైల్వేతో కలిసి సైన్యం నిర్మించనుంది)
ఇదే విషయమైన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించగా, వంతెన కూలి 23 మంది ప్రయాణికులు మరణించిన సంఘటన తీవ్ర విషాదకరమైనది కదా, అందుకే సైన్యాన్ని ఆహ్వానించామని సమాధానమిచ్చారు. అంటే, ఆమె ఉద్దేశం ఏమిటీ? రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వంతెన కూలితే ఆ విషయాన్ని ప్రజలు మరచి పోయేలా చేయడం కోసం సైన్యాన్ని పిలిచి ఆర్భాటం చేస్తున్నట్లా? సైనిక ప్రతిష్టతోనే పోయిన ప్రభుత్వం ప్రతిష్టను కాపాడుకోవాలని అనుకుంటున్నారా? అదే నిజమైతే నిర్మలా సీతారామన్ తనకు తెలియకుండానే నిజం మాట్లాడినట్లు.
ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెడితే సైన్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిటైర్డ్ సైనికాధికారులందరూ విమర్శిస్తున్నారు. ఇంకా సర్వీసులో కొనసాగుతున్న సీనియర్ అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. వారు విప్పకూడదు కూడా. దేశ సైనిక ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వివరణ ఇచ్చారు. మన సైనిక నైపుణ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది దోహద పడుతుందని, తద్వారా పౌరులతోని సైన్యానికి సత్సంబంధాలు ఏర్పడతాయని కూడా ఆయన చెప్పారు.
ఇదే సూత్రంతో కశ్మీర్ పౌరుల్లోకి సైనికులు చొచ్చుకుపోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకులకన్నా వారే ఎక్కువ పరిపాలకులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాదేశాలను పట్టించుకోక పోవడం, విస్తత అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగించుకోవడం వారికి అలవాటయింది. అలాంటి ప్రమాదం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి దేశ రాజకీయాల్లో కూడా సైనికుల జోక్యానికి ఆస్కారం ఇవ్వొచ్చు. ఆర్మీ చీఫ్‌ను నియమించేటప్పుటు ప్రధానంగా సీనియారిటీ చూస్తారు. ఈసారి సీనియారిటీని పక్కన పెట్టి బిపిన్ రావత్‌ను నియమించడంలోనే పెద్ద రాజకీయం ఉంది. అలాంటప్పుడు రాజకీయాల్లోకి సైనికులొస్తే తప్పా!!
Comments
Please login to add a commentAdd a comment